iDreamPost

ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు..?

ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేలు భుజాలు ఎందుకు తడుముకుంటున్నారు..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల విషయంలో నెలకొన్న వివాదాలను ఆసరాగా చేసుకుని రాజకీయాలు చేసిన తెలుగుదేశం పార్టీ బండారాన్ని ప్రజలు గుర్తించడంతో ఆ పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడిపోయారు. ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో లేకపోవడంపై ఇటీవల టీడీపీ ఎమ్మెల్యేలు, నేతలు చేసిన హడావుడి అంతాఇంతా కాదు. ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతమైన మార్కాపురంలో దీక్షలు చేసిన ఆ పార్టీ నేతలు, ఆ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖలు రాశారు. ఆ తర్వాత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షేకావత్‌ను కలిసి వెలిగొండ ప్రాజెక్టును గెజిట్‌లో చేర్చాలంటూ వినతిపత్రాలు అందించారు.

అయితే కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు లేని విషయం గుర్తించిన ప్రభుత్వం, ఇరిగేషన్‌ శాఖ ఉన్నతాధికారులు.. ఆ విషయాన్ని వెంటనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో వెలిగొండ ప్రాజెక్టును చేర్చడంతోనే ఈ ప్రాజెక్టుకు చట్టబద్ధత వచ్చింది. గెజిట్‌లో అనుమతి ఉన్న ప్రాజెక్టు జాబితాలో లేకపోవడం కేవలం సమాచార లోపం మాత్రమే. ఇరిగేషన్‌ ఉన్నతాధికారులు ఈ విషయాన్ని జలశక్తి మంత్రిత్వశాఖ దృష్టికి తీసుకెళ్లగానే పొరపాటును సవరించడంపై దృష్టి పెట్టారు.

ఈ విషయం టీడీపీ నేతలకు తెలిసినా.. వెలిగొండ ప్రాజెక్టుపై వైసీపీ సర్కార్‌ శీతకన్ను వేస్తోందంటూ ఆ పార్టీ ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు విమర్శలు చేయడం ప్రారంభించారు. అంతకుముందు రాయలసీమ లిఫ్ట్‌ వల్ల ప్రకాశం జిల్లాకు నష్టం వాటిల్లితుందంటూ కొత్త వివాదాన్ని రేపేందుకు యత్నించారు. అయితే వారి ప్రయత్నం ఫలించకపోవడంతో వెలిగొండపై రాజకీయాలు చేయడం ప్రారంభించారు.

Also Read : జమ్మలమడుగు – ఒక ఫ్యామిలీ.. మూడు పార్టీలు

వెలిగొండ ప్రాజెక్టుకు 1999లో చంద్రబాబు శంకుస్థాపన చేసినా.. ఐదేళ్ల కాలంలో ఒక్క అడుగు ముందుకు పడలేదు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతే వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయి. నిర్మాణం ప్రారంభమైంది. సొరంగం తవ్వేందుకు ప్రత్యేక యంత్రాన్ని విదేశాల నుంచి తెప్పించారు. వైఎస్‌ మరణం తర్వాత ప్రాజెక్టు పనులు పడకేశాయి. విభజన తర్వాత ఏపీకి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు.. 2015 నుంచి 2018 వరకు ఐదుసార్లు ప్రకాశం జిల్లా పర్యటనకు వచ్చారు. ప్రతి సారి వెలిగొండ ప్రాజెక్టు పూర్తిపై తేదీలు ప్రకటించారు కానీ పనిలో చిత్తశుద్ధి చూపించలేదు.

వెలింగొండ ప్రాజెక్టు విభజన చట్టంలో ఉన్న విషయం తెలియడంతోపాటు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టు పనులు జరిగిన తీరు, ప్రాజెక్టు పూర్తి చేయడంపై బాబు చేసిన బూటకపు ప్రకటనలను గుర్తు చేసుకుంటున్న ప్రకాశం జిల్లా ప్రజలు.. టీడీపీ ఎమ్మెల్యేలు వెలిగొండ ప్రాజెక్టును తమ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని గుర్తించారు. దీంతో భుజాలు తడుముకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు వెలిగొండ ప్రాజెక్టుపై రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వెలిగొండ ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాల్సిన అవసరం టీడీపీకి లేదని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ చెప్పుకొస్తున్నారు. తాము రాసిన లేఖలకు ముఖ్యమంత్రి స్పందించకపోవడం వల్లనే ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రిని కలిశామని తాము చేసిన రాద్ధాంతాన్ని సమర్థించుకుంటున్నారు.

Also Read : ప్రశంసలందుకుంటున్న జగన్‌ సర్కార్‌ చర్య