కేసీఆర్‌ కరుణించారు..!

కేసీఆర్‌ కరుణించారు..!

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయడానికి, వెంటనే అమలు చేయకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక కారణాలు ఉంటాయి. ఇందులో రాజకీయ పరమైన కారణాలతోపాటు ప్రజా శ్రేయస్సు కోణం కూడా ఉంటుంది. ప్రజలకు నష్టం కలిగించే నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడం మంచిదే. కానీ అదే సమయంలో మేలు చేసే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేయకపోవడం ప్రజలకు భారీ నష్టం చేకూరుస్తుంది. కొద్ది కాలానికి అమలు చేసినా.. జరిగిన నష్టం పూడ్చుకోలేనిదిగా ఉంటుంది.

వ్యవసాయపంపు సెట్లకు మీటర్లు అమర్చాలని కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ సవరణ బిల్లు –2020ను తెచ్చింది. తాము ఉచిత విద్యుత్‌ ఇస్తున్నప్పుడు ఇక మీటర్లు బిగించాల్సిన అవసరం ఏముందని కేసీఆర్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించింది. రైతులు కూడా మీటర్లు ఏర్పాటుకు సుముఖంగా లేరు. ప్రజల అభీష్టానికి అనుగుణంగా కేసీఆర్‌ సర్కార్‌ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయకపోవడం అభినందనీయమే. ప్రజా స్వామ్యంలో ప్రజల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజల అభీష్టానికి అనుగుణంగా పని చేయడం శుభపరిణామం.

రైతుల విషయంలో ఇలా ఆలోచించిన కేసీఆర్‌ సర్కార్‌.. మరో విషయంలో ప్రజలకు నష్టం చేకూర్చేలా ఇప్పటి వరకు వ్యవహరించింది. అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిన్నటి వరకు అమలు చేయకపోవడం వల్ల తెలంగాణలోని అగ్రవర్ణ నిరుద్యోగులకు నష్టం చేకూరింది.

2019 జనవరిలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈడబ్యూస్‌ రిజర్వేషన్లను కల్పించింది. విద్య, ఉద్యోగాల్లో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొంది. ఎన్నికలకు మూడు నెలల ముందు తీసుకున్న ఈ నిర్ణయంలో రాజకీయ లబ్ధి కనిపిస్తున్నా.. అగ్రవర్ణ పేదలకు పది శాతమైనా రిజర్వేషన్లు కల్పించడం స్వాగతించదగిన విషయం.

2019 జనవరిలో ఈడబ్యూఎస్‌ రిజర్వేషన్లు అందుబాటులోకి రాగా.. కేంద్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగాల్లో అమలు చేసింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేశాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం వాటిని అమలు చేసేందుకు రెండు సంవత్సరాల రెండు నెలల సమయం తీసుకోవడమే బాధాకరం. రిజర్వేషన్లు అమలు చేయకపోవడం వల్ల అగ్రవర్ణ పేద కుటుంబాల్లోని నిరుద్యోగులకు జరిగిన నష్టం పూడ్చలేనిది.

ఆలస్యంగానైనా కేసీఆర్‌ సర్కార్‌ కళ్లు తెరిచింది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఈడబ్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ, వెటర్నిరీ వర్సిటీల్లో జూనియర్, సీనియర్‌ అసిస్టెంట్స్, టైపిస్టు విభాగంలో 127 పోస్టులకు ఇటీవల టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించింది. ఇప్పటికిప్పుడు సీఎం కేసీఆర్‌కు ఈడబ్యూఎస్‌ రిజర్వేషన్‌ ఉన్న విషయం ఎలా గుర్తుకు వచ్చిందేమో గానీ.. ఈ నోటిఫికేషన్‌కు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్‌ ఆదేశాల నేపథ్యంలో మరేమాత్రం ఆలస్యం చేయకుండా టీఎస్‌పీఎస్సీ సవరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆలస్యంగానైనా కేసీఆర్‌ కరుణించినందుకు అగ్రవర్ణ పేద కుటుంబాల నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : సాగ‌ర్‌లో త‌ల‌సాని మార్క్ ప‌ని చేస్తుందా..?

Show comments