AP Panchayat Bypolls: ఏపీ పంచాయతీ ఉప ఎన్నికల్లో YSRCP అభ్యర్థుల విజయం!

ఏపీ పంచాయతీ ఉప ఎన్నికల్లో YSRCP అభ్యర్థుల విజయం!

  • Author singhj Published - 08:20 PM, Sat - 19 August 23
  • Author singhj Published - 08:20 PM, Sat - 19 August 23
ఏపీ పంచాయతీ ఉప ఎన్నికల్లో YSRCP అభ్యర్థుల విజయం!

ఆంధ్రప్రదేశ్​లోని పలు జిల్లాల్లో జరిగిన పంచాయితీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఒక్కొక్కటిగా రిజల్ట్స్ వెలువడుతున్నాయి. ఈ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో అధికార వైఎస్సార్​సీపీ బలపర్చిన అభ్యర్థులే జయకేతనం ఎగురవేస్తున్నారు. ఉప ఎన్నికలు మొత్తం 35 సర్పంచ్, 245 వార్డు మెంబర్ల స్థానాలకు జరిగాయి. నెల్లూరులోని మనుబోలు మండలం, బండేపల్లి మూడో వార్డులో ఒక్క ఓటుతో వైసీపీ మద్దతు అభ్యర్థి ఆవుల పొలమ్మ విజయం సాధించారు. చేజర్ల మండలం, పాతపాడులో రీకౌంటింగ్​లోనూ సమానంగా ఓట్లు రావడంతో అధికారులు లాటరీ నిర్వహించారు. లాటరీలో వైఎస్సార్సీపీ అభ్యర్థి షేక్ మస్తాన్ గెలుపొందారు.

ఏలూరు జిల్లాలోని దెందులూరు మండలం, కొవ్వలి గ్రామంలో జరిగిన 11వ వార్డు ఎన్నికల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్థి మొండి శ్రీను 288 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. పెదపాడు మండలంలోని పాత ముప్పర్రు గ్రామంలో జరిగిన 10వ వార్డు ఎలక్షన్​లో వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి గొట్టపు సోమేశ్వరి 26 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక, అనంతపురంలోని తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ హవా నడిచింది. తెలుగుదేశం పార్టీని, జేసీ బ్రదర్స్​ను వైసీపీ ఎదురుదెబ్బ తీసింది. జేసీ సొంత మండలమైన పెద్దపప్పూరులో టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది.

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు కూడా షాక్ తగిలింది. హిందూపురం మండలంలోని చలివెందుల పంచాయతీ ఉప ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారు ఉపేంద్ర రెడ్డి 337 ఓట్లతో విజయం సాధించారు. కుప్పం నియోజకవర్గంలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చూపిస్తోంది. అక్కడి శాంతిపురం మండలం కడపల్లి పంచాయతీ 10వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారుడు సుధాకర్ తన ప్రత్యర్థి ప్రకాష్​పై 47 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మొత్తంగా పంచాయతీ ఉప ఎన్నికల్లో టీడీపీ కంచుకోటలైన దెందులూరు, హిందూపురం, తాడిపత్రి, కుప్పం నియోజకవర్గాలతో పాటు నెల్లూరులో అత్యధిక స్థానాల్లో వైసీపీ మద్దుతున్న అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు.

Show comments