Guntur Kaaram Review in Telugu: మహేశ్ బాబు గుంటూరు కారం మూవీ రివ్యూ

Guntur Kaaram Review: మహేశ్ బాబు గుంటూరు కారం మూవీ రివ్యూ

Guntur Karam Movie Review & Rating in Telugu: మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం గుంటూరు కారం. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి.

Guntur Karam Movie Review & Rating in Telugu: మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన మూడో చిత్రం గుంటూరు కారం. భారీ అంచనాలతో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకోండి.

గుంటూరు కారం

20240112, U/A
యాక్షన్ ఫ్యామిలీ డ్రామా
  • నటినటులు:మహేశ్ బాబు, శ్రీలీల, మీనాక్షి చౌదరి, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్
  • దర్శకత్వం:త్రివిక్రమ్
  • నిర్మాత:సూర్యదేవర రాధా కృష్ణ
  • సంగీతం:తమన్
  • సినిమాటోగ్రఫీ:మనోజ్ పరమహంస

2.5

Guntur Kaaram Review: సూపర్ స్టార్ మహేష్ బాబు మూవీ సంక్రాంతికి వస్తుంది అంటే ఆ సినిమాపై ఓ స్థాయి అంచనాలు ఉండటం సహజం. మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ సినిమాగా తెరకెక్కిన ‘గుంటూరు కారం’ కూడా అంతే అంచనాలతో నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి మాస్ కల్ట్ అన్న రేంజ్ లో ప్రమోషన్స్ జరిగిన ఈ మూవీ.. అంతే స్థాయిలో ఉందా? ఆ అంచనాలను అందుకుందా? లేదా? పండక్కి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి మాస్ హిట్ దక్కిందా? లేదా? అనే విషయాలను ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం.

కథ:

వైరా వెంకట సూర్యనారాయణ(ప్రకాష్ రాజ్) జనదళం పార్టీ అధినేత. అతని ఏకైక కుమార్తె వసుంధర(రమ్యకృష్ణ). తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకుని మంత్రి పదవి దక్కించుకుంటుంది. అయితే.., ఆమె తన పెద్ద కొడుకు రమణ(మహేష్ బాబు)ని చిన్న వయసులోనే వదిలేసి మరో పెళ్లి చేసుకుంటుంది. అలాంటి.. వెంకట సూర్యనారాయణ కుటుంబానికి పాతికేళ్ల తరువాత రమణతో ఓ అవసరం ఏర్పడుతుంది. అది కూడా తమ కుటుంబ రాజకీయ భవిష్యత్ కోసం. అమ్మ ప్రేమకి నోచుకోని రమణ.. ఆ కుటుంబ అవసరం తీర్చాడా? లేదా? ఆ క్రమంలో తల్లి ప్రేమని తిరిగి దక్కించుకున్నాడా? లేదా? ఈ క్రమంలో రమణకి పరిచయమైన అమ్ము(శ్రీలీల) ప్రేమని ఎలా సాధించాడు అన్నదే గుంటూరు కారం కథ.

విశ్లేషణ:

తెలుగు సినీ పరిశ్రమలోని టైర్ వన్ హీరోలలో సూపర్ స్టార్ మహేశ్ బాబుకి సపరేట్ ఇమేజ్ ఉంది. ఆయన మాస్ సినిమాలు చేస్తే ఇండస్ట్రీ రికార్డ్స్ వచ్చి పడ్డాయి. ఇలాంటి హీరోని ఈ మధ్య కాలంలో మాసీగా చూపించడం దర్శకులు మర్చిపోయారు. దీంతో ఫ్యాన్స్ అంతా గుంటూరు కారం మూవీపై చాలా అంచనాలు పెట్టుకున్నారు. టీజర్, ట్రైలర్, కుర్చీ మడత పెట్టి సాంగ్ వంటి ప్రమోషనల్ వీడియోస్ అన్నీ గుంటూరు కారం పక్కా మాస్ మసాలా అన్న రీతిలోనే రిలీజ్ చేశారు. కానీ.., వాస్తవానికి సినిమాలో మాత్రం అంతటి మాస్ ఎలిమెంట్స్ లేకుండా పోయాయి. ఓ పక్కా గుంటూరు మాస్ కుర్రాడి క్యారెక్టర్ ని, పక్కా తెలుగు సీరియల్ లో పెట్టి తీస్తే.. ఆ అవుట్ పుట్ ఎలా ఉంటుందో గుంటూరు కారం సినిమా అలా తయారైంది. ఇది పక్కాగా గురూజీ పెన్ నుండి వచ్చిన అత్యంత బలహీనమైన కథ వల్ల జరిగిన డ్యామేజ్ అని మొహమాటం లేకుండా చెప్పుకోవచ్చు. త్రివిక్రమ్ సినిమాల్లో ఎమోషన్స్ కి పెద్ద పీఠ ఉంటుంది. కాకుంటే.. ప్రతిసారి ఒకే రకమైన కథలతో ఆ మ్యాజిక్ రిపీట్ చేయొచ్చు అనుకోవడం నిజంగా అమాయకత్వం అవుతుంది.

కాంఫ్లిక్ట్ పాయింట్ ని లైటర్ వీన్ లో టచ్ చేసి త్రివిక్రమ్ స్టోరీ ఓపెన్ చేసిన విధానం బాగుంది. అక్కడ నుండి రమణ క్యారెక్టరైజేషన్ ఎంట్రీ కావడంతో గుంటురు కారం టేకాఫ్ అద్భుతంగా జరిగిందన్న ఫీలింగ్ కలుగుతుంది. అయితే.., అక్కడ నుండి కథ ముందుకి నడవకుండా రమణ క్యారెక్టరైజేషన్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ.. పొంతన లేని, అతకని సీక్వెన్స్ లతో, నీరసం తెప్పించే స్క్రీన్ ప్లేతో కథ నెమ్మదిగా సాగిపోతూ ఉంటుంది. ఈ గ్యాప్ లో అసలు ఎమోషన్ లేని లవ్ ట్రాక్ ఆడియన్స్ కళ్ళకి కనువిందుగా కనిపించినా, ఒక్క సన్నివేశంలో కూడా మనసుని హత్తుకోకపోవడం మరో మైనస్.

ఇదీ చదవండి: హనుమాన్ మూవీ రివ్యూ

ఫస్ట్ ఆఫ్ లో మిస్ అయిన ఎమోషన్స్ సెకండ్ ఆఫ్ లో అయినా హైలెట్ అవుతాయా అనుకుంటే ఇక్కడ కూడా ఆడియన్స్ ఓపిక పట్టక తప్పదు. ముఖ్యంగా ఒక్కో సీక్వెన్స్ 10 నుండి 12 నిముషాలు పాటు సాగుతూ ప్రతి చోటా సీరియల్ చూస్తున్నామన్న ఫీల్ కలిగేలా చేస్తుంది. ఈ క్రమంలో అక్కడక్కడా రమణ క్యారెక్టరైజేషన్ వల్ల కామెడీ వర్కౌట్ అయినా.. కథ, కథనం లేని ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లలేకపోయింది. ఎప్పుడైతే రమ్యకృష్ణ పాత్రకి వెయిట్ పెరుగుద్దో అక్కడ నుండి గుంటురు కారం సరైన ట్రాక్ లోకి వచ్చినట్టు కనిపిస్తుంది. కాకుంటే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడం, ఎలాంటి నెక్స్ట్ లెవల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వని క్లైమ్యాక్స్ కారణంగా గుంటురు కారం పూర్తిగా చప్పబడిపోయింది.

నటీనటుల పనితీరు:

గుంటూరు కారం సినిమాని, దర్శకుడు త్రివిక్రమ్ ని మహేశ్ బాబు వందకి రెండు వందల శాతం నమ్మేశారు. తన ఫ్యాన్స్ ఆకలి తీర్చేలా తాను ఓ పక్కా మాస్ మసాలా సినిమాలో నటిస్తున్నాను అన్న నమ్మకంతో ప్రాణం పెట్టి నటించేశారు. ముఖ్యంగా గుంటురు స్లాంగ్ లో మహేశ్ డైలాగ్ డెలివరీ, ఎనర్జీ, లుక్, యాక్టింగ్ అన్నీ అన్ మ్యాచబుల్. కేవలం రమణ క్యారెక్టర్ కి మహేశ్ పూర్తి న్యాయం చేశాడు కాబట్టే.. గుంటూరు కారం కాస్తయినా ఘాటెక్కింది. ఇక మహేశ్ తరువాత ఈ సినిమాలో చెప్పుకోవాల్సింది వెన్నల కిషోర్ క్యారెక్టర్ గురించి. సినిమాని బతికించడానికి వీరిద్దరూ చాలా వరకు కష్టపడ్డారు. ఇక ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, మురళీ శర్మ, ఈశ్వరీ రావు, జగపతిబాబు, సునీల్ వంటి నటులు అంతగా మెరవలేకపోయారు. ముఖ్యంగా కథలో ఎంతో కీలకమైన రమ్యకృష్ణ పాత్రకి అసలు స్క్రీన్ స్పేస్ లేకుండా పోయింది. హీరోయిన్ గా శ్రీలీల గ్లామర్ కి, డ్యాన్స్ లకి బాగా ప్లస్ అయింది గాని.. కథతో ఆమెకి ఎలాంటి సంబంధం లేదు. మరో హీరోయిన్ మీనాక్షి చౌదరికి ఆ మాత్రం స్కోప్ కూడా లేదు.

టెక్నికల్ విభాగం:

త్రివిక్రమ్ సినిమాలకి మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ అవుతూ ఉంటుంది. కానీ.., ఈసారి ఎందుకో ఆ మ్యాజిక్ మిస్ అయ్యింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే పీఎస్‌ వినోద్ కూడా పని చేశారు. అయినా.. ఆ గ్రాండియర్ మాత్రం కనిపించలేదు. ఇక నవీన్ నూలి ఎడిటింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పాటల విషయంలో థమన్ జస్ట్ ఓకే అనిపించగా, బీజీఎమ్ మాత్రం అదరగొట్టాడు. కానీ.., సన్నివేశాల్లో బలం లేక అది కూడా అంతగా హైలెట్ కాలేదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్. గుంటూరు కారం విషయంలో ఆయన రచయితగా విఫలం అయ్యారు. ఎక్కడా ఆయన పెన్ పవర్ అస్సలు కనిపించలేదు. ఈ ప్రభావం మిగతా అన్నీ క్రాఫ్ట్స్ పై పడింది. ఆఖరికి గురూజీ డైరెక్షన్ పై కూడా. ఇక నిర్మాణ విలువల పరంగా వేలెత్తి చూపించడానికి ఏమి లేదు.

ప్లస్ లు:

  • రమణ క్యారెక్టరైజేషన్
  • మహేశ్ బాబు నటన, ఎనర్జీ, లుక్
  • శ్రీలీల అందం, డ్యాన్స్
  • వెన్నెల కిషోర్

మైనస్ లు:

  • కథ, కథనం
  • ఎమోషన్స్ పండకపోవడం
  • త్రివిక్రమ్ మార్క్ మిస్ అవ్వడం
  • ఎడిటింగ్

చివరి మాట: గుంటూరు కారం.. ఘాటు తగ్గింది

రేటింగ్: 2.5/5

Show comments