పౌరులదే కీలక బాధ్యత

పౌరులదే కీలక బాధ్యత

సమాజంలో పౌరులకు విధులు, బాధ్యతలు ఉంటాయి. సుఖశాంతులతో సామూహికంగా జీవించడానికి ఇవి ఎంతో కీలకం. ముఖ్యంగా అంటువ్యాధులు ప్రభలుతున్నప్పుడు ప్రభుత్వాలు తీసుకునే చర్యలకంటే పౌరుల బాధ్యతగా వ్యవహరించడమే ఎక్కువ ఆవశ్యకం. కరోనా లాంటి మహామ్మారులు వ్యాపిస్తున్న నేపథ్యంలో పౌరులుగా తమతమ బాధ్యతలను నెరవేర్చడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా సమాజంలోని ఇతరులపై అది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

తెలిసి కొందరు, తెలియక కొందరు తమ బాధ్యతలను విస్మరిస్తున్న ఘటనలు ప్రస్తుత కరోనా కాలంలో అక్కడక్కడా ఎక్కువగానే కన్పిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా భారీగా వ్యాపిస్తున్న పలు చోట్ల పరిస్థితులను గమనిస్తే అక్కడి పౌరుల నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. జీవనం కోసం చేసే పనులను నిలివేసి మరీ ఆకలితో ఇబ్బంది పడమని ఎవ్వరూ చెప్పరుగానీ, నిర్వర్తించాల్సిన బాధ్యతలన్ని మర్చిపోతే మాత్రం తోటి వారు నొచ్చుకోకుండా ఉండలేరు.

ప్రతి వందేళ్ళకు ఒక్కో అంటు వ్యాధి మహ్మారి రూపంలో జనావళిపై పంజా విసురుతోందని చరిత్రను బట్టి తెలుస్తోంది. 18వ శతాబ్దంలో సంభవించిన ప్లేగు కావొచ్చు, 19వ శతాబ్ధంలో వచ్చిన స్పానిష్‌ ఫ్లూగానీ, ఇప్పుడు సంభవించిన కరోనా (కోవిడ్‌ 19) గానీ జనసమ్మర్ధత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే తన ప్రతాపాన్ని చూపిందన్న సాక్ష్యాలున్నాయి. సామూహికంగా కలిసిఉండడం అన్నది సమాజానికి మూలం. అయితే అటువంటి సమూహాలపైనే ఈ మహమ్మారులు విరుచుకుపడడం బాధాకరమైన అంశం. ఇక్కడ సమాజ జీవనానికి దూరమవ్వమని ఎవ్వరూ చెప్పరు. వ్యక్తికీ వ్యక్తికీ మధ్య నిర్ణీత దూరం పాటించే ఆవశ్యకతను మాత్రం గుర్తు చేస్తుంటారు.

దేశంలోనే అత్యంత జనసమ్మర్ధం గల నగరాల్లో ప్రధానమైన ముంబై నగరాన్నే ఉదాహరణగా తీసుకుంటే అక్కడ ప్రస్తుతం కరోనా విలయతాండవమే చేస్తోంది. అంతంత మాత్రంగానే జనాభా ఉన్న 18, 19 శతాబ్ధాల్లోనే మహమ్మారులు భారీ మరణాలకు కారణమయ్యాయి. ఇప్పుడు ఉన్న జన విస్పోటనం నేపథ్యంలో అంచనాలు ఊహించుకునేందుకు కూడా పరిశీలకులు జంకుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. భయం, అవగాహన ఈ రెండింటికీ మధ్యనున్న తేడాను పౌరులు స్పష్టంగా గుర్తుంచేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.

కొందరు చెబుతున్నట్లు ‘కరోనా తనకు తానుగా రాదు.. మనమే వెళ్ళి తెచ్చుకోవాలి’ అనే మాట సందర్భోచితంగా తోస్తుంది. జనం ఎక్కువగా గుమిగూడి ఉండే ప్రదేశాలకు వెళ్ళొద్దని మాత్రమే ప్రభుత్వాలు, యంత్రాంగం చెప్పగలదు. కానీ అటువంటి గుమిగూడే పరిస్థితులు ఏర్పడకుండా వ్యక్తిగత నియంత్రణ పాటించాల్సిన బాధ్యత మాత్రం పౌరుడిదే. పౌరుడు కూడా బాధ్యతగా వ్యవహరించకపోతే ప్రభుత్వాలు చేసిన విలువైన సేవలు కూడా వృధాగానే మిగిలినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Show comments