Idream media
Idream media
ప్రపంచ ఆర్థిక, సామాజిక సహా ఇతర అంశాలలో అభివృద్ధి ఏజెండాగా ప్రతి ఏడాది జనవరిలో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కి నిర్వాహకులు ఆహ్వానం పంపారు. జనవరి 17 నుంచి 21వ తేదీ వరకూ స్విడ్జర్లాండ్‌లోని దావోస్‌లో ఈ సదస్సు జరగబోతోంది. ఈ సారి ‘ కలిసి పని చేద్దాం – నమ్మకాన్ని పునరుద్ధరించుకుందాం’ అనే నినాదంతో ఈ సదస్సు జరగబోతోంది. ప్రపంప దేశాల నుంచి రాజకీయ, వ్యాపార సహా వివిధ రంగాల ప్రముఖులు ఈ సదస్సుకు హాజరై ఉపన్యాసం ఇస్తారు.
దావోస్ సదస్సు అనగానే.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తారు. ఆ స్థాయిలో చంద్రబాబు ఈ సదస్సును తన ప్రచారం కోసం ఉపయోగించుకున్నారు. చంద్రబాబు.. మంత్రులు, అధికారుల బృందంతో ప్రత్యేక విమానంలో దావోస్ వెళ్లి.. అక్కడ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయినట్లు చెప్పేవారు. పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయని, మరికొన్ని కంపెనీలతో అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కూడా కుదుర్చుకున్నామని వెల్లడించేవారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో.. భారత దేశం నుంచి పాల్గొనే ఏకైక వ్యక్తి చంద్రబాబు అంటూ టీడీపీ అనుకూల మీడియా టముకు వేసేది. రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు దావోస్ వెళ్లి.. అక్కడకు వచ్చే వ్యాపార, పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారని వార్తలు, ప్రత్యేక కథనాలు, చర్చా కార్యక్రమాలు ప్రసారం చేసేది. ప్రతి ఏడాది చంద్రబాబు దావోస్‌కు వెళతారు. భారీగా పెట్టుబడులను ఆకర్షించినట్లు ఆయన, టీడీపీ అనుకూల మీడియా చెబుతుంది. కానీ ఎంత మేర పెట్టుబడులు వచ్చాయి..? ఎన్ని కంపెనీలు స్థాపించారనే విషయాలను మాత్రం టీడీపీ అనుకూల మీడియా ఎప్పుడూ వెల్లడించలేదు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు భారత దేశం నుంచి చంద్రబాబు ఒక్కరే వెళ్లారని టీడీపీ అనుకూల మీడియా చేసే ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం ఉండేది కాదు. ప్రతి ఏడాది పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు అందేవి. సమయానుకులాన్ని బట్టి ఆహ్వానాలు అందిన వారు వెళ్లేందుకు యత్నించేవారు. మరికొందరు వెళ్లరు. గతంలో దివంగత మంత్రి అరుణ్‌జైట్లి, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేవేంద్ర ఫడ్నవిస్ సహా పలువురు నేతలు వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు హాజరయ్యారు. సీఎం వైఎస్ జగన్ ఈ సదస్సుకు హాజరవుతారా..? లేదా..? అన్నది మరికొన్ని రోజులు ఆగితేకానీ తెలియరాదు.
Also Read : Mini Municipal Elections – మినీ ప్రచారం ముగిసింది.. ఆ ఒక్క మున్సిపాలిటీపైనే ఆసక్తి