Follow Us:

ఏకగ్రీవాల పరంపరకు తూర్పులో శ్రీకారం

పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు సుదీర్ఘకాలంగా వస్తున్న ఆనవాయితీ. అయితే ఇప్పుడు దానిని కూడా వివాదంగా మలచాలనే యత్నంలో విపక్షాలున్నట్టు కనిపిస్తోంది. పంచాయితీ ఎన్నికలు పార్టీ రహితంగా జరిగాయి. కాబట్టి ఆయా గ్రామాల్లో ఉన్నంతలో మంచి అభ్యర్థిని ఎన్నుకునేందుకు ఎక్కువ మంది మొగ్గుచూపుతారు. కక్షలు, కార్పణ్యాలకు తావు లేకుండా సామరస్యంగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమవుతారు. అలాంటి ఏకగ్రీవ ఎన్నికలను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. ఒక్క ఏపీలోనే కాకుండా దేశంలో హర్యానా, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు సహా అనేక రాష్ట్రాల్లో ఏకగ్రీవాలకు నజరానా ప్రకటించే సంప్రదాయం కూడా ఉంది. అది కూడా ఈనాటిది కాదు. ఏపీలో ఉమ్మడి ఆంధ్ర కాలంలోనే ఎన్టీఆర్ హయం నుంచి ఉంది. 2001లో స్వయంగా చంద్రబాబు జనాభా ప్రాతిపదికన పంచాయితీల ఏకగ్రీవాలకు నజరానా ప్రకటించారు. దానిని వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి హయంలో కూడా కొనసాగించారు.

జగన్ ప్రభుత్వం ఏం చేసినా నేరమే అన్నట్టుగా చిత్రీకరించే మీడియా, బాబు బ్యాచ్ ఇప్పుడు ఏకగ్రీవాల మీద ఎక్కుపెట్టారు. గ్రామస్తులంతా కలిసి ఉమ్మడి నిర్ణయం తీసుకుంటే అదే నేరమన్నట్టుగా చిత్రీకరించేందుకు సిద్ధమయ్యారు. కానీ గ్రామాలలో పరిస్థితి వేరు. హైదరాబాద్ నుంచి చంద్రబాబు శతవిధాలా ప్రయత్నించినా పల్లెల్లో ప్రజల మధ్య విద్వేషాలు పెంచే ప్రక్రియ సాగడం లేదు. ఇప్పటికే కుల, మతాల ఆధారంగా చేసిన యత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇప్పుడు పంచాయితీ పోరు పేరుతో అలాంటి ప్రయత్నాలు చేసినా చెల్లుబాటయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాతో ఈ ఏకగ్రీవాల పరంపరకు శ్రీకారం పడింది. జిల్లాలోని గొల్లప్రోలు మండలం దుర్గాడలో పంచాయితీ సర్పంచ్ ఎన్నికలకు ప్రజలంతా ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు. అందుకు గానూ గ్రామాభివృద్ధికి రూ.30లక్షలు ఇవ్వడానికి ఒక వ్యక్తి ముందుకొచ్చారు. బీసీ రిజర్వుడయిన ఈ పంచాయితీలో ఏకగ్రీవాలు గతంలో కూడా జరిగాయి. అదే రీతిలో ముమ్మడివరం నియోజకవర్గం గేదెల్లంక పంచాయితీ కూడా ఏగ్రీవం అయ్యింది. అక్కడ ఓసి మహిళ రిజర్వుడు సీటులో పంచాయితీ సర్పంచ్, వార్డు మెంబర్ పోస్టులన్నీ ఏకగ్రీవం చేయాలని ఉమ్మడి నిర్ణయం తీసుకున్నారు. అదే పరిస్థితి దాదాపుగా అన్ని జిల్లాల్లో ఉంది. గత ఎన్నికల్లో సుమారు 2వేల పంచాయితీలు ఏపీలో ఏకగ్రీవాలు కాగా ఈసారి ఆ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.

త్వరలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ సింబల్ ప్రాతిపదికన జరుగుతాయి. కాబట్టి ఇప్పుడే పార్టీల వారీగా ప్రజలను విభజించడం కన్నా సామరస్యంగా ఎన్నికలను పూర్తిచేయడం మంచిదనే సంకల్పం అటు సర్కారు పెద్దల్లోనూ, ఇటు సామన్యుల్లోనూ ఉంది. ఎటొచ్చి టీడీపీ, జనసేన వంటి నేతలకే అది జీర్ణం కావడం లేదు. ప్రజల ఐక్యతను చెదరగొట్టేందుకు కాచుకుని కూర్చున్నట్టు కనిపిస్తోంది. అయినా వారి ఆటలు సాగవని తూర్పు గోదావరి నుంచే ఏకగ్రీవాలు ప్రారంభం కావడం నిరూపిస్తోంది.