IPL 2024లో ఆర్సీబీ తరఫున బరిలోకి పాకిస్థాన్‌ ప్లేయర్‌!

IPL 2024లో ఆర్సీబీ తరఫున బరిలోకి పాకిస్థాన్‌ ప్లేయర్‌!

అప్పుడెప్పుడో ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌లో పాకిస్థాన్‌ ఆటగాళ్లు బరిలోకి దిగారు. ఆ తర్వాత మళ్లీ వారికి ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాలేదు. ఇరు దేశాల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో పాకిస్థాన్‌ ఆటగాళ్లకు ఐపీఎల్‌లో అనుమతి నిరాకరించారు. అయితే మళ్లీ ఇన్నేళ్లకు ఓ పాకిస్థాన్‌ క్రికెటర్‌ ఐపీఎల్‌లో ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. ఆ క్రికెటర్‌ మరెవరో కాదు.. స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ అమీర్‌. మరి అతను ఐపీఎల్‌ ఆడేందుకు బీసీసీఐ ఒప్పుకుంటుందా? ఏ పాక్‌ క్రికెటర్‌కు లేని వెసులుబాటు ఇతనికే ఎందుకు అనే అనుమానం మీకు రావచ్చు. అయితే అతను పాక్‌ పౌరుడిగా బరిలోకి దిగడం లేదు.

బ్రిటన్‌ పౌరుడిగా ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. 2016లో ఇంగ్లండ్‌కు చెందిన తన ప్రేయసిని పెళ్లి చేసుకున్న అమీర్‌.. 2020 నుంచి బ్రిటన్‌లోనే ఉంటున్నాడు. మరికొన్ని నెలల్లో అతనికి బ్రిటన్‌ పౌరసత్వం రానుంది. దీంతో అతనికి ఐపీఎల్‌ ఆడేందుకు అనుమతి లభిస్తుంది. కాగా.. అమీర్ ఐపీఎల్‌ ఆడేందుకు సిద్ధమవుతున్న తరుణంలో అతన్ని తీసుకునేందుకు అప్పుడే ఓ జట్టు రెడీ అయిపోయింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు అమీర్‌ను తమ టీమ్‌లో తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఈ విషయంపై అమీర్‌ స్పందిస్తూ.. బ్రిటన్‌ పౌరసత్వం వచ్చేందుకు ఇంకా సమయం పడుతుందని, ఐపీఎల్‌ 2024 ప్రారంభానికి ముందు పౌరసత్వం వస్తే ఆడే అవకాశం వదులుకోనని అన్నాడు. 2020లో పాకిస్థాన్‌ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడిన అమీర్‌ అప్పటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పలు లీగ్స్‌లో ఆడుతున్నాడు. పాక్ తరఫున 36 టెస్టులు, 61 వన్డేలు, 50 టీ20 మ్యాచ్‌లు ఆడిన అమీర్.. 259 వికెట్లు తీశాడు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆరేళ్ల పాటు నిషేధానికి గురై, రీఎంట్రీ ఇచ్చినా ఎక్కువకాలం కొనసాగలేకపోయాడు. మరి అమీర్‌ ఐపీఎల్‌ ఆడేందుకు రెడీ అవుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments