KotaBommali PS Movie Review & Rating In Telugu: కోట బొమ్మాళి పీఎస్‌ సినిమా రివ్యూ!

KotaBommali PS Review: కోట బొమ్మాళి పీఎస్‌ సినిమా రివ్యూ!

KotaBommali PS Telugu Movie Review & Rating: కోట బొమ్మాళి పీఎస్‌ సినిమా నవంబర్‌ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొలిటికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?

KotaBommali PS Telugu Movie Review & Rating: కోట బొమ్మాళి పీఎస్‌ సినిమా నవంబర్‌ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పొలిటికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?

కోట బొమ్మాళి పీఎస్‌

20231124, U
పొలిటికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌
  • నటినటులు:శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, శివానీ రాజశేఖర్‌, రాహుల్‌ విజయ్‌, మురళీ శర్మ, బెనర్జీ తదితరులు
  • దర్శకత్వం:తేజమణి
  • నిర్మాత:బన్నీ వాసు, విద్యా కొప్పినీడి
  • సంగీతం:రంజిన్‌ రాజ్‌, మిధున్‌ ముకుందన్‌
  • సినిమాటోగ్రఫీ:జగదీష్‌ చీకటి

2.5

తెలుగు ఇండస్ట్రీకి రీమేక్‌లు కొత్త కాదు. పర భాషలో హిట్టుగా నిలిచిన సినిమాలు తెలుగులో రీమేక్‌ అవుతూ ఉన్నాయి. అలా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘‘ కోట బొమ్మాళి పీఎస్‌’’. పొలిటికల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ నవంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి, ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా? మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన కథ.. తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?

కథ:

రామకృష్ణ( శ్రీకాంత్‌), కుమారి( శివానీ రాజశేఖర్‌), రాహుల్‌ విజయ్‌ ( రవి) కోట బొమ్మాళి పోలీస్‌ స్టేషన్‌లో కానిస్టేబుళ్లుగా పని చేస్తుంటారు. రామకృష్ణ ఆ స్టేషన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌, కూంబింగ్‌ స్పెషలిస్ట్‌. కుమారిని వరుసకు బావ అయ్యే ఓ వ్యక్తి వేధిస్తూ ఉంటాడు. దీంతో ఆమె తను పని చేసే స్టేషన్‌ సీఐకి కంప్లైంట్‌ చేస్తుంది. సీఐ అతడ్ని స్టేషన్‌కు పిలిపిస్తాడు. అక్కడ రామకృష్ణ, రవిలతో అతడికి గొడవ అవుతుంది. గొడవ సందర్భంగా రామకృష్ణ తుపాకితో ఆ వ్యక్తి అనుచరుల్ని భయపెడతాడు. ఆ దృశ్యాలను ఓ వ్యక్తి వీడియో తీస్తాడు. ఆ తర్వాత రామకృష్ణ, కుమారి, రవిలు ఓ పెళ్లికి వెళతారు. పెళ్లి అయిపోయిన తర్వాత ఇంటికి తిరిగి వస్తూ ఉంటారు. అప్పుడు వారి కారు ఓ బైకర్‌ను ఢీకొడుతుంది. అతడు చనిపోతాడు. ఆ ముగ్గురు అనుకోని విధంగా ఆ బైకర్‌ మర్డర్‌ కేసులో ఇరుక్కుంటారు. ముప్పతిప్పల్లో పడతారు. ఆ యాక్సిడెంట్‌ వారి జీవితాలను ఎలా మార్చింది? ఆ మర్డర్‌ కేసునుంచి ముగ్గురూ ఎలా బయటపడ్డారు అన్నదే మిగిలిన కథ.

విశ్లేషణ :

కోట బొమ్మాళి పీఎస్‌ సినిమా మలయాళంలో వచ్చిన ‘నాయట్టు’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. అయినప్పటికీ ఎక్కడా మలయాళ సినిమా రీమేక్‌ అని అనిపించదు. మన నేటివిటీకి తగ్గట్టు చిత్ర దర్శకుడు తేజ మర్ని సినిమాలో చాలా మార్పులు చేశాడు. కథ మొత్తం పాలిటిక్స్‌, పోలీసుల చుట్టే తిరుగుతుంది. రాజకీయ నాయకులు ఆడే ఆటలో పోలీసులు ఎలా పావులు అవుతారో చాలా సినిమాల్లో చూసే ఉంటాం. కానీ, ఈ సినిమాలో ఓ కొత్త కోణం నుంచి చూస్తాం. పోలీసులకు పోలీసులే శత్రువులుగా మారితే పరిస్థితి ఎలా ఉంటుందో సినిమా కళ్లకు కడుతుంది.  కథకు తగ్గట్టు పాటలకు ఎక్కువ స్కోప్‌ లేదు. ఉన్న రెండు పాటలు.. అప్పటి పరిస్థితులను బట్టి వచ్చినవే కాబట్టి సరిగ్గా సెట్‌ అయ్యాయి. చిత్ర దర్శకుడు తేజ స్క్రీన్‌ ప్లే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. ప్రేక్షకులకు ఎక్కడా బోర్‌ కొట్టకుండా కథను అద్భుతంగా ముందుకు తీసుకెళ్లాడు. శ్రీకాంత్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ల మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు చప్పట్లు కొట్టిస్తాయి. రెండున్నర గంటల సినిమా ఎక్కడా బోరు కొట్టకుండా సాగుతుంది. చివర్లో మనల్ని ఆలోచింప జేస్తుంది. కంటతడి పెట్టిస్తుంది. సినిమాలో హీరో అంటూ ఎవరూ లేరు.. కథే హీరో..

నటీనటుల నటన :

ఈ సినిమాకు నటీనటుల నటనే హైలెట్‌. ముఖ్యంగా ప్రధాన పాత్రధారులైన శ్రీకాంత్‌, వరలక్ష్మీ, శివానీ, రాహుల్‌, మురళీ శర్మలు ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. శ్రీకాంత్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సినిమాలో కొన్ని సీన్లలో శ్రీకాంత్‌ నటన విజిల్స్‌ వేయిస్తుంది. మరికొన్ని సీన్లలో కంటతపడి పెట్టిస్తుంది. పోలీస్‌ ఆఫీసర్‌ అలీగా వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ ఫాబులస్‌గా నటించారు. కొంచెం మాస్‌, కొంచెం కన్నింగ్‌గా శ్రీకాంత్‌తో పోటీ పడి నటించారు. రాజకీయ నాయకుడి పాత్రలో మురళీ శర్మ అద్భుతంగా ఒదిగిపోయారు. తన యాజ్‌యూజువల్‌ పర్ఫార్మెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఇక, డీజీపీ పాత్రలో బెనర్జీ తన పరిధి మేర నటించారు. మిగిలిన చిన్న చిన్న పాత్రలు కూడా తమ పాత్రలో జీవించాయి.

సాంకేతిక వర్గం పనితీరు :

కోట బొమ్మాళి పీఎస్‌ సినిమాకు సాంకేతిక వర్గం పనితీరు హైలెట్ అని చెప్పొచ్చు. స్క్రీన్‌ ప్లేకు తగ్గట్టుగా కెమెరా మ్యాన్‌ తన పని తనాన్ని చూపించారు. ప్రతీ ఫ్రేమ్‌ అద్భుతంగా ఉంటుంది. ఇక, షాట్లకు కత్తెర వేసే విషయంలో.. వాటిని అందంగా మలిచే విషయంలో ఎడిటర్‌ తన పని తనాన్ని చూపించారు. సంగీతం విషయానికి వస్తే.. విడుదలకు ముందునుంచే ‘ లింగి లింగి లింగిడి’ పాటకు జనంలో క్రేజ్ ఏర్పడింది. సోషల్‌ మీడియాలో ఓ ఊపు ఊపింది. ఈ పాటతో పాటు సినిమాలో ఇంకో పాట ఉంది. ఆ పాట చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ విషయానికి వస్తే.. సూపర్‌ అనేంతలా కాకపోయినా.. సన్ని వేశాలకు తగ్గట్టుగా ఉంటుంది.

ప్లస్‌లు :

  • నటీనటుల నటన
  • కథ
  • స్క్రీన్‌ ప్లే

మైనస్‌ :

  •  ఎస్టాబ్లిస్‌మెంట్‌ కోసం ఎక్కువ సమయం తీసుకోవటం

చివరి మాట: కోట బొమ్మాళి పీఎస్‌ మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది!

రేటింగ్‌ : 2.5/5

(ఈ రివ్యూ సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)
Show comments