BCCI Bad News Andhra Cricket Fans: ఆంధ్రాకు బ్యాడ్ న్యూస్ చెప్పిన BCCI అధ్యక్షుడు రోజర్ బిన్నీ!

ఆంధ్రాకు బ్యాడ్ న్యూస్ చెప్పిన BCCI అధ్యక్షుడు రోజర్ బిన్నీ!

  • Author singhj Published - 04:31 PM, Tue - 29 August 23
  • Author singhj Published - 04:31 PM, Tue - 29 August 23
ఆంధ్రాకు బ్యాడ్ న్యూస్ చెప్పిన BCCI అధ్యక్షుడు రోజర్ బిన్నీ!

ఆంధ్రా క్రికెట్ సంఘం (ఏసీఏ) ఏర్పాటై 70 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, టీమిండియా లెజెండరీ క్రికెటర్ మదన్​లాల్ ఆదివారం విశాఖపట్నానికి వచ్చారు. ఏసీఏ ప్లాటినమ్ జూబ్లీ వేడుక సందర్భంగా వైఎస్సార్ స్టేడియంలో ఏర్పాటు చేసిన పైలాన్​ను రోజర్ బిన్నీ, మదన్​లాల్ ఆవిష్కరించారు. ఆ తర్వాత బిన్నీ మాట్లాడుతూ.. ఆంధ్రా క్రికెట్ సంఘం ప్రోత్సాహంతో ఏపీ క్రికెటర్లు జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నారని అన్నారు. క్రికెటర్లకు కావాల్సిన మైదానాలు, మౌలిక వసతులు, అకాడమీలు రాష్ట్రంలో పెరుగుతున్నాయని ఆయన చెప్పారు.

వైజాగ్​తో తనకు ఉన్న అనుబంధాన్ని రోజర్ బిన్నీ గుర్తుచేసుకున్నారు. 1975లో రంజీ మ్యాచ్ ఆడేందుకు సిటీకి వచ్చానన్నారు. అప్పటితో పోలిస్తే నగరం ఇప్పుడు ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలో ఇతర రాష్ట్రాలు కూడా క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని బిన్నీ చెప్పుకొచ్చారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ లీగ్​కు వరల్డ్​ వైడ్​గా ఎంతో పాపులారిటీ ఉందన్నారు. ఐపీఎల్ ప్రమాణాలను పాటించాలంటే అందులో పాల్గొనే ఫ్రాంచైజీల సంఖ్య మీద నియంత్రణ ఉండాలన్నారు. అందుకే ఇప్పట్లో కొత్త ఫ్రాంచైజీకి అవకాశం లేదని బిన్నీ స్పష్టం చేశారు.

ఐపీఎల్​లో కొత్త ఫ్రాంచైజీకి ఇప్పట్లో ఛాన్స్ లేదని రోజర్ బిన్నీ చెప్పడంతో ఆంధ్రా క్రికెట్ ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. ఐపీఎల్​లో ఆంధ్రా టీమ్ ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇటీవల ఆకాంక్షించిన విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక ఐపీఎల్​ లీగ్​లో ఒక ఫ్రాంచైజీని దక్కించుకోవాలని.. వైజాగ్ స్టేడియంలో వైఎస్సార్ విగ్రహావిష్కరణ సందర్భంగా జగన్ వ్యాఖ్యానించారు. అయితే తాజాగా బీసీసీఐ బాస్ రోజర్ బిన్నీ చేసిన వ్యాఖ్యలతో ఐపీఎల్​లో ఆంధ్రా జట్టు ఉండటం ఇప్పట్లో సాధ్యం కాదని స్పష్టమైనట్లయింది. కాగా, ఐపీఎల్ స్టార్ట్ అయిన 2008 నుంచి 2021 వరకు లీగ్​లో 8 ఫ్రాంచైజీలే ఉండేవి. అయితే 2022 సీజన్​లో గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీలను చేర్చారు. దీంతో లీగ్​లో జట్ల సంఖ్య పదికి చేరింది.

Show comments