బాలయ్యకు ఉన్న చిత్తశుద్ధి.. బాబుకు లేకపాయనే..!

అధికారంలో ఉన్నప్పుడు హిందూపురం అభివృద్ధి, సమస్యల పరిష్కారంపై శ్రద్ధ చూపని బాలకృష్ణ.. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండడంతో అభివృద్ధి చేయాలంటూ ఉద్యమాలు చేస్తున్నారు. ఆ మధ్య మెడికల్‌ కాలేజీని హిందూపురంలో ఏర్పాటు చేయాలంటూ డిమాండ్‌ చేసిన బాలకృష్ణ.. తాజాగా హిందూపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని మౌనదీక్షకు దిగారు. ఈ రోజు హిందూపురంలో మౌనదీక్ష చేసిన బాలకృష్ణ పట్టణంలో ర్యాలీని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని వసతులు ఉన్న హిందూపురాన్ని జిల్లాగా చేయాలని, అప్పటి వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు. అంతేకాదు.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించి చర్చకు తెరలేపారు.

బాలయ్య ప్రకటన.. బాబుపై తమ్ముళ్ల చర్చ..

బాలయ్య చేసిన ప్రకటన టీడీపీ శ్రేణులను, ముఖ్యంగా అమరావతి రైతులను ఆకట్టుకుంటోంది. ఒక అంశంపై డిమాండ్‌ చేయడమే కాదు.. దాన్ని సాధించుకునేందుకు బాలయ్య చిత్తశుద్ధితో వ్యవహరించారని తమ్ముళ్లు, అమరావతి ఉద్యమకారులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాజీనామా చేసినా.. చేయకపోయినా.. చేస్తానన్న ప్రకటన బాలయ్య చేయడం అందరినీ ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. బాలయ్యలో ఉన్న చిత్తశుద్ధి చంద్రబాబులో లేదనే చర్చ తమ్ముళ్లు, అమరావతిలో రైతులలో జరుగుతోంది.

మూడు రాజధానులు వద్దని, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు డిమాండ్‌ చేస్తున్నారు. కొంత మంది రైతులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్ధతుగా ఉంటున్నారు. ఒకరకంగా చూస్తే.. ఉద్యమం చేస్తుంది రైతులే అయినా.. చేయిస్తున్నది చంద్రబాబేనని టీడీపీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. అమరావతి నా కల.. నా మానస పుత్రిక, రాష్ట్రం కోసం అమరావతి అవసరం, బంగారు బాతు, యువతకు భవిష్యత్‌.. అంటూ అమరావతి గురించి గంటలకొద్దీ స్పీచ్‌లు దంచేసే చంద్రబాబు.. అమరావతి కోసం చిత్తశుద్ధితో ఇప్పటివరకు పని చేయలేదనే భావన తమ్ముళ్లు, అమరావతి ఉద్యమకారుల్లో ఉంది.

అమరావతి గురించి మాట్లాడే సమయంలో.. చంద్రబాబు అమరావతిపై రెఫరెండం పెట్టాలని డిమాండ్‌ చేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని, వైసీపీ గెలిస్తే.. మూడు రాజధానులు పెట్టుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు అమరావతియే కావాలని కోరుకుంటున్నారంటూ.. రకరకాల ప్రకటనలు చేశారు. ఇలా తన చేతిలోలేని, ఆచరణ సాధ్యంకాని డిమాండ్లను చేసిన చంద్రబాబు.. తన చేతిలో ఉండే, ఆచరణలో పెట్టగలిగే టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామా..? లేదా తన రాజీనామా..? అంశాన్ని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు.

తెలంగాణ కోసం కేసీఆర్‌ రాజీనామా చేసిన విషయాలను ప్రస్తావిస్తూ.. చంద్రబాబు కర్తవ్యాన్ని వైసీపీ నేతలు గుర్తుచేసినా.. బాబు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశంపై మాత్రం మారుమాట్లడలేదు. హిందూపురం జిల్లా కోసం రాజీనామా చేస్తానని బాలయ్య చెప్పినట్లు .. అమరావతి కోసం రాజీనామా చేస్తాననే మాట చంద్రబాబు నుంచి గడిచిన రెండున్నరేళ్లలో రాకపోవడం అమరావతి పట్ల ఆయనలోని చిత్తశుద్ధికి నిదర్శనమనే చర్చ టీడీపీలో, అమరావతి ఉద్యమకారుల్లో జరుగుతోంది.

Also Read : ఈ డాన్స్ లు ఏంటీ…? టీడీపీ కార్యక్రమాల్లో వివాదం అవుతున్న పాట…!

Show comments