YCP, Sajjala Ramakrishna Reddy, Chandrababu – బాబులో ఫ్రస్ట్రేషన్‌ అందుకేనట.. కారణం చెప్పిన సజ్జల

కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో దొంగ ఓట్లు వేస్తున్నారంటూ… అధికార పార్టీ వైసీపీ, ప్రభుత్వంపై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేసిన విమర్శలు, ఆరోపణలుపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. మీడియాతో మాట్లాడిన సజ్జల.. చంద్రబాబు తీరును ఎండగట్టారు. ప్రజలతో కూడిన రాజకీయానికి చంద్రబాబు ఎప్పుడో దూరమైన చంద్రబాబు.. ఈ తరహాలో ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు సంబంధంలేని రాజకీయాలు చేస్తున్న చంద్రబాబు.. ప్రజలకు పనికిరాని క్యారెక్టర్‌ అని విమర్శించారు. కుప్పంలో ఎవరు దొంగ ఓట్లు వేయించారో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. పోలింగ్‌ బూత్‌లలో టీడీపీ ఏజెంట్లు ఉంటే.. దొంగ ఓట్లు ఎలా వేస్తారని సజ్జల ప్రశ్నించారు. దొంగ ఓట్లు వేస్తుంటే.. టీడీపీ ఏజెంట్లు నిద్రపోతున్నారా..? అని ఎద్దేవా చేశారు.

మంచి చేసే వారిని ప్రజలు ఆదరిస్తారని సజ్జల వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రజలకు మంచి చేస్తున్నారు కాబట్టే.. ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు వైసీపీని గెలిపిస్తున్నారని అభివర్ణించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రజల వద్దకు వచ్చిందని, పరిపాలన గ్రామాలకు చేరిందన్నారు. ప్రజలు ఈ విషయం గమనించారని, కానీ చంద్రబాబుకే ఈ విషయం అర్థం కావడంలేదన్నారు. దశాబ్ధాలుగా చంద్రబాబు చెరలో కుప్పం నలిగిపోయిందని సజ్జల విమర్శించారు. కుప్పం అయినా నిలబడుతుందని చంద్రబాబు భావించారని, కానీ అది జరిగేలా కనిపించకపోవడంతో ఫ్రస్ట్రేషన్‌కు గురవుతున్నారని సజ్జల పేర్కొన్నారు. టెంపర్‌కు గురవుతూ.. ప్రజలను తిరగబడాలంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు చంద్రబాబుపైనే తిరగబడుతున్నారని సజ్జల వ్యాఖ్యానించారు.

కాగా, మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. తప్పుడు పనులు చేసిన తాము గెలిచామని అనిపించుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి దారుణంగా వ్యవహరిస్తున్నారని మాట్లాడారు. ఓటర్లకు డబ్బులతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని, వాలంటీర్ల ద్వారా బెదిరిస్తున్నారని, ఏజెంట్లను అరెస్ట్‌ చేశారని.. చంద్రబాబు ఆరోపించారు. దొంగ ఓట్లు వేసేందుకు ప్రజలకు సిగ్గు ఉండాలన్నారు. ఎస్‌ఈసీకి ఎన్నికలు చేతగాకపోతే వెళ్లిపోవాలన్నారు. పోలీసులు వివక్ష చూపుతున్నారన్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వైసీపీ నేతలు మైండ్‌ గేమ్‌ అడుతున్నారని ఆరోపించారు. తాము మున్సిపల్‌ ఎన్నికల కోసం మాట్లాడడంలేదని, ప్రజా స్వామ్యం కోసం పోరాడుతున్నామన్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన టీడీపీ ఎక్కడకీ పోదన్నారు. టీడీపీ ఎన్నో సంక్షోభాలు చూసిందని చంద్రబాబు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు.

Also Read : TDP Chandrababu, Kuppam Elections – కుప్పంలో టీడీపీ ఓడిపోతోందా..? చంద్రబాబు ఎందుకలా మాట్లాడారు..?

Show comments