రైతుల పై దూసుకెళ్లిన కేంద్ర మంత్రి కుమారుడి కారు , 8 మంది మృతి

ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళన హింస కు దారి తీసింది. రైతులు సహా మొత్తం ఎనిమిది మంది మృతి చెందారు. వీరిలో బీజేపీ కార్యకర్తలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ హింస వెనుక కేంద్ర మంత్రి కుమారుడి పాత్ర ఉన్నట్లు తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెళ్లువెత్తు తున్నాయి. ప్రదర్శన పైకి అతడి కారు దూసుకు రావడంతో నలుగురు రైతులు మృతి చెందినట్లు రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. అయితే.. ఆ కేంద్ర మంత్రి వాదన మరోలా ఉంది.

అసలేం జరిగింది అంటే..?

లఖింపూర్ ఖేరిలో డిప్యూటీ సిఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఆయన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా స్వగ్రామంలో మరొక కార్యక్రమానికి హాజరయ్యారు. డిప్యూటీ సీఎం పర్యటన సమాచారం అందుకున్న రైతు నాయకులు తమ నిరసన తెలియజేయడానికి తరలివచ్చారు. ఈ సమయంలో, టికునియా పట్టణంలో బిజెపి మద్దతుదారుల వాహనం ఢీకొని కొందరు రైతులు గాయపడ్డారు. ఈ సంఘటనతో ఆగ్రహించిన రైతులు ఒక కారుకు నిప్పు పెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డిప్యూటీ సీఎం కార్యక్రమం మధ్యలోనే ఆగిపోయింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో.. జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్ అక్కడికి చేరుకున్నారు. భారీగా పోలీసులను మొహరించారు.

Read Also: టీడీపీ నేతలకు కొత్త తలనొప్పి, సీట్ల మార్పు మీద కుస్తీ

ఇదిలా ఉండగా… కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా కుమారుడి వాహనంతో ముగ్గురు రైతులను తొక్కించినట్లు భారతీయ కిసాన్ యూనియన్ నాయకులు ఆరోపించారు. రైతు నాయకుడు డాక్టర్ దర్శన్‌పాల్ మాట్లాడుతూ.. డిప్యూటీ సీఎం హెలికాప్టర్‌లో వెళ్లకుండా ఉండేందుకు టికునియాలోని హెలిప్యాడ్‌ని దిగ్బంధించినట్లు చెప్పారు. కార్యక్రమం ముగుస్తోందని, ప్రజలు అక్కడి నుండి తిరిగి వెళ్తున్నారని ఆయన అన్నారు.

“అదే సమయంలో అజయ్ మిశ్రా, అతని కుమారుడు, సోదరుడు ప్రయాణిస్తున్న మూడు వాహనాలు అతివేగంతో వచ్చాయి, ఆ వాహనాలు పైకెక్కడంతో ఒక రైతు అక్కడికక్కడే మరణించాడు, మరొకరు ఆసుపత్రిలో మరణించారు” అని దర్శన్ పాల్ వెల్లడించారు. రైతు నాయకుడు తాజేందర్ విర్క్ కూడా తీవ్రంగా గాయపడ్డారు.

‘‘లఖింపూర్ ఖేరీలో జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఈ సంఘటన క్రూరమైన, అప్రజాస్వామికమైన ప్రభుత్వ వైఖరిని మరోసారి బయటపెట్టింది. రైతుల ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రభుత్వం ఎంతకైనా దిగజారుతుంది. రైతుల సహనాన్ని ప్రభుత్వం పరీక్షించాలని చూడకూడదు. రైతుల మృతిని హత్యగా పరిగణిస్తూ.. హంతకులపై కేసు నమోదు చేయాలి. నిందితులను అరెస్ట్ చేయాలి’’ అని రైతు సంఘమ్ నాయకుడు తికాయత్ డిమాండ్ చేశారు.

Also Read : వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ టౌన్ : ఏపీ స‌ర్కార్ వినూత్న నిర్ణ‌యం

అజయ్ మిశ్రా ఏం చెబుతున్నారంటే..

తన కుమారుడు ప్రయాణిస్తున్న కారు కింద పడి రైతులు మృతి చెందారన్న కథనాలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా స్పందించారు. ఈ సంఘటన జరిగినప్పుడు తన కుటుంబ సభ్యులు ఎవ్వరూ కానీ అక్కడ లేరని వివరించారు.ఏటా తమ స్వగ్రామంలో కుస్తీ పోటీలను నిర్వహిస్తామని, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకే ఉప ముఖ్యమంత్రి రావాల్సి ఉందన్నారు. లఖింపూర్‌లో ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత, తాను, ఉప ముఖ్యమంత్రి ఇద్దరం తమ స్వగ్రామానికి వెళుతున్నామని చెప్పారు. వేదికకు కొంచెం దూరంలో ఉండగా.. కొందరు రైతులు నిరసన తెలిపేందుకు అక్కడికి వస్తున్నారని తెలిసి, తమ వాహనాలను దారిమళ్లించారని చెప్పారు. ఈ నేపథ్యంలో రైతులు దాడికి దిగారని, రాళ్లు రువ్వారని వెల్లడించారు. ఈ క్రమంలో ఒక వాహనం అదుపుతప్పి రైతులపైకి దూసుకెళ్లిందని వెల్లడించారు. రైతుల్లో కలిసిపోయిన కొందరు నిందితులు తమపై కర్రలు, కత్తులతో దాడికి దిగారని, దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయని అజయ్ మిశ్రా చెబుతున్నారు. ఒక వాహనాన్ని రోడ్డుపై నుంచి పక్కకు తోసేశారని, దానికి నిప్పు పెట్టారని, ఇతర వాహనాలను కూడా ధ్వంసం చేశారని తెలిపారు. ఈ దుర్ఘటనలో తమ డ్రైవర్‌, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముగ్గురు చనిపోయారని, మరో 10-12 మంది గాయపడ్డారని చెప్పారు.

Read Also:- ఉత్త‌రాంధ్ర‌లోని మారుమూల గ్రామం ప్ర‌ధాని దృష్టికి ఎలా వెళ్ళింది?

ఈ సంఘటనలో మొత్తం ఎనిమిది మంది చనిపోయారని లఖింపూర్ జిల్లా అదనపు ఎస్పీ అరుణ్ కుమార్ సింగ్ ప్రకటించారు. మృతుల్లో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు ఉన్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా తెలిపారు. లఖింపూర్ సంఘటన దురదృష్టకరమని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ అన్నారు. ఈ సంఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహిస్తామని, లోతుగా విచారణ జరిపి ఇందులోని అన్ని కోణాలనూ వెలికితీస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 

Also Read : భారీ విజయాన్ని అందుకున్న మమతా బెనర్టీ

Show comments