iDreamPost

టాలీవుడ్లో మొదటిసారి ఇలాంటి పోటీ

టాలీవుడ్లో మొదటిసారి ఇలాంటి పోటీ

సెప్టెంబర్ 10 బహుశా తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన రోజు కావొచ్చు. ఎందుకంటే నాని టక్ జగదీష్ ఓటిటిలో, గోపీచంద్ సీటిమార్ థియేటర్లో ఒకేరోజు పోటాపోటీగా బరిలో దిగుతున్నాయి. రెండింటి మీద భారీ అంచనాలు ఉన్నాయి. సీటిమార్ సుమారు 15 కోట్ల దాకా బిజినెస్ జరుపుకోగా టక్ జగదీష్ ని అమెజాన్ ప్రైమ్ 37 కోట్ల దాకా హక్కుల కోసం పెట్టుబడిగా పెట్టిందని మీడియా టాక్. వీటికి స్పందన ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. ఆ రోజు వినాయక చవితి కావడం, జనాలంతా పండగ మూడ్ లో మంచి ఎంటర్ టైన్మెంట్ కోరుకుంటే వాళ్లకు రెండు ఆప్షన్లు ఉండటం ఇదంతా ఎవరూ ఊహించనిది.

నిజానికి ఈ పోరులో రిస్క్ ఉన్నది గోపీచంద్ మూవీకే. ఎందుకంటే నాని సినిమాని ఇంట్లోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు మన సౌలభ్యానికి తగ్గట్టు చూసుకోవచ్చు. పైగా ఆల్రెడీ ప్రైమ్ మెంబెర్ షిప్ ఉంటే పైసా ఖర్చు లేకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఒకవేళ లేకపోయినా నలుగురు టికెట్లకు అయ్యే ఖర్చుతో ఏడాది చందా ఈజీగా కట్టేయొచ్చు. అదీ కుదరదు అనుకుంటే ఆన్ లైన్ వీరులకు మార్గాలు కోకొల్లలు. కానీ సీటిమార్ కు ఆ అవకాశం లేదు. టాక్ చాలా కీలకం. జనాన్ని థియేటర్ దాకా రప్పించాలంటే సినిమా చాలా బాగుందనే మాట వినిపించాలి. అప్పుడు ఈజీగా టికెట్ కౌంటర్లను ఫుల్ చేసేయొచ్చు.

ఇలా ఒకే రోజు ఓటిటి థియేటర్ తలపడటం వల్ల తమకు నష్టమని ఆ మధ్య ఎగ్జిబిటర్లు ఆవేదన వ్యక్తం చేయడం న్యాయమే కానీ నాని, దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాతలు సాహు గరికపాటి వెర్షన్లు విన్నాక వాళ్ళది తప్పని చెప్పలేం.సినిమా అనేది వ్యాపారం. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినవాడు తను ముందు సేఫ్ అయ్యే మార్గం చూసుకుంటాడు తప్ప ఎవరినో ఉద్దరించేందుకు ఓకే అనడు. ఇక్కడ జరుగుతోంది అదే. ఒకవేళ సీటిమార్ కనక బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి ఓ ఇరవై కోట్లు వసూలు చేయగలిగితే అప్పుడు అభిప్రాయాలు ఆలోచనలు మారే అవకాశాలు ఉంటాయి. థర్డ్ వేవ్ భయాల మధ్య అది సాధ్యమేనంటారా

Also Read : సురేష్ బాబు వ్యూహాత్మక మౌనం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి