తెలుగుదేశానికి తల్లీ కూతుళ్ల గుడ్‌బై!!!

తెలుగుదేశానికి తల్లీ కూతుళ్ల గుడ్‌బై!!!

తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పే సీనియర్‌ నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అనంతపురం జిల్లాలో సీనియర్‌ నాయకురాలు, మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి ఆ పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తన కుమార్తె, మాజీ ఎమ్మెల్యే యామినీ బాలతో సహా వైఎస్సార్‌సీపీలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది. నేడో రేపో వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరడం ఖాయమైందని ఆమె అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే అనుచరులతో కలసి ఆమె విజయవాడకు చేరుకున్నారు.

2019 ఎన్నికల్లో తన కూతురుకు మరోసారి టికెట్‌ ఆశించి భంగపడడంతో అప్పటి నుంచి శమంతకమణి, యామినీ బాల పార్టీకి అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మూడు రాజధానుల బిల్లు సమయంలోనూ శమంతకమణి మండలికి గైర్హాజరయ్యారు. ఆసమయంలోనే వైఎస్సార్‌సీపీలో చేరుతారని వార్తలు వచ్చినా ఎందుకో ఆ ప్రక్రియ ఆగిపోయింది.

ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు..
నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో ఉన్న ఆమె.. మొదట కరుడు గట్టిన కాంగ్రెస్‌ వాదిగా ఉన్నారు. 1985 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి ఎస్సీ నియోజకవర్గమైన సింగనమల నుంచి పోటీ చేసి జయరామ్‌ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1989లో అక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. చెన్నారెడ్డి కేబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అప్పట్లో ఫైర్‌బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. చలోక్తులు, సామెతలతో మంచి వాగ్దాటితో మాట్లాడేవారు.

1990లో ఎదో చర్చ మీద ఎన్టీఆర్ తీవ్రంగా స్పందించి టీడీపీ తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి సభను బోయికాట్ చేసి బయటకు వెళ్లగా శమంతకమణి టీడీపీ సభ్యుల సీట్ల మీద పసుపు నీళ్లు చల్లటం పెద్ద దూమారాన్ని లేపింది.

పార్టీ మార్పు

శమంతకమణి 1994 కాంగ్రెస్‌ తరుపున పోటీచేసి ఓడిపోయారు. 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ దక్కకపోవటంతో టీడీపీలోకి వెళ్లి టీడీపీ అభ్యర్ధీ జయరాం గెలుపుకు సహాయపడ్డారు. 2004 నుంచి సింగనమలలో శైలజానాథ్‌ కాంగ్రెస్‌లో రంగ ప్రవేశం చేశారు. 2004, 2009 ఎన్నికల్లో శమంతకమణి టీడీపీ తరుపున పోటీచేసి శైలజానాథ్‌ చేతిలో ఓడిపోయారు.

శమంతకమణి కాంగ్రెస్ మరియు టీడీపీల తరుపున ఐదుసార్లు పోటీచేసి ఒక్కసారి మాత్రమే గెలిచారు కానీ అదష్టం కలిసొచ్చి మంత్రి అయ్యారు.

శమంతకమణి అల్లుడు ఉన్నతస్థాయి పోలీస్ అధికారి. ఆయన మద్దతుతో శమంతకమణి ఇరుపార్టీల తరుపున టికెట్ తెచ్చుకోగలిగారన్న ప్రచారం ఉంది.

Also Read:గాదె వెంకట రెడ్డి చేరికతో వైసీపీకి ఎంత లాభం?

2014 ఎన్నికల్లో కలసి వొచ్చిన అదృష్టం

2014 ఎన్నికల్లో టీడీపీ టికెట్ బండారు రవి కుమార్ కు ఖాయం అయ్యింది కానీ బ్యాంక్ ఉద్యోగి అయిన రవికుమార్ రాజీనామ ఆమోదంలో ఆలస్యం కావటంతో టీడీపీ టికెట్ ను శమంతకమణి MEO గా పనిచేస్తున్నతన కూతురు యామిని బాలాకు ఇప్పించుకోకలిగారు.ఆ ఎన్నికల్లో యామిని బాల గెలిచారు . బండారు రవి రాజీనామా ఆమోదించుకోలేక పోగా శమంతకమణి మాత్రం రోజుల్లోనే కూతురి రాజీనామాను ఆమోదించుకోగలిగారు.

2014 ఎన్నికల్లో తన చిన్న కుమార్తె యామినీ బాలను టీడీపీ తరుపున బరిలోకి దింపి గెలిపించుకున్నారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు శమంతకమణికి రెండవసారి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు.

2019 ఎన్నికలు

2019 ఎన్నికల్లో తన కూతురుకు మరోసారి పోటీచేసే అవకాశం వస్తుందని శమంతకమణి భావించారు. అయితే జేసీ దివాకర్‌రెడ్డి, ఆయన కొడుకు పవన్‌ ఒత్తిడితో చంద్రబాబు బండారు శ్రావణికి టికెట్‌ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జొన్నలగడ్డ పద్మావతి 40వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి వారిద్దరూ పూర్తిగా సైలెంటుగా ఉంటున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలతో చేసిన చర్చలు ఫలించడంతో ఆ పార్టీ కండువా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారు.

భవిషత్తు రాజకీయాలు

అంనతపురం జిల్లా లో తోలి మహిళా గ్రాడ్యుయేట్స్ అయినా లక్ష్మి దేవమ్మ,శమంతకమణి ఇద్దరు కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేశారు. లక్ష్మి దేవమ్మ కాంగ్రెస్ CWC సభ్యురాలిగా కూడా పనిచేశారు.

శమంతకమణి భర్త డాక్టర్ బాలన్న స్వగ్రామం,వైస్సార్ స్వగ్రామం కూడా అయినా బలపనూరు .

25 సంవత్సరాల రాజకీయ జీవితంలో పలు సార్లు అధికార పార్టీలో పనిచేసిన శమంతకమణి ఇప్పుడు వైసీపీలో చేరటం ఆమెకు లేక ఆమె కూతురు యామిని బాలాకు ఏమాత్రం ఉపయోగపడుతుందో చూడాలి…

శమంతకమణి 2024 వైసీపీ టికెట్టే లక్ష్యంగా వైసీపీలో చేరితే ఆమె ఆశ అడియాశే అయ్యే అవకాశాలు ఎక్కువ.. సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి సింగనమల నియోజకవర్గంలో బలమైన పునాదులు వేసుకుంటున్నారు. ఆవిడ భర్త సాంబశివారెడ్డికి జగన్ తో మంచి సాన్నిహిత్యం ఉంది.

శమంతకమణి వైసీపీలో చేరటం వలన అనంతపురం రాజకీయాల్లో పెనుమార్పులేమి ఉండవు.

Show comments