విప్లవాత్మక సంస్కరణల దిశగా మరో అడుగు వేసిన జగన్‌ సర్కార్‌.. ప్రజలకు భారీ ఊరట..

విప్లవాత్మక సంస్కరణల దిశగా మరో అడుగు వేసిన జగన్‌ సర్కార్‌.. ప్రజలకు భారీ ఊరట..

73 ఏళ్ల స్వతంత్ర భారతంలో అనేక సంస్కరణలు దేశ ప్రజలు చూశారు. పరిపాలన, ఆర్థిక సంస్కరణల్లో ఆర్థిక సంస్కరణలే ఎక్కువగా ఆచరణలోకి వచ్చాయి. ప్రజల జీవితాలను సౌకర్యవంతంగాను, ప్రభుత్వ సేవలను శులభతరంగానూ అందించే సంస్కరణలు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టి, అమలు చేసిన సంఘటనలు బహుతక్కువ అని చెప్పవచ్చు. విద్య, ఉద్యోగాలు, వివిధ ప్రభుత్వ పథకాలకు అధికారులు జారీ చేసే కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వాటి కోసం వేల రూపాయలు లంచాలు కూడా ముట్టజెప్పాల్సిన పరిస్థితి ఉండేది. ఇలాంటి ధృవీకరణ పత్రాలు పొందేందుకు కూడా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఇకపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉండదు.

ఇప్పటి వరకూ మండల స్థాయిలో ఉన్న ప్రభుత్వాన్ని, ప్రభుత్వ సేవలను గ్రామ పంచాయతీ స్థాయికి తీసుకెళ్లేలా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి పరిపాలనా సంస్కరణలకు నాంధి పలికిన ఆంధ్రప్రదేశ్‌లోని జగన్‌ సర్కార్‌ ఆ దిశగో మరో అడుగు ముందుకే వేసింది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆదాయం ధృవీకరణ పత్రాల కోసం ప్రజలు రెవెన్యూ అధికారులు చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రేషన్‌ కార్డునే ఆధాయ ధృవీకరణ పత్రంగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విద్య, ఉద్యోగాలు, వివిధ ప్రభుత్వ పథకాలను ప్రజల వార్షికాదాయం ఆధారంగా అందిస్తున్నారు. అందు కోసం ఇప్పటి వరకూ తహసీల్దార్‌ జారీ చేసే ఆధాయ దృవీకరణ పత్రం అవసరం అవుతోంది. ఇకపై రేషన్‌కార్డునే ఆదాయ ధృవీకరణ పత్రంగా ప్రభుత్వం పరిగణించనుంది.

కుటుంబ ఆదాయం ఆధారంగానే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్‌కార్డు జారీ చేస్తున్నాయి. వార్షిక ఆదాయం ఆధారంగానే దారిద్య్రరేఖకు దిగువ(బీపీఎల్‌)న ఉన్న వారికి ఆహార భద్రత కల్పించేందుకు రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే విధానం ఇప్పటి వరకూ అమలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వరకూ ఏపీలో కుటుంబ వార్షిక ఆదాయం 72 వేల రూపాయలు ప్రాతిపదికగా రేషన్‌కార్డు మంజూరు చేశారు. జగన్‌ సర్కార్‌ వచ్చాక ఆ పరిమితిని పెంచారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1.44 లక్షలకు ఆదాయ పరిమితిని పెంచి రేషన్‌కార్డులు మంజూరు చేస్తున్నారు. రేషన్‌కార్డులు మంజూరు చేసేందుకు కుటుంబ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటున్నప్పుడు..మళ్లీ విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాల మంజూరుకు ఆదాయ ధృవీకరణ పత్రం అవసరం ఏముందనేది మౌలిక ప్రశ్న. అందుకే జగన్‌ సర్కార్‌ ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ రేషన్‌కార్డునే ఆదాయానికి ప్రాతిపదికగా గుర్తించాలని నిర్ణయించింది.

Show comments