బోనం అంటే ఏంటి? ఈ సంప్రదాయం ఎలా వచ్చింది? ఎప్పుడు మొదలైంది?

మన దేశంలో తెలంగాణలో మాత్రమే కనిపించే పండుగ బోనాలు. ఇక్కడ తప్ప ఇంకా మరే రాష్ట్రంలోనూ ఈ సంప్రదాయం కనిపించదు.

తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా బోనాలను చెప్పొచ్చు. ఈ ఉత్సవాలను సర్కారు రాష్ట్ర పండుగగా గుర్తించింది.

తెలంగాణలోని పల్లె, పట్నం అంతా ఇప్పుడు ఆషాడ బోనాల సందడి నెలకొంది. ఎల్లమ్మ, పోచమ్మకు బోనం సమర్పించి ప్రజలు తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.

 ఈ నేపథ్యంలో అసలు బోనం అంటే ఏంటి? ఈ సంప్రదాయం ఎలా వచ్చిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

భోజనం అనే పదానికి వికృత పదమే బోనం అని చరిత్రకారులు చెబుతున్నారు.

బోనాల పండుగ సందర్భంగా భక్తులు కొత్త మట్టి కుండల్లో బోనం (అన్నం) వండి అమ్మవార్లకు నైవేద్యంగా సమర్పిస్తారు.

పంటలు, ఆరోగ్యం బాగుండాలని కోరుతూ అమ్మవార్లకు బోనం సమర్పిస్తుంటారు భక్తులు. ఇందులో పంట బోనాలు, కులాలు, దేవతల వారీగా బోనాలు సమర్పించడాన్ని గమనించొచ్చు.

వానాకాలం ఆరంభంలో వచ్చే వ్యాధులను అరికట్టేలా ఈ పండుగలో కొన్ని ఆరోగ్య సూత్రాలు ఉన్నాయని చరిత్రకారులు అంటున్నారు.

1813లో హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి సోకి వేలాది సంఖ్యలో మరణాలు సంభవించాయి. అప్పుడు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో నియమించిన హైదరాబాద్ సైనిక దళం అక్కడి మహంకాళి అమ్మవారిని ప్రార్థించింది.

మధ్యప్రదేశ్ నుంచి తిరిగొచ్చాక హైదరాబాద్ లో మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి బోనాలు సమర్పించారు. దీంతో వ్యాధి తగ్గిపోయిందనేది భక్తుల విశ్వాసం. అప్పటి నుంచి తెలంగాణలో బోనాల సంప్రదాయం మొదలైంది.

బోనంలో భాగంగా తొలుత ఇత్తడి లేదా మట్టి పాత్రను తీసుకొని అందులో పాలు, బెల్లం వేసి వండుతారు. ఆ తర్వాత ఈ కుండను వేప ఆకులు, పసుపుతో అలంకరిస్తారు. అనంతరం తలపై ఎత్తుకొని అమ్మవార్లకు గాజులు, చీరలతో సహా బోనం సమర్పిస్తారు.

బోనాల పండుగలో భాగంగా గ్రామదేవతల తమ్ముడైన పోతరాజు, ఫలహారం బండ్లు, తొట్టెలు సమర్పిస్తుంటారు. ఆషాఢ మాసం తొలి ఆదివారం గోల్కొండ కోటలో మొదలై.. లాల్ దర్వాజ సింహవాహిని బోనాలతో ఈ పండుగ ముగుస్తుంది.