Dharani
Dharani
రతన్ టాటా.. భారతీయులకు పరిచయం అవసరం లేని పేరు. విశ్వసనీయతకు మారు పేరుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న టాటా సన్స్‌కు మాజీ చైర్మన్. నేడు మన దేశంలో ఉప్పు మొదలు బంగారం వరకు టాటాలు ప్రవేశించని రంగం లేదనంటే అతిశయోక్తి కాదు. కొన్నాళ్ల క్రితమే విమానయన రంగంలోకి ప్రవేశించింది టాటా సంస్థ. వేల కోట్ల వ్యాపారాలు నిర్వహిస్తున్నప్పటికి.. ప్రపంచ కుబేరుల జాబితాలో రతన్ టాటా పేరు కనిపించదు. కారణం వారు తమకు వచ్చిన లాభాలను తమ స్వంతానికి మాత్రమే వాడుకోకుండా.. తమ అభివృద్ధికి ఎంతో దోహదం చేసిన సమాజం గురించి ఆలోచించి.. తమ లాభాల్లో ఎక్కువ శాతాన్ని సమాజం కోసం వినియోగిస్తారు. దేశంలో ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించిన.. వేల కోట్ల రూపాయలు విరాళం ఇవ్వడంలో రతన్ టాటా ముందు వరుసలో ఉంటారు.
ఎన్నో వ్యాపారాలు.. ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు.. ఇక నిత్యం వాటి బాధ్యతల్లో బిజీగా ఉంటారు రతన్ టాటా. ఆయన వివాహం చేసుకోలేదనే సంగతి అందరికి తెలుసు. పెళ్లంటేనే ఇష్టం లేక వివాహం చేసుకోలేదా అంటే కాదు. అందరిలానే ఆయన కూడా తన జీవితంలో ప్రేమ, పెళ్లి, సంతానం, వారితో కూడిన మధుర జ్ఞాపకాలు ఉండాలని భావించారు. పైగా ఒక మహిళను ఎంతో గాఢంగా ప్రేమించారు కూడా. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆమెకు దూరం కావాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆయన జీవితంలో ప్రేమ, పెళ్లి అనే మాటలు లేకుండా పోయాయి అంట. తన లవ్ స్టోరీ గురించి రతన్ టాటా హ్యూమన్స్ ఆఫ్ బాంబేకిచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
ఈ సందర్భంగా రతన్ టాటా మాట్లాడుతూ.. ‘‘నేను ఉన్నత చదువుల కోసం లాస్ ఏంజెల్స్ వెళ్లినప్పుడు ఒక మహిళను ప్రేమించాను. మా బంధం ఎంత గాఢమైంది అంటే.. ఆల్మోస్ట్ మాకు వివాహం అయితే ఎలా ఉంటామో అంత అన్యోన్యంగా ఉండేవాళ్లం. అన్ని అనుకూలిస్తే.. ఈ రోజు ఆ మహిళ నా భార్యగా ఇక్కడ ఉండేది. కానీ మాకు ఆ అదృష్టం లేదు. ఆ సమయంలో మా నాన్న గారి పిలుపు మేరకు నేను ఇండియా వచ్చాను. అదే సమయంలో ఇండో-చైనా యుద్ధం ప్రారంభం కావడంతో.. తనకు నన్ను చేరుకునే అవకాశం లభించలేదు. తను ఇండియా రావడానికి ఆమె తల్లిదండ్రులు అంగీకరించలేదు. అలా మేం విడిపోయాం’’ అని తెలిపారు.
‘‘ఆ తర్వాత కొందరు నా జీవితంలోకి వచ్చారు.. కానీ వారిలో ఎవరిని కూడా నేను నా భార్యగా ఊహించుకోలేకపోయాను. ఇక ఆ తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. వ్యాపార బాధ్యతలు స్వీకరించడంతో ప్రయాణాలు, సమావేశాలు అంటూ జీవితం పరుగులు తీయడం ప్రారంభించింది. ఈ క్షణం నేను వెనుతిరిగి చూసుకుంటే.. ఎంతో గర్వ పడతాను కానీ.. దేని గురించే బాధ పడే సంఘటనలు లేవు’’ అని చెప్పుకొచ్చారు.
ఈ ఇంటర్వ్యూని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన గంటలోనే లక్షలాది మంది దీనిని చూశారు.. 19 వేల మందికి పైగా దీన్ని లైక్ చేశారు. నెటిజనులు ఆయన మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. మీలాంటి వ్యక్తి ఎవరు ఉండరు.. మీలాంటి వ్యక్తి ఇక్కడ ఉండటం మా అదృష్టం.. మేమంతా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం.. గౌరవిస్తున్నాం.. మీరు మాకు ఎంతో గర్వకారణం అంటూ రతన్ టాటాపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.