Bhola cyclone -అయిదు లక్షల మందిని అంతం చేసిన భోలా తుఫాను

నవంబరు 11, 1970 న తీరాన్ని తాకి, నవంబర్ 13న శాంతించిన భోలా తుఫాను అధిక భాగం తూర్పు పాకిస్తాన్ (నేటి బంగ్లాదేశ్), కొంత మేరకు ఇండియాలోని పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కనీవినీ ఎరుగని విధ్వంసం సృష్టించి, అయిదు నుంచి అయిదున్నర లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఏటా బంగాళాఖాతంలో వచ్చే తుఫానుల్లో అత్యంత నష్టం కలిగించిన ఈ తుపాను, చరిత్రలో అత్యంత జననష్టం కలిగించిన ప్రకృతి విపత్తుల్లో ఒకటిగా నిలిచింది.

అల్పపీడనంగా మొదలైన భీకర తుఫాన్

ప్రతీ ఏటా మార్చి – జూన్, అక్టోబర్ – డిసెంబర్ నెలల్లో రెండు సార్లు బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతూ ఉంటాయి. వాటిలో  భాగంగా 1970 నవంబర్ 8న బంగాళాఖాతం మధ్యలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అది ఉత్తరం వైపు ప్రయాణం చేస్తూ, క్రమేపీ బలపడి , పదో తేదీ నాటికి బలం పుంజుకొని గంటకు 185 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో తీవ్రమైన తుఫానుగా మారి, మరుసటి రోజు గంటకు 225 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులతో అతి తీవ్రమైన తుఫానుగా మారి, నవంబర్ 12 రాత్రి తూర్పు పాకిస్తాన్ తీరాన్ని తాకింది.

చండప్రచండ వేగంతో వీచిన గాలుల వల్ల ఆరు మీటర్ల ఎత్తులో ఉవ్వెత్తున ఎగిసి పడిన అలలు సముద్ర మట్టానికి దిగువన ఉన్న తూర్పు పాకిస్తాన్ తీరాన్ని, గంగానది డెల్టాలో ఉన్న దీవులను తుడిచిపెట్టేశాయి. తుపాను తీవ్రతను భారత్, పాక్ వాతావరణ శాఖలు ముందుగా అంచనా వేసినా తగిన సమాచార వ్యవస్థ లేకపోవడంతో ఈ సమాచారం తూర్పు పాకిస్తాన్ అధికారులకు అందలేదు. నవంబర్ 12 రాత్రి పూట విరుచుకుపడిన భోలా తుఫాను కలిగించిన నష్టం 13వ తేదీ ఉదయానికి కానీ తెలియలేదు.

ఒక్క తాజుముద్దీన్ అనే ప్రాంతంలోనే 45%ప్రజలు మరణించారు. అయితే తీవ్రంగా నష్టపోయింది మాత్రం తీవ్ర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులు. 77 వేలు జనాభా ఉన్న వీరిలో 46 వేల మంది మరణించారు. కొన్ని గ్రామాలు, దీవులు సమూలంగా నాశనం కావడంతో మరణించిన వారి సంఖ్య కచ్చితంగా అంచనా వేయలేకపోయినా, అయిదు లక్షల నుంచి అయిదున్నర లక్షల మధ్య మరణాలు ఉండవచ్చని ఒక అంచనా. ఇక ఆస్తి నష్టం లెక్క కడితే ప్రస్తుత విలువ బట్టి చూస్తే 36 వేల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు.

Also Read : Konaseema Cyclone – కోనసీమ విషాదానికి పాతికేళ్లు

భారతదేశం మీద ప్రభావం

భోలా తుఫాను వల్ల నవంబర్ 8,9 తేదీల్లో అండమాన్ నికోబార్ దీవులలో, 11,12 తేదీల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం రాష్ట్రలలో భారీ వర్షాలు కురిశాయి. ప్రాణ నష్టం ఎక్కువగా లేకపోయినా పంటలు మునిగిపోవడం, ఆస్తి నష్టం ఎక్కువ స్థాయిలో సంభవించింది. ఆ సమయంలో కలకత్తా నుంచి కువైట్ బయలుదేరిన ఎంవి మహాజగమిత్ర అనే సరుకు రవాణా నౌక యాభై మంది సిబ్బందితో సహా సముద్రంలో మునిగిపోయింది.

అనంతర పరిణామాలు

నాటి పాకిస్తాన్ అధ్యక్షుడు యాహ్యా ఖాన్ భోలా తుఫాను వల్ల తూర్పు పాకిస్తాన్ లో జరిగిన నష్టం పట్ల స్పందించిన తీరు అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి కలిగించింది. ప్రభుత్వం చేపట్టిన సహాయ చర్యలు తగినంత లేవని విద్యార్థులు నవంబర్ 19న ఢాకా వీదుల్లో ర్యాలీ నిర్వహించారు. పాకిస్తాన్ తో సంబంధాలు బాగా లేకపోయినా అప్పటి ఇందిరాగాంధీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం పెద్ద మొత్తంలో సహాయం ప్రకటించింది. అయితే ఆ సహాయ సామగ్రి విమానాల్లో కాకుండా ట్రక్కుల్లో పంపించాలని నిబంధన పెట్టింది పాకిస్తాన్ ప్రభుత్వం.

పాకిస్తాన్ ప్రభుత్వం తూర్పు పాకిస్తాన్ మీద చూపిస్తున్న సవతితల్లి ప్రేమ పట్ల అసంతృప్తితో ఉన్న తూర్పు పాకిస్తాన్ ప్రజలలో భోలా తుఫాను వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చడంలో పాకిస్తాన్ ప్రభుత్వం సరిగా స్పందించక పోవడం మరింత అసంతృప్తి రగిలించింది. 1970 డిసెంబరులో జరగవలసిన ఎన్నికలు వాయిదా వేయాలన్న వారి డిమాండును యాహ్యా ఖాన్ నాయకత్వంలోని సైనిక ప్రభుత్వం అంగీకరించలేదు. అయినా ఆ ఎన్నికల్లో తూర్పు పాకిస్తాన్ పార్టీ అవామీ లీగ్ విజయం సాధించినా ఆ పార్టీ నాయకుడు షేక్ ముజిబుర్ రెహ్మాన్ కి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వలేదు.

దాంతో తూర్పు పాకిస్తాన్ లో ఉవ్వెత్తున నిరసనలు చెలరేగడంతో, ముజిబుర్ రెహమాన్ ను అరెస్టు చేసి, వాటిని అణచివేయాలని ప్రయత్నించిన పాకిస్తాన్ సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు మరింత తీవ్రంగా ఉద్యమించారు. దాంతో పాకిస్తాన్ సైన్యం నేరుగా రంగంలోకి దిగి తూర్పు పాకిస్తాన్ ప్రజల మీద సాగించిన అరాచకాలతో వేలాదిగా ప్రజలు భారతదేశంలో ప్రవేశించసాగారు. దాంతో భారత పాకిస్థాన్ దేశాల మధ్య 1971 డిసెంబర్ లో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోవడంతో తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గా అవతరించింది.

Also Read : Korangi City – కడలి గర్భంలో కలిసిపోయిన కోరంగి నగరం గురించి తెలుసా..?

Show comments