Tomato Rates: రూ. 100కు చేరువలో టమాటా ధర.. నాది అదే దారి అంటోన్న ఉల్లి

రూ. 100కు చేరువలో టమాటా ధర.. నాది అదే దారి అంటోన్న ఉల్లి

ఒకప్పుడు వంద రూపాయలు తీసుకుని కూరగాయల మార్కెట్ కు వెళితే.. సంచి మొత్తం నిండిపోయేది. కానీ నేడు ఐదు వందల రూపాయలు తీసుకెళ్లినా.. బ్యాగ్ సగం కూడా నిండటం లేదు. కారణం వెజిటేబుల్స్ ధరలు పెరిగాయి. ముఖ్యంగా..

ఒకప్పుడు వంద రూపాయలు తీసుకుని కూరగాయల మార్కెట్ కు వెళితే.. సంచి మొత్తం నిండిపోయేది. కానీ నేడు ఐదు వందల రూపాయలు తీసుకెళ్లినా.. బ్యాగ్ సగం కూడా నిండటం లేదు. కారణం వెజిటేబుల్స్ ధరలు పెరిగాయి. ముఖ్యంగా..

‘ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు నాగులో నాగన్నా.. ధరలిట్ల మండబట్టి.. నాగులో నాగన్న.. ధరల మీద ధరలు పెరిగే నాగులో నాగన్నా’ అనే ఓ మూవీలో సాంగ్ ఇప్పటి పరిస్థితులకు నిదర్శనంగా నిలుస్తుంది. నిత్యావసర సరకులు ధరలు నానాటికి పెరుగుతున్నాయి. ఇటు చూస్తే కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఎండాకాలంలో కాస్త అటు ఇటుగా అనిపించినా..వర్షాకాలం మొదలయ్యిందో లేదో కూరగాయాల రేట్లకు రెక్కలు వచ్చాయి. గత ఏడాది టమాటా ధరలు భయపెట్టాయి. సుమారు రూ. 150 నుండి రూ. 200 వరకు చేరింది. ఆ తర్వాత ఉల్లి అదే బాటలో నడిచింది. నేనేమీ తక్కువ తిన్నానా అని వెల్లుల్లి కూడా వీటికి తోడయ్యింది. దీంతో ప్రజలు బెంబేతెత్తిపోయారు.

ఇప్పుడు మళ్లీ టమాటా, ఉల్లిపాయలు భయపెడుతున్నాయి. వేసవి కాలంలో టమాటాకు సరైన గిట్టుబాటు ధర లేక.. రోడ్డుపై పారపోశారు రైతులు. ఇప్పుడు అదే టమాటా హవా చూపిస్తుంది. వంద చేరువలోకి వస్తుంది. గత ఏడాది పరిస్థితులు నెలకొనేలా ఉన్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రకం టమాటా ధర రూ. 80 నుండి రూ. 90 పలుకుతుంది. ఇక రెండో రకం టమాటా రూ. 60 నుండి రూ. 80కి చేరింది. ఇక రిటైల్ దుకాణాల్లో అయితే వీటి ధర మరింత పెరిగింది. కిలో వంద చొప్పున విక్రయిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదే సమయంలో కోస్తేనే కాదు.. కొంటే కూడా ఏడిపిస్తానని మొదలు పెట్టింది ఉల్లిపాయ. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని సామెత. కానీ ఇప్పుడు దీని రేటు కూడా బాధపెట్టిస్తోంది.

ప్రస్తుతం మార్కెట్‌లో కిలో ఉల్లిపాయ ధర రూ. 50-60 రూపాయలు పలుకుతుంది. సెకండ్ క్వాటిలీ ఉల్లిపాయ అయితే.. మూడు కిలోలు వందకు అమ్ముతున్నారు. ఇందులో చిన్న పాయ ధర మరోలా ఉంది. మొత్తానికి చికెన్, మటనే కాదు.. ఇప్పుడు వీటితో కూర వండుకోవాలన్నా సామాన్యులకు తడిసి మోపెడు అవుతుంది. గతంలో వంద రూపాయలు తీసుకెళితే.. సంచి నిండా కూరగాయలు, ఆకుకూరలు వచ్చేవి. కానీ నేడు 500 రూపాయలు తీసుకెళ్లినా కూడా బ్యాగ్ సగం కూడా నిండటం లేదు. మళ్లీ ఉల్లి, టమాటా లేకుండా జనాలు తినడం అలవాటు చేసుకోవాల్సిందే. వీటి ధరల పెరుగుదల.. వంటింట్లో వంట చేసే మహిళలకు శాపంగా మారిపోయింది. బంగారం ధర పెరిగినా బాధపడరు కానీ.. వీటి ధరలు పెరిగితే.. ఆందోళన చెందుతూ ఉంటారు. మరీ ఈ ధరలు ఎప్పటికీ ఊరటనిస్తాయో వేచి చూడాల్సిందే.

Show comments