అరుదైన కాంబోలో సూపర్ స్టార్..

అరుదైన కాంబోలో సూపర్ స్టార్..

  • Published - 03:15 PM, Wed - 16 November 22
అరుదైన కాంబోలో సూపర్ స్టార్..

అభిమానులు కొన్ని కాంబినేషన్లు ఎప్పుడెప్పుడు కుదురుతాయాని ఎదురు చూస్తారు. కొన్ని జరుగుతాయి. కొన్ని ఊహలకే పరిమితమవుతాయి. దళపతి టైంలో మణిరత్నం చిరంజీవి తో సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఎందరికో కలిగింది. కానీ సాధ్యం కాలేదు.కె విశ్వనాథ్ నాగార్జున కలయిక కూడా సాధ్యపడలేదు. టైం కలిసిరాకపోయినా అంతే. అప్పుడప్పుడు ఊహించని కాంబోలు కుదిరి అభిమానులను సంతోషంలో ముంచెత్తుతాయి. అలాంటిదే జమదగ్ని. తెలుగులో విలక్షణ చిత్రాలతో పేరు తెచ్చుకున్న దర్శకుడు నీలకంఠ(షో,మిస్సమ్మ) తన స్నేహితుడు వేణుబాబుతో కలిసి నిర్మించిన ఈ చిత్రం విశేషాలు చూద్దాం.

1988. తమిళ దర్శకుడు భారతీరాజా మంచి ఫామ్ లో ఉన్న సమయం. టాలీవుడ్ నుంచి ఎందరు ప్రొడ్యూసర్లు ఆఫర్లు ఇస్తున్నా చేయలేని పరిస్థితి. ‘సీతాకోకచిలుక’ తర్వాత ఆయన చేసిన స్టార్ హీరో తెలుగు మూవీ చిరంజీవి ఆరాధన ఒక్కటే. ఇది కూడా ఆయనే తీసిన సూపర్ హిట్ చిత్రం ‘కడలోర కవితైగల్’ రీమేక్ అవ్వడం వల్ల ఒప్పుకున్నారు కానీ స్ట్రెయిట్ సబ్జెక్టు అయ్యుంటే కార్యరూపం దాల్చేది కాదని అప్పట్లో చెప్పుకునేవారు. కమల్ హాసన్ ‘ఖైదీ వేట’ షూటింగ్ జరుగుతూ ఉండగా నీలకంఠ, వేణులు కలిసి మదరాసులో భారతీరాజాను కలిశారు. కృష్ణ డేట్లు ఇచ్చారని మీతోనే చేయాలని వచ్చామని అడిగారు.

ముందు ఆశ్చర్యపోయిన భారతీరాజాకు వాళ్ళ తపన నచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ దర్శకుడితో తీస్తే రూపాయికి రెండు రూపాయలు లాభం వచ్చే మాస్ సినిమాను వద్దనుకుని తనతో చేసేందుకు సిద్ధపడిన వాళ్ళ పట్టుదలకు ఓకే అన్నారు. కృష్ణ-భారతీరాజా కాంబోలో వచ్చిన ఒకే ఒక్క సినిమా ఇది. అప్పటికే తమిళ తెలుగులో దాదాపు అందరు హీరోలకు సంగీతం అందించిన ఇళయరాజాకు కృష్ణగారికి పాటలు ఇవ్వలేదన్న లోటు దీంతో తీరిపోయింది. సెల్వరాజ్ కథకు సత్యానంద్ సంభాషణలు అందించారు. జర్నలిస్ట్ గా మార్పు కోసం తపించే పాత్రలో కృష్ణ కొత్తగా కనిపించారు. 1988 జూలై 16న విడుదలైన జమదగ్ని ఓ మేలు కలయికకు వేదికగా నిలిచింది.

Show comments