Parking OTT Review: పార్కింగ్ ఓటీటీ రివ్యూ! అద్దె ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా

పార్కింగ్ ఓటీటీ రివ్యూ! అద్దె ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా

కమర్షియల్ సినిమా చూసి చూసి బోర్ కొట్టింది.. మాకు కమర్షియల్ సినిమా వద్దు.. కంటెంట్ ఉన్న సినిమా కావాలి. ఓటీటీలో ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పు గురూ అని వాళ్ళనీ, వీళ్ళనీ ఏమడుగుతారు గానీ మీ కోసం నేనే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీసుకొచ్చా. అదే పార్కింగ్.

కమర్షియల్ సినిమా చూసి చూసి బోర్ కొట్టింది.. మాకు కమర్షియల్ సినిమా వద్దు.. కంటెంట్ ఉన్న సినిమా కావాలి. ఓటీటీలో ఏదైనా మంచి సినిమా ఉంటే చెప్పు గురూ అని వాళ్ళనీ, వీళ్ళనీ ఏమడుగుతారు గానీ మీ కోసం నేనే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా తీసుకొచ్చా. అదే పార్కింగ్.

పార్కింగ్.. ఇది ఎంతోమంది అద్దె ఇళ్లలో ఎదుర్కుంటున్న సమస్య. ఏ మాత్రం పార్కింగ్ ఫెసిలిటీ లేకుండా నాలుగైదు ఫ్లోర్లు లేపేసి భారీగా రెంట్ వసూలు చేసే ఓనర్లు చాలా మంది ఉంటారు. ఎప్పుడో కట్టిన పురాతన ఇళ్ళకి పార్కింగ్ అంటే ఎక్కడ నుంచి వస్తుంది చెప్పండి. ఇప్పుడు కట్టే అపార్ట్ మెంట్లు, ఇళ్ళకి అంటే గ్రౌండ్ ఫ్లోర్ ప్రత్యేకంగా పార్కింగ్ కోసమని వదిలేస్తున్నారు. ఒకప్పుడు ఇంత ఆలోచన లేదుగా. పైగా కార్లు కూడా పెద్దగా ఏం ఉండేవి కావు. ఇప్పుడు ఇంటి ఓనర్లకే కాదు.. అద్దెకుండే వారికి కూడా ఒక కారు ఉంటుంది. అయితే కారు ఉంటే సరిపోదుగా.. పార్కింగ్ కూడా ఉండాలి. అసలు కారు పార్కింగ్ ఉండే ఇల్లు దొరక్క చాలా మంది అనేక ఇబ్బందులు పడేవారు ఉన్నారు. కారు ఇంటి బయట ఖాళీ స్థలంలో పెట్టాలంటే గుండె కాయ కిందకి జారిపోద్ది.

అందుకే తమ కోసం కంటే కూడా ముందు కారు పార్కింగ్ కోసం ఆలోచిస్తున్నారు. ఇదే కారు పార్కింగ్ అంశాన్ని సినిమాగా తెరకెక్కించాడు దర్శకుడు రామ్ కుమార్ బాలకృష్ణన్. చూడ్డానికి అరవ సినిమా అయినా కూడా ఇదసలు సినిమాలా అనిపించదు. నిజంగానే మన ఇంటి పక్కనో.. మనం ఉండే ఇంట్లోనో జరిగే గొడవలా అనిపిస్తుంది. హరీష్ కళ్యాణ్, ఇందూజ రవిచంద్రన్, ఎం.ఎస్. భాస్కర్, ఇళవరసు తదితరులు నటించిన ఈ సినిమా 2023 డిసెంబర్ లో విడుదలైంది. మంచి టాక్ సంపాదించుకుంది. డిసెంబర్ 29 నుంచి డిస్నీ+హాట్ స్టార్ లో తెలుగు డబ్బింగ్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. 

కథ:

ఈశ్వర్ (హరీష్ కళ్యాణ్) ఒక ఐటీ ఉద్యోగి. ఆతిక (ఇందూజ రవిచంద్రన్) ఒక ప్రెగ్నెంట్. అమ్మాయి ఇంట్లో పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహం చేసుకుని వేరు కాపురం పెడతాడు ఈశ్వర్. బ్రోకర్ ద్వారా ఏకరాజ్ (ఎం.ఎస్. భాస్కర్) ఇంటికి అద్దె కోసం వస్తాడు. ఇల్లు నచ్చిందని తీసుకుంటాడు. పాత ఇల్లు అయినా సరే అడ్జస్ట్ అయ్యి ఉంటాడు. సాఫ్ట్ వేర్ కంపెనీలో జాబ్. మంచి జీతం. భార్యను అపురూపంగా చూసుకుంటాడు. ఇక ఈశ్వర్ ఉండే ఇంటి కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఏకరాజ్ కుటుంబం ఉంటుంది. ఏకరాజ్ ఏంటంటే.. మహా పిసినారి. పిసినారి సంఘానికి అధ్యక్షుడు అన్నట్టు ఉంటాడు. అలాంటి పిసినారి ఒక డొక్కు బైక్ ఒకటి వేసుకుని తిరుగుతా ఉంటాడు. ప్రభుత్వ ఉద్యోగి.. కారు కొనుక్కునే కెపాసిటీ ఉన్నా కూడా కొనడు. కారు దాకా ఎందుకు.. ఇంట్లో సామాన్లు పాడైపోతేనే కొత్తవి కొనడు. అట్లుంటది ఏకరాజ్ తోటి. ఏకరాజ్ భార్య.. మిక్సీ గిన్నె పాడైపోయిందని చెబితే.. సొంతంగా రిపేర్లు చేస్తాడు.

అలాంటి వ్యక్తి తమ ఇంటి పైన ఉండే ఐటీ ఉద్యోగి వల్ల కారు కొనాల్సి వస్తుంది. ఐటీ ఉద్యోగి కారు ఎందుకు కొన్నాడు అంటే.. ఈ అదిరిపోలా, డూబర్ యాప్స్ కొన్నిసార్లు హ్యాండ్ ఇస్తాయని తెలుసు కదా. మనోడు ఆఫీస్ కి వెళ్లాల్సి ఉంటే ఆ క్యాబ్ వాడు హ్యాండ్ ఇస్తాడు. దీంతో ఈగో హర్ట్ అయ్యి కారు కొనేస్తాడు. ఇక ఇక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. ఏకరాజ్ బైక్ కి, ఈశ్వర్ కారుకి పార్కింగ్ సరిపోదు. కారు పెడితే బైక్ బయటకు తీయడం కష్టం అవుతుంది. ఇంటి ఓనర్ ని పిలిస్తే.. బైకే కదా ఏకరాజ్ ని అడ్జస్ట్ అవ్వమంటాడు. బైక్ అనే కదా తనను చిన్న చూపు చూస్తున్నారని ఏకరాజ్ అహం దెబ్బ తింటుంది. ఈగోతో క్యాష్ ఇచ్చి మరీ అప్పటికప్పుడు కారు కొంటాడు. ఇప్పుడు ఇద్దరికీ కార్లు ఉన్నాయి. ఈ పార్కింగ్ స్థలం మీద ఎవరి ఆధిపత్యం నడుస్తుంది? ఈ క్రమంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనేది మిగిలిన కథ. 

విశ్లేషణ:

పార్కింగ్ ఇది చాలా సహజంగా ఉండే సమస్య. ఎప్పుడూ ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఫేస్ చేసే ఉంటారు. దీన్ని సినిమాగా తీయడం ఒక ఎత్తు అయితే.. చాలా సహజంగా తెరకెక్కించడం మరొక ఎత్తు. సినిమా చూసినంత సేపు కూడా మన ఇంటి పక్కనే, మన మధ్య జరుగుతున్నట్టే ఉంటుంది. ఏ మనిషీ చెడ్డవాడు కాదు.. అతనిలో ఉన్న అహమే మనిషిని మృగంలా మారుస్తుంది అనడానికి ఈ పార్కింగ్ సినిమా చక్కని ఉదాహరణ. జీవితంలో ఎప్పుడూ ఎలాంటి మచ్చ లేకుండా జీవించే మనుషుల మధ్య ఈగో వస్తే ఎలా ఉంటుందో అనే విషయాన్ని ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాడు దర్శకుడు. ఈశ్వర్ మంచివాడే.. ఏకరాజ్ మంచివాడే. ఏకరాజ్ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి.. టేబుల్ కింద చేయి పెట్టి లక్షలు సంపాదించుకునే అవకాశం ఉండి కూడా నిజాయితీగా జీవిస్తాడు. అలాంటి మనిషి ఒక మనిషిని హత్య చేసే స్థాయికి వెళ్ళిపోతాడు. ఒక మనిషి మీద తప్పుడు కేసు ఎలా పెడతాడు? అనే అంశాలు ఆకట్టుకుంటాయి.

పార్కింగ్ కోసం ఈశ్వర్, ఏకరాజ్ లు పండించే కామెడీ చాలా బాగుంటుంది. ఏకరాజ్ భార్యగా నటించిన రమా రాజేంద్ర కూడా బాగా నటించారు. సమయం, సందర్భం దొరికినప్పుడు కామెడీ చేస్తూనే.. భర్తను చెడామడా తిట్టేసే నిజాయితీ కలిగిన భార్యగా చాలా బాగా నటించారు. మిక్సీ జార్ పాడయ్యింది.. కొత్తది కొనమని ఆమె ఈ సినిమాలో ఒక మూడు, నాలుగు సార్లు అడుగుతుంది. ఈ పెద్దాయన కటింగ్ ప్లేయర్ తో బాగు చేస్తాడు. అలాంటి పెద్దాయన కారు కొన్నప్పుడు ఆమె రియాక్షన్ చూడాలి. అప్పుడు ఆమె చెప్పే డైలాగ్ హిలేరియస్ ఉంటుంది. కారు కొంటే ఎవరికైనా సంతోషం ఉంటుంది. కానీ ఈ ఇల్లాలికి మాత్రం మిక్సీ గిన్నె కొనలేదని బాధ. “ఇంట్లో వస్తువులు పోతే కొనడు గానీ ఆ పైనోడి కోసం కారు కొన్నాడు. ఇప్పుడు చట్నీ ఆయన గుండు మీద ఆడుకోవాలా?” అని అంటుంది. ఆ డైలాగ్ కి విపరీతమైన నవ్వు వస్తుంది. ఇలాంటి డైలాగ్స్ సినిమాలో చాలా ఉన్నాయి. ఇలా సరదాగా సాగిపోతూనే కథ ఒక్కసారిగా సీరియస్ అవుతుంది. ఈగోతో ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం జరుగుతాయి. ఎంతలా అంటే ఈశ్వర్ మీద పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టడం.. అది దృష్టిలో పెట్టుకుని ఏకరాజ్ ని అవినీతి కేసులో ఈశ్వర్ ఇరికించడం జరుగుతాయి.

ఒకరినొకరు చంపుకునే వరకూ వెళ్తారు. చివరికి కుటుంబాలు రెండూ రోడ్డున పడతాయి. ఇంత గొడవ పడే ఈ ఇద్దరూ.. ఆడవారి విషయంలో చాలా మంచిగా ఆలోచిస్తారు. ఫైనల్ గా ఈ ఇద్దరూ తమ తప్పు తెలుసుకున్నారా? లేదా? అనేది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఈశ్వర్ గా హరీష్ కళ్యాణ్, ఏకరాజ్ గా ఎం.ఎస్. భాస్కర్ లు చాలా అద్భుతంగా నటించారు. అయితే ఒకే ఒక్క చోట దర్శకుడు కథని సాగదీశాడు అని అనిపిస్తుంది. మామూలుగా లక్షలు జీతం వచ్చే ఏ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయినా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే ఓ మంచి ఫ్లాట్ లోకి వెళ్ళిపోతారు. అందులోనూ కారు ఉంటే పార్కింగ్ ఉన్న ఇంటికి షిఫ్ట్ అవుతారు. కానీ ఈ కథలో ఈశ్వర్ మాత్రం రెంట్ కడుతున్నా కదా ఒక కారుకే పార్కింగ్ ఉన్నా కూడా తన కారుకే అవకాశం ఉండాలన్న ఈగోతో ఉంటాడు. ఈ కథలో తప్పు ఒకరిది అనుకునేలోపు ఇంకో క్యారెక్టర్ ని బ్యాడ్ చేస్తాడు దర్శకుడు. ఫైనల్ గా ఎవరు బ్యాడ్ అనేది మీరు చూసి తెలుసుకోవాలి. అయితే ఇదే కథను ఇంటి ఓనర్ కి, రెంటర్ కి మధ్య నడిస్తే ఇంకా రక్తికట్టేదని సమీక్షకుడి అభిప్రాయం. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నా కూడా కథలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల కంటికి ఆనవు. కమర్షియల్ సినిమాలు చూసి బోర్ కొట్టింది.. కంటెంట్ ఉన్న సినిమా చూడాలి అనుకునేవారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.   

బలాలు:

  • కథ, కథనం, దర్శకత్వం
  • హరీష్ కళ్యాణ్, ఏకరాజ్ ల నటన

బలహీనత:

  • కొంచెం సాగదీత

చివరి మాట: పార్కింగ్ ఇక్కడ ఈగోతో పాటు హాస్యానికి, భావోద్వేగానికి కూడా చోటుంది

రేటింగ్: 3/5

(ఈ రివ్యూ కేవలం సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)

Show comments