ఉద్యోగుల ఆందోళనలు.. సీఎం కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల డిమాండ్ లు పెద్ద ఎత్తున చేస్తున్న తరుణంలో స్పందన కార్యక్రమంపై సమీక్షలో భాగంగా సిఎం వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఇతర ఉన్నతాధికారులతో స్పందనపై సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పీఆర్సీ అమలు అంశం… కోవిడ్ కేసులు పెరుగుదల, గృహ నిర్మాణాలు, స్పందన కార్యక్రమం, సుస్థిర ప్రగతి లక్ష్యాలు (ఎస్‌డీజీ), ఉపాధిహామీ పనులపై సీఎం ఈ సమీక్షలో చర్చించారు. అలాగే ఈ నెలలో అమలు చేయనున్న పథకాల సన్నద్ధతపైనా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… పీఆర్సీ అమలు సహా, ఉద్యోగుల కోసం కొన్ని ప్రకటనలు చేశామని ఆయన తెలిపారు. అలాగే కరోనా సోకి మరణించిన ఫ్రంట్‌ లైన్‌ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి ఉద్యోగాలు ఇవ్వడంపై ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని అన్నారు. కారుణ్య నియామకాలు చేయమని చెప్పామని సిఎం జగన్ గుర్తు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న ఖాళీలను వినియోగించుకోవాలని సూచించారు. ఇతర విభాగాల్లో ఉద్యోగాలంటే ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి, అలాంటి సమస్యలు లేకుండా యుద్ద ప్రాతిపదికన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇవ్వాలని స్పష్టం చేశారు.

జూన్‌ 30లోగా కారుణ్య నియామకాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అన్ని విభాగాలూ దీనిపై దృష్టిపెట్టాలని స్పష్టం చేశారు. ముందుగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉన్న పోస్టులను ప్రాధాన్యతగా తీసుకుని కారుణ్య నియామకాలు చేయాలని ఆదేశించారు. ఇక రిజిస్ట్రేషన్ అంశం గురించి మాట్లాడుతూ… జగనన్న స్మార్ట్‌టౌన్‌ షిప్స్‌లో 10శాతం స్థలాలను, 20 శాతం రిబేటుపై కేటాయించాం అని ఆయన స్పష్టం చేేశారు.ఎంఐజీ లే అవుట్స్‌లో వీరికి స్థలాలు ఇవ్వాలి అని ఆదేశాలు ఇచ్చారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకోవాలని సూచించారు.

వారికి స్థలాలు కేటాయించేందుకు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయాలన్న సిఎం దీనివల్ల డిమాండ్‌ తెలుస్తుందని పేర్కొన్నారు. మార్చి 5లోగా స్థలాలు కోరుతున్న ఉద్యోగుల పేర్లను రిజిస్ట్రేషన్‌ చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అర్హుడైన ప్రతి ఉద్యోగికి స్ధలం కేటాయించాలన్నారు. ఇక కరోనాపై సమీక్షలో భాగంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌లో ఉన్నామని రికవరీ రేటు ప్రస్తుతం 94.72 శాతం ఉందన్నారు. కొద్ది రోజుల క్రితం గరిష్టంగా 36.02 శాతం ఉన్న పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 17.73 శాతం ఉందని ఆయన పేర్కొన్నారు. కోవిడ్‌ నివారణకు ఇదివరకు ఉన్న ఆంక్షలను కొనసాగిస్తున్నామని జగన్ వివరించారు. మరో 2 వారాలపాటు రాత్రిపూట కర్ఫ్యూను, ఆంక్షలను కొనసాగిస్తూ ఇప్పటికే వైద్యశాఖ అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారని ప్రస్తావించారు. నైట్‌ కర్ఫ్యూ, మాస్క్‌ ధరించకపోతే ఫైన్‌ విధించడం, బహిరంగ ప్రదేశాల్లో 200 మంది, ఇండోర్‌లో 100 మంది కంటే ఎక్కువ మంది గుమికూడకుండా చూడడం వంటివి సమర్ధవంతంగా చేయాలని… సినిమా ధియేటర్లు, షాపింగ్ మాల్స్‌లో కోవిడ్‌ నిబంధనలు, సోషల్‌ డిస్టేన్స్‌ పాటించేలా చూడాలని కోరారు.

Also Read : సమ్మెతో కాదు..చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం – సజ్జల

Show comments