‘స్వేచ్ఛ’తో తన సంకల్పాని మరోసారి చాటిన జగన్‌

ప్రభుత్వాలు ప్రజా సంక్షేమం కోసం ఎలా పనిచేయాలో చేసి చూపించిన ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి. ప్రజా సంక్షేమంలో ఆయన నిర్థేశించిన ప్రమాణాలను కొలమానాలుగా తీసుకుని తర్వాత ప్రభుత్వాల పనితీరును ప్రజలు అంచనా వేస్తున్నారంటే.. వైఎస్‌ సాగించిన ప్రజా సంక్షేమ పాలన ఎలాంటిదో ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆయన రాజకీయానికే కాదు, ఆశయాలకు కూడా వారసుడుగా వచ్చిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. ప్రజా సంక్షేమంలో తన తండ్రి నెలకొల్పిన ప్రమాణాలను మరింత ఉన్నత స్థానాలకు తీసుకెళుతున్నారు.

ప్రజల జీవన ప్రమాణాలను పెంచే లక్ష్యంతో, దృఢ సంకల్పంతో విభిన్నమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌.. తాజాగా మరో వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టింది. ‘స్వేచ్ఛ’ పేరుతో పాఠశాలలు, కళాశాలల విద్యార్థినిలకు న్యాప్‌కిన్స్‌ ఇచ్చే పథకాన్ని ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రారంభించారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోని 7వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు గల విద్యార్థినిలకు ప్రభుత్వం ఈ న్యాప్‌కిన్స్‌ను ఉచితంగా అందించనుంది. రుతు క్రమం సమయంలో విద్యార్థులు పడే ఇబ్బందులను దూరం చేసేందుకు, వారి చదువులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు జగన్‌ సర్కార్‌ ఈ పథకాన్ని తీసుకొచ్చింది.

ఈ పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థినికి ప్రతి నెలా 10 చొప్పన న్యాప్‌కిన్స్‌ పాఠశాలలోనే అందిస్తారు. ఇలా ఏడాదికి 120 న్యాప్‌కిన్స్‌ను ప్రభుత్వం ఉచింతంగా అందిస్తుంది. వేసవి శెలవుల సమయంలో.. రెండు నెలలకు సరిపడా న్యాప్‌కిన్స్‌ను ముందుగానే అందిస్తామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పారు. ఉచితంగా న్యాప్‌కిన్స్‌ అందించే స్వేచ్ఛ పథకం కోసం సర్కార్‌ ప్రతి ఏడాది 32 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. ఈ పథకం ద్వారా పది లక్షల మంది విద్యార్థినిలు ప్రయోజనం పొందనున్నారు.

Also Read : మీసాల రాజు గారు ఇప్పుడు ఏమి చేస్తున్నారు..?

సలహాలు, సూచనలకు నోడల్‌ అధికారి..

విద్యార్థినిల ఆరోగ్యమే లక్ష్యంగా న్యాప్‌కిన్స్‌ను అందిస్తున్న ప్రభుత్వం.. వారికి సలహాలు, సూచనలు అందించేందుకు కూడా ఏర్పాట్లు చేసింది. ప్రతి పాఠశాల, కళాశాలలో టీచర్, అధ్యాపకురాలిని నోడల్‌ అధికారికి నియమించింది. ఈ నోడల్‌ అధికారి న్యాప్‌కిన్స్‌ వినియోగించడం, తర్వాత వాటిని డిస్పోజ్‌ చేయడంపై అవగాహన కల్పిస్తారు. నెలకు ఒకసారి విద్యార్థినిలతో సమావేశం నిర్వహించి.. వారి సందేహాలను తీరుస్తూ.. పరిశుభ్రత, ఆరోగ్యంపై సలహాలు ఇచ్చేలా జగన్‌ సర్కార్‌ ఏర్పాట్లు చేసింది.

ఓటు బ్యాంకు రాజకీయాలకు చెల్లుచీటి..

గతంలో కొన్ని ప్రభుత్వాలు పథకాలను అమలు చేసే సమయంలో.. ఆయా పథకాల వల్ల తమ పార్టీకి ఓట్లు వస్తాయా..? రావా..? అనే అంశం బేరీజు వేసుకుని అమలు చేసేవి. ఇక ఓటు లేని విద్యార్థుల గురించి అయితే.. ఒక్క క్షణం ఆలోచించిన దాఖలాలు లేవు. ఉన్న బడులను కూడా తగ్గించేశాయి. పుస్తకాలు, యూనిఫాంలు.. సకాలంలో అందించిన పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితిని వైఎస్‌ జగన్‌ సమూలంగా మార్చివేశారు. నాడు నేడు పేరులో పాఠశాలల్లో మౌలిక వసతులు, అమ్మ ఒడి ద్వారా ఆర్థిక సాయం, జగనన్న విద్యాకానుక ద్వారా పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగ్, షూ, టై, బెల్ట్, యూనీఫాంలతో కూడిన కిట్, కంటిచూపు సమస్యలు ఉన్న వారికి వైద్యపరీక్షలు, అవసరమైన వారికి కళ్లజోళ్లు అందించడం.. తాజాగా ఆడబిడ్డలకు న్యాప్‌కిన్స్‌.. ఈ తరహాలో విద్యార్థుల భవితను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ తీసుకున్న నిర్ణయాలు చరిత్రలో నిలిచిపోతాయనడంలో సందేహం లేదు.

Also Read : రెండున్నరేళ్ల జగన్ పాలన – సమాజం కేంద్రంగా జరుగుతోన్న అభివృద్ధి ఇదే

Show comments