Idream media
Idream media
ఉచిత మంచినీళ్లు, విద్యుత్ పథకాలతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ.. ఉచిత పథకాల ద్వారా పలు రాష్ట్రాలను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. పాగా వేయాలని వ్యూహాలు పన్నుతోంది. ఇటీవల పంజాబ్ వెళ్లిన కేజ్రీవాల్ అక్కడ కొన్ని ఉచిత పథకాలను ప్రకటించారు.
ఇప్పుడు మరికొద్ది నెలల్లో జరగనున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా భారీ గా ఎన్నికల హామీలను గుప్పించారు.ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఏదోలా తన అధిక్యతను ప్రదర్శించాలని తపిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ తాజాగా ఒక అడుగు ముందుకు వేసింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తే.. యూపీ ప్రజలకు భారీ తాయిలాన్ని ప్రకటించింది. తమ పార్టీ ప్రభుత్వాన్నిఏర్పాటు చేస్తే.. విద్యుత్ గృహ వినియోగదారులకు 300 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని ప్రకటించింది.
Also Read : మమత నామినేషన్‌ను ఎన్నికల కమిషన్ తిరస్కరిస్తుందట..!
యూపీ రాష్ట్ర రాజధాని లక్నోలో పార్టీ యూపీ ఇన్ చార్జి సంజయ్ సింగ్ తో కలిసి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వంలో గృహ వినియోగదారులకు 300 యూనిట్లకు రూ.1900 చెల్లిస్తున్నారని.. అదే ఆప్ ప్రభుత్వం వస్తే.. ఆ బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదని.. పూర్తిగా ఉచితంగా ఉంటుందన్నారు. యూపీలో తాము గెలిస్తే.. అధిక కరెంటు బిల్లుతో సతమతమవుతున్న 48 లక్షల కుటుంబాలకు విద్యుత్ బిల్లుల్ని రద్దు చేస్తామన్న హామీని ఇచ్చారు. అంతేకాదు.. రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తామని.. పాత బకాయిల్ని మాఫీ చేస్తామన్నారు. యూపీలోని 403 స్థానాల్లో బరిలోకి దిగనున్నట్లుగా ఆమ్ ఆద్మీ స్పష్టం చేసింది.
ఢిల్లీలో విజయవంతమైన విద్యుత్ ఫార్ములాను ఈసారి ఉత్తరాఖండ్.. ఉత్తరప్రదేశ్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేయటం ద్వారా.. తమదైన ముద్ర వేయాలని తపిస్తున్నారు. గతంలో పంజాబ్.. గోవా ఎన్నికల్లో ఆప్ ఈ హామీ ప్రకటించినా.. దీనిపై పెద్దగా ప్రచారం జరగలేదు. కానీ.. యూపీ ఎన్నికల సందర్భంగా ఆప్ పార్టీ నేత నోటి నుంచి ఈ హామీ వచ్చినంతనే జాతీయ మీడియాతో పాటు.. పలు రాష్ట్రాల మీడియా సంస్థలు అలెర్టు అయ్యాయి. ఈ వార్తకు ప్రాధాన్యత ఇస్తున్నాయి.
ఒకవేళ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన తాజా హామీ కనుక ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళితే.. అధికార బీజేపీకి చిక్కులు తప్పవన్న మాట వినిపిస్తోంది. ఎందుకంటే.. ఇంతకాలం పేదలకు మాత్రం ఉచిత విద్యుత్ తాయిలం ఇచ్చే క్రమంలో.. తాజాగా మధ్యతరగతిని కూడా ఇందులో కలపటం లాభించటమే కాదు.. ఆమ్ ఆద్మీపార్టీ హామీపై కొత్త చర్చకు అవకాశం ఇచ్చిందని చెప్పక తప్పదు.
Also Read : కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు…?