చావు వార్తలపై స్పందించిన ప్రముఖ కమెడియన్‌!

బతికున్న సెలెబ్రిటీలు చనిపోయారంటూ వార్తలు రావటం సర్వ సాధారణం. ఆరోగ్యంగా నవ్వుతూ, తుళ్లుతూ ఉన్న వారిని కూడా సోషల్‌ మీడియాలో చంపేస్తుంటారు. ఆర్‌ఐపీలు పెట్టి సంతాపాలు తెలియజేస్తూ ఉంటారు. ఇలాంటి ఫేక్‌ వార్తలు టాలీవుడ్‌, బాలీవుడ్‌లోనే కాదు.. హాలీవుడ్‌లోనూ వస్తుంటాయి. తాజాగా, ప్రముఖ హాలీవుడ్‌ కమెడియన్‌ చనిపోయాడంటూ వార్తలు వచ్చాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఆ వార్తలపై స్వయంగా ఆయనే స్పందించారు.

తన చావు వార్తలను తానే చదువుకుంటూ ఉన్నానంటూ పేర్కొన్నారు. ఇంతకీ సంగతేంటంటే.. మీకు హాలీవుడ్‌లో స్టీవ్‌ హార్వే అనే కమెడియన్‌ గురించి తెలిసే ఉంటుంది. ఆయన పలు సినిమాలు, టీవీ షోలతో ప్రపంచవ్యాప్తంగా చాలా పేరు తెచ్చుకున్నారు. ఇక, సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫాంలలోనూ ఆయన వీడియో తెగ వైరల్‌ అవుతూ ఉంటాయి. అలాంటి ఆయన గురించిన చావు వార్త ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆయన చనిపోయాడంటూ సోషల్‌ మీడియాలో ‘‘ఆర్‌ఐపీ హార్వే’’ బాగా ట్రెండ్‌ అవుతూ ఉంది.

ఆ వార్తలు చివరకు హార్వేకు చేరాయి. ఆ వార్తలపై ఆయన తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విటర్‌ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ‘‘ నా చావు వార్తల్ని నేనే చదువుతున్నాను’’ అని పేర్కొన్నారు. సెల్‌ ఫోన్‌లో ఆ వార్తలు చదువుతున్న ఫొటోను సైతం షేర్‌ చేశారు. ఈ పోస్టుతో హార్వే చావు వార్తలకు చెక్‌ పెట్టినట్లు అయింది. హార్వే బతికే ఉన్నాడని తెలిసి ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. మరి, సోషల్‌ మీడియాలో ‘‘ ఆర్‌ఐపీ హార్వే’ ట్రెండ్‌ కావటం.. ఆ వార్తలపై స్వయంగా హార్వే వ్యంగ్యంగా స్పందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments