బీజేపీతో జనసేన పొత్తు అప్పటి వరకే కొనసాగుతుందా..? పవన్ క్లారిటీ తో ఉన్నారా..?

బీజేపీతో జనసేన పొత్తు అప్పటి వరకే కొనసాగుతుందా..? పవన్ క్లారిటీ తో ఉన్నారా..?

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరబోతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్న తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉన్నపవన్ కళ్యాణ్ తాజా ఊహాగానాలపై అమరావతి గ్రామాల పర్యటనలో స్పందించారు. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని తాను భావించడం లేదని తెలిపారు. వైసీపీతో పొత్తు విషయమై తనకు బీజేపీ పెద్దల నుంచి ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. బీజేపీతో వైసీపీకి పొత్తులేదని తనకు స్పష్టంగా తెలుసునని వ్యాఖ్యానించారు.

తనకు ఉన్న సమాచారం మేరకు బీజేపీకి వైసీపీతో ఎటువంటి పొత్తు లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను తప్పుగా అనుకోవద్దని రాజధాని రైతులకు, జనసేన కార్యకర్తలను కోరారు. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని తాను నమ్మడం లేదన్నారు. ఒకవేళ వైసీపీతో పొత్తు పెట్టుకుంటే బీజేపీతో జనసేన ఉండబోదని పవన్‌ కళ్యాణ్‌ తేల్చిచెప్పారు.

బీజేపీ నేతలతో వైసీపీ నేతలు కలిస్తే తప్పు లేదుగాని ఒకవేళ పొత్తుపెట్టుకుంటే అందులో జనసేన ఉండదని పవన్ కళ్యాణ్ కుండబద్దలు కొట్టారు. అమరావతి పై మాట్లాడిన తర్వాతే బీజేపీ తో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పారు. అమరావతిలోనే రాజధాని ఉంటుందని ప్రధాని మోదీ, అమిత్‌ షా చెప్పలేదని, కానీ బీజేపీ రాజకీయంగా మాత్రం అమరావతికి కట్టుబడి ఉన్నట్లు తనకు చెప్పారని పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఏపీ లో రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. బిజెపి, వైఎస్సార్సీపీ మధ్య పొత్తు ఉంటే జనసేన ఒంటరిగానే ఉంటుందా..? లేక పాత మిత్రులు టీడీపీ, వామపక్షాలతో వెళతారా..? అన్న చర్చ సాగుతోంది. పొత్తు పొట్టుకోకున్నా ఇప్పటికే టిడిపి, సిపిఐ కలసి సాగుతున్నాయి.

Show comments