దేశంలోనే అతిపెద్ద నదైన  గంగ ప్రత్యేకతలు మీకు తెలుసా?

భారత్ లో అతి ముఖ్యమైన నదుల్లో ఒకటి గంగ. ఇది దేశంలోనే అత్యంత పెద్దనదిగా ప్రసిద్ధి గాంచింది.

దేశ సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక అంశాలతో గంగా నదికి అనుబంధం ఉంది. అలాంటి ఈ నదికి సంబంధించిన ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 2008లో గంగను భారత జాతీయ నదిగా ప్రకటించారు. గంగా నదిని ప్రక్షాళన చేసి తిరిగి పునర్వైభవం తీసుకొచ్చేందుకు గంగా యాక్షన్ ప్లాన్ (జీఏపీ)ని రూపొందించారు.

ఉత్తరాఖండ్ లోని గంగోత్రిని గంగా నది మూలస్థానంగా చెబుతారు. అక్కడే గంగ ఉద్భవించిందనేది నమ్మకం.

గంగా నది ఏకంగా 2,525 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తుంది. హిమాలయాల నుంచి ఉత్తర భారతం వరకు ప్రవహిస్తూ పశుపక్షాదులు, రైతన్నలకు జీవనాధారంగా మారింది.

భారత్ లో గంగ అని పిలిచే ఈ నదిని బంగ్లాదేశ్ లో పద్మ అని పిలుస్తారు.

వేల కిలోమీటర్లు ప్రవహించాక బ్రహ్మపుత్ర, మేఘనా నదులతో కలిసి చివరగా హిందూ మహాసముద్రంలోకి చేరుతుంది గంగ.

గంగా నది ప్రవహించే మార్గంలోనే వారణాసి, హరిద్వార్, రిషికేష్, ప్రయాగ్ రాజ్ లాంటి పలు ముఖ్యమైన హిందూ ఆలయాలు ఉన్నాయి.

గంగా నదిలో 140 రకాల చేప జాతులు సంచరిస్తుంటాయని నిపుణులు అంటున్నారు. ఇందులో డాల్ఫిన్లు కూడా ఉన్నాయని చెబుతున్నారు.

 గంగా బేసిన్ లో మొత్తం 11 రాష్ట్రాలు ఉన్నాయి.  అవే ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ , జార్ఖండ్, బిహార్, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ. వీటి గుండా ఆ నది ప్రవహిస్తోంది.

హిందూ మహాసముద్రంలో గంగా నది కలవడం వల్ల ఒక డెల్టా ఏర్పడింది. దాన్నే సుందర్బన్ అంటారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన డెల్టాగా ఇది ప్రసిద్ధికెక్కింది.

ఉత్తర భారతంతో పాటు  బంగ్లాదేశ్ లోనూ ఎంతో మంది రైతులకు గంగా నది నీళ్లే జీవనాధారం. ఈ నీటితో లక్షల ఎకరాల భూముల్లో పంట సాగు జరుగుతోంది.