600 సెల్ ఫోన్ టవర్లు మాయం.. పక్షి రాజా పనే అంటూ ట్రోల్స్ 

600 సెల్ ఫోన్ టవర్లు మాయం.. పక్షి రాజా పనే అంటూ ట్రోల్స్ 

  • Updated - 08:20 PM, Sun - 26 June 22
600 సెల్ ఫోన్ టవర్లు మాయం.. పక్షి రాజా పనే అంటూ ట్రోల్స్ 

మీరు రజనీకాంత్ నటించిన రోబో 2.0 సినిమా చూశారా? అయితే మీకు పక్షిరాజా గురించి బాగా తెలిసే ఉంటుంది. ఈ సినిమాలో పక్షులకు సెల్ టవర్లు హాని చేస్తున్నాయనే కారణంతో మొత్తం సెల్ టవర్లు, మొబైల్ ఫోన్ల పైనే యుద్ధం చేసినంత పని చేస్తాడు పక్షిరాజా. తాజాగా తమిళనాడులో 600 సెల్ టవర్లు కనిపించకపోవడంతో సోషల్ మీడియాలో మరోసారి పక్షిరాజాను గుర్తు చేసుకుంటున్నారు.

అసలేం జరిగిందంటే?

GTL ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ తమిళనాడులో అనేక సెల్ టవర్లు ఏర్పాటు చేసింది. అయితే 2018 తరువాత కంపేనీకి భారీగా నష్టాలు వచ్చాయి. దీంతో తమ సేవలను నిలిపివేయగా, దేశవ్యాప్తంగా ఉన్న ఆ కంపెనీ సెల్ టవర్ల సేవలు సైతం ఆగిపోయాయి. దీనికి తోడు కరోనా విజృంభణతో సదరు టవర్ల పర్యవేక్షణ వీలు పడలేదు.

తాజాగా తమ సెల్ టవర్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసింది సదరు సంస్థ. అలా మొదలైన దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కోవిడ్ వ్యాప్తి మొదలైన సమయం నుంచి నేటి వరకు మొత్తంగా 600 సెల్ టవర్లు మాయమైనట్లు తేలింది.

జీటీఎల్ కంపెనీకి దేశమంతా 26 వేల మొబైల్ ఫోన్ టవర్లు ఉన్నాయి. కేవలం తమిళనాడులోనే 6వేలకు పైగా ఉన్నాయి. ఒక్కో సెల్ టవర్ ఏర్పాటుకు రూ.25 లక్షల నుంచి రూ.40 లక్షలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఈ ఉదంతంతో ఇప్పుడు కోట్లలో నష్టం వచ్చిందని చెప్తోంది కంపెనీ. ఈ కేసుపై దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు.

Pic Credits: Telugu Swaggers Meme Page

అయితే ఈ వార్త బయటకొచ్చినప్పటి నుంచి పక్షిరాజాను గుర్తు చేసుకుంటూ ట్రోల్స్ చేస్తున్నాయి సోషల్ మీడియాలోని మీమ్స్ పేజీలు. ఆ సినిమాలోని సీన్లకు తగ్గట్లుగా సెల్ టవర్లు మాయమవ్వడంతో ఇప్పుడు పక్షిరాజా మరోసారి హాట్ టాపిక్ గా మారాడు.

Show comments