iDreamPost

దిగ్విజయ్ – జ్యోతిరాదిత్య పోరులో నెగ్గేదెవరో?

దిగ్విజయ్ – జ్యోతిరాదిత్య పోరులో నెగ్గేదెవరో?

మధ్యప్రదేశ్‌లోని మూడు రాజ్యసభ స్థానాలకు శుక్రవారం అసెంబ్లీ ప్రాంగణంలో పోలింగ్ జరిగింది. కరోనా మహమ్మరి నేపథ్యంలో లాక్ డౌన్ నియమాలను అనుసరించి ఓటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మొదటి ఓటు వేశారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో మూడు రాజ్యసభ స్థానాలకు మొత్తం నలుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో కేంద్ర మాజీ మంత్రులు జ్యోతిరాదిత్య సింధియా, సుమేర్ సింగ్ సోలంకి బిజెపి అభ్యర్థులు కాగా, కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్, ఫూల్ సింగ్ బరయ్యలను నామినేట్ చేసింది.

వాస్తవానికి ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా చూస్తే మధ్యప్రదేశ్‌లో ఇద్దరు బిజెపి సభ్యులు, ఒక కాంగ్రెస్ సభ్యుడు రాజ్యసభకు వెళ్లాల్సి ఉండగా కాంగ్రెస్ అధిష్టానం మరో వ్యక్తిని కూడా రంగంలోకి దింపడంతో పోటీ ఉత్కంఠగా మారింది. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 230 మంది సభ్యులకు గాను అందులో ప్రస్తుతం 24 సీట్లు ఖాళీగా ఉన్నందున, సభలో ఎమ్మెల్యేల సంఖ్య 206 గా ఉంది. వీరిలో భారతీయ జనతా పార్టీకి 107 మంది ఎమ్మెల్యేలు ఉండగా, బహుజన్ సమాజ్ పార్టీకి చెందిన ఇద్దరు, సమాజ్ వాది పార్టీ ఒక ఎమ్మెల్యే, ఇంకా ఇద్దరు ఇద్దరు స్వతంత్రులు మద్దతు ఇస్తున్నారు. ఇక కాంగ్రెస్ కు ఉన్న శాసన సభ్యుల్లో సింధియా వర్గం అయిన 22మంది రాజీనామా చేయడం, మరో ఇద్దరు సభ్యులు చనిపోవడంతో ప్రస్తుతానికి కాంగ్రెస్ బలం 92 గా ఉంది.

అయితే రాజ్యసభకు వెళ్లడానికి ఒక అభ్యర్థికి 52 ఓట్లు అవసరం అయినప్పటికీ కాంగ్రెస్ ముందు జాగ్రత్త చర్యగా దిగ్విజయ్ సింగ్ 54 పార్టీ ఎమ్మెల్యేలను కేటాయించింది. ఇక మిగిలిన 38 తో ఫూల్ సింగ్ ను ఎలా గట్టెక్కించే ప్రయత్నం చేయబోతుందో మరి కొద్ది గంటల్లో తెలుస్తుంది. అయితే కమల్ నాథ్ నిర్వహించిన మాక్ ఓటింగ్ కి ఈ 38లో ముగ్గురు  గైర్హాజరు అవ్వడం గమనార్హం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి