ఒవైసి ఇంటిపై దాడి

ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి చెందిన ఢిల్లీలోని ఇంటిపై హిందూసేనకు చెందిన కార్యకర్తలు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన నివాసం పాక్షికంగా ధ్వంసమైంది. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న ఒవైసీ ఇంటిపై ఈ దాడి జరిగింది. ఈ ఘటనకు పాల్పడిన వారిని పోలీసులు గుర్తించారు. ఐదుగురు హిందూ సేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ దీపక్‌ యాదవ్‌ తెలిపారు. నిందితులు ఈశాన్య ఢిల్లీలోని మండోలి ప్రాంతానికి చెందిన వారని ఆయన చెప్పారు. ఒవైసీ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేస్తున్నారని తమకు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులను పంపామని, అప్పటికే నిందితులు పారిపోయారని చెప్పారు. ఈ దాడిలో గేటు, కిటికీలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. నిందితులను ప్రశ్నిస్తున్నామని డీసీపీ వెల్లడించారు.

యూపీలో అసదుద్దీన్‌..

హైదరాబాద్‌ వెలుపల మహారాష్ట్రలో రెండు ఎంపీ సీట్లు, ఎమ్మెల్యేల గెలుపుతో మొదలైన మజ్లిస్‌ విస్తరణ.. గతేడాది బీహార్‌ ఎన్నికల్లో ఐదు సీట్లతో గెలుపుతో మరింత బలపడింది. పశ్చిమ బెంగాల్‌లో పరాభవం ఎదుర్కొన్నా, రాబోయే యూపీ అసెంబ్లీలో సత్తా చాటాలని అసదుద్దీన్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారు. అసదుద్దీన్‌ ఇప్పటికే భాగీదారి సంకల్ప్‌ మోర్చా(బీఎస్‌ఎం)అనే కూటమి ద్వారా తొమ్మిది స్థానిక పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. యూపీలో మొత్తం 404 సీట్లుండగా, 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లు ముఫై నుంచి నలభై శాతం దాకా ఉన్నారు. దీంతో వంద సీట్లకు తగ్గకుండా పోటీలో నిలబడేందుకు మజ్లిస్‌ ప్రయత్నిస్తోంది. దీనిలో భాగంగా అసదుద్దీన్‌ ఉత్తరప్రదేశ్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

వివాదాస్పద వ్యాఖ్యలు.. కేసు

యూపీలో పార్టీని జనంలోకి తీసుకెళ్లేందుకు అసదుద్దీన్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రచారంలో తనదైన మార్క్‌ వ్యాఖ్యలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఇటీవల మత సామరస్యానికి భంగం కలిగించేలా మాట్లాడినందుకు, ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీలోని బారాబంకిలో జరిగిన ఓ సభకు భారీ స్థాయిలో జనాలు తరలిరాగా, ఆ సందర్భంలో అసదుద్దీన్‌ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

అదే కారణమా..

అసదుద్దీన్‌ ఒవైసీ మూడు రోజుల నుంచి యూపీ పర్యటనలో ఉన్నారు. అయోధ్యలోని రుడౌలి నుంచి బహిరంగ సభ నిర్వహించారు. సుల్తాన్‌పూర్‌లో, బారాబంకిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా.. కొందరు దుండగులు ఢిల్లీలోని ఆయన నివాసంపై పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఇటుకలతో దాడి చేశారని బంగ్లా వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బం చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్‌ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి జరిగిందన్న ప్రచారం జరుగుతోంది. పోలీసులు దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు.

అమిత్‌ షా.. ఏం సమాధానం చెబుతారు?

తన నివాసంపై జరిగిన దాడిని ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఖండించారు. గూండాలను రెచ్చగొట్టి తన ఇంటిపై దాడి చేయించారని ఆయన ట్వీట్‌ చేశారు. దేశ రాజధానిలో ఓ ఎంపీ నివాసం సురక్షితంగా లేకపోతే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఏం జవాబు ఇస్తారని ఆయన ప్రశ్నించారు. ‘‘నేను లేని సమయంలో ఢిల్లీలో గూండాలు ఆయుధాలతో గుంపులుగా వెళ్లి, నా ఇంటిపై కర్రలు, గొడ్డళ్లతో దాడి చేసి పారిపోయారు. ఈ దాడిలో నా ఇంటి కాపలాదారు గాయపడ్డాడు. ఈవిధంగా దాడులతో మమ్మల్ని భయపెట్టలేరు. మజ్లిస్‌ అంటే ఏమిటో ఆ గూండాలకు తెలీదు’’ అని ఒవైసీ అన్నారు.

Show comments