శ్రీదేవి కూతురి ఆశలన్నీ మిలి మీదే..!

శ్రీదేవి కూతురి ఆశలన్నీ మిలి మీదే..!

  • Published - 05:05 PM, Wed - 2 November 22
శ్రీదేవి కూతురి ఆశలన్నీ మిలి మీదే..!

అతిలోకసుందరిగా తెలుగు ప్రేక్షకుల్లోనూ అశేషమైన అభిమానులను సంపాదించుకున్న స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ కొత్త సినిమా మిలి ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ప్రమోషన్లు గట్టిగానే చేస్తున్నారు. హైదరాబాద్ వచ్చి మరీ ప్రెస్ మీట్లు పెట్టి థియేటర్లకు రమ్మని ఆడియన్స్ ని ఆహ్వానిస్తున్నారు. ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తనే హీరోయినన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలకు వచ్చి మరీ ప్రమోట్ చేసుకోవడం ఆసక్తి రేపుతోంది. అయితే హిందీ వెర్షన్ మాత్రమే రిలీజవుతున్నా ఇంత హడావిడి చేయడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఇంతా చేసి ఎల్లుండి రిలీజ్ ఉంటే ఇప్పటిదాకా ఆన్ లైన్ బుకింగ్స్ మొదలుకాలేదు.

ఈ మిలి 2019లో వచ్చిన మలయాళం హెలెన్ రీమేక్. అక్కడది పెద్ద హిట్టు. పిజ్జా రెస్టారెంట్ లో పని చేసే ఒక అమ్మాయి అనుకోకుండా డీప్ ఫ్రీజింగ్ ఉన్న రూమ్ లో ఇరుక్కుపోతుంది. రాత్రి ఓనర్ తాళాలు వేసుకుని వెళ్ళిపోతాడు. ఆ మిలి ఫోన్ బయటే ఉండిపోతుంది. తల్లి లేని కూతురని గారాబంగా పెంచిన తండ్రి ఆమె కోసం సిటీ మొత్తం వెతుకుతూ తల్లడిల్లిపోతాడు. ఒకదశలో ప్రియుడిని అనుమానించినా లాభం ఉండదు. పోలీసులు వెతుకుతారు. అటు చూస్తే చలి తీవ్రత పెరిగిపోయి ఆ గదిలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. చివరికి జాడ ఎలా తెలిసింది, ఎలా బయటికి వచ్చిందనేది మిలి స్టోరీ. ఒరిజినల్ వెర్షన్ లో అన్నా బెన్ కి చాలా పేరు తీసుకొచ్చింది.

నటన పరంగా ఎంత ఛాలెంజింగ్ రోల్స్ చేస్తున్నా జాన్వీకి టాప్ లీగ్ కి చేరేంత పెద్ద బ్రేక్ రావడం లేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో ఆ స్లాట్ ఖాళీగా ఉంది. శ్రీదేవి డాటర్ అనే బ్రాండ్, తండ్రి బోనీ కపూర్ సపోర్ట్ ఎంత ఉన్నా సెటిల్ అవ్వడానికి పోరాడుతున్న జాన్వీకి ఈ మిలి హిట్ కావడం చాలా అవసరం. కాకపోతే కెరీర్ మొదటి నుంచి ఎక్కువగా రీమేకుల మీదే ఆధారపడుతోంది. ఆ మధ్య వచ్చిన గుడ్ లక్ జెర్రీ కూడా నయనతార కోకోకోకిల రీమేక్. డెబ్యూ మూవీ దఢక్ మరాఠి సైరాట్ కి హిందీ రూపకం. స్ట్రెయిట్ సినిమాలు ఎక్కువ చేస్తే ఉపయోగం ఉంటుంది కానీ ఇలా రీమేకుల మీద ఎక్కువ ఆధారపడటం కరెక్ట్ కాదు. చూడాలి మిలి తనకెలాంటి బ్రేక్ ఇస్తుందో.

Show comments