కోమ‌టిరెడ్డిపై చ‌ర్య‌లు తీసుకునే సాహ‌సం కాంగ్రెస్ చేస్తుందా?

కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి.. కాంగ్రెస్ ఎంపీ, సీనియ‌ర్ నేత మాత్ర‌మే కాదు.. ఉమ్మ‌డి న‌ల్గొండ జిల్లాలో గ‌ట్టి ప‌ట్టున్న నాయ‌కుడు. న‌ల్ల‌గొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి నాలుగు సార్లు కాంగ్రెస్ నుంచి విజ‌యం సాధించారు. వైఎస్సార్, రోశయ్య, కిర‌ణ్ కుమార్ రెడ్డి కేబినెట్ల‌లో మంత్రిగా ప‌ని చేశారు. కోమటిరెడ్డి 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతే నియోజ‌క‌వ‌ర్గంలోని చాలా మంది ప్ర‌జ‌లు క‌న్నీళ్లు పెట్టారు. ఆ త‌ర్వాతి ఏడాది జ‌రిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయ‌న‌ను ఎంపీగా గెలిపించారంటే కోమ‌టిరెడ్డికి ఉన్న ప్ర‌జాద‌ర‌ణ అర్థం చేసుకోవ‌చ్చు. అంగ‌బ‌లం, అర్ధ‌బ‌లం, రాజ‌కీయ బ‌లం ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న‌కు పీసీసీ చీఫ్ ప‌ద‌వి ద‌క్క‌లేదు. పైగా టీడీపీ నుంచి వ‌చ్చిన రేవంత్ కు ఆ ప‌ద‌వి ఇచ్చిన‌ప్ప‌టి నుంచి కోమ‌టిరెడ్డి అడ‌పాద‌డ‌పా ధిక్కార స్వ‌రం వినిపిస్తూనే ఉన్నారు.

వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 12వ వ‌ర్ధంతి సంస్మ‌ర‌ణ‌ స‌భ విష‌యంలో కూడా పార్టీ నిర్ణ‌యానికి విరుద్ధంగా కోమ‌టిరెడ్డి వ్య‌వ‌హ‌రించారు. ఆ స‌భ‌కు వెళ్లొద్ద‌ని, వెళ్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని అధిష్ఠానం హుకూం జారీ చేసింది. అంతా హైకమాండ్ మాట విన్నారు. కానీ, ఒక్క‌రు మాత్రం రెబెల్ జెండా ఎగ‌రేశారు. తాను అక్క‌డ‌కు వెళ్లి తీరుతానంటూ ఆ రోజు ఉద‌య‌మే చెప్పారు. సాయంత్రం అన్న‌ట్టుగానే ఆ స‌భ‌కు వెళ్లారు. వైఎస్సార్‌ను వేనోళ్ల పొగిడారు. ఆయ‌నే కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి. విజ‌య‌మ్మ నిర్వ‌హించిన‌ వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి 12వ వ‌ర్ధంతి సంస్మ‌ర‌ణ‌ స‌భ‌కు కోమ‌టిరెడ్డి హాజ‌రుకావ‌డం కాంగ్రెస్‌లో క‌ల‌క‌లం రేపుతోంది. ప‌దే ప‌దే పార్టీ లైన్‌ను ఉల్లంఘిస్తూ.. ప‌దే ప‌దే రెబెల్ వాయిస్ వినిపిస్తున్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి తీరుపై హ‌స్తం పార్టీ తీవ్ర ఆగ్ర‌హంగా ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

వైఎస్సార్ స‌భ‌కు ఎవ‌రూ హాజ‌రుకాకూడ‌ద‌ని ఏఐసీసీతో చ‌ర్చించి పీసీసీ నిర్ణ‌యం తీసుకుంది. కోమ‌టిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి మాత్రం తాను వెళ్లితీరుతాన‌ని ఆ వెంట‌నే ప్ర‌క‌టించ‌డం క‌ల‌క‌లం రేపింది. పార్టీ ఆదేశాల‌ను ధిక్క‌రించి.. అన్న‌ట్టుగానే ఆ స‌భ‌కు హాజ‌రయ్యారు. వైఎస్‌ఆర్‌ శిష్యుడిగా చెప్పుకోడానికి తాను గర్వపడుతున్నాన‌ని చెప్పారు. అయితే ఇది కాంగ్రెస్‌లో మ‌రోసారి ర‌చ్చకు దారి తీసింది. వైఎస్ సంస్మ‌ర‌ణ స‌భ‌కు వ‌ద్ద‌న్నా వెళ్ల‌డం ముమ్మాటికీ క్ర‌మ‌శిక్ష‌ణారాహిత్య‌మ‌ని మండిప‌డుతున్నారు పీసీసీ స‌భ్యులు. రేవంత్‌రెడ్డి ఎడ్డం అంటే.. కోమ‌టిరెడ్డి తెడ్డం అంటున్నార‌ని.. పార్టీ లైన్‌ను కావాల‌నే కాల‌రాస్తున్నార‌ని ఓ కాంగ్రెస్ లోని ఓవ‌ర్గం మండిప‌డుతోంది. కీల‌క నేత కాబ‌ట్టి.. ఇప్ప‌టికే చాలాసార్లు ఉపేక్షించామ‌ని.. అయినా కోమ‌టిరెడ్డి తీరు మార‌టం లేద‌ని.. ఇలాగైతే యాక్ష‌న్ తీసుకోక త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు.

రేవంత్‌రెడ్డి పీసీసీ ప‌ద‌వి డ‌బ్బులిచ్చి కొనుక్కున్నారంటూ గ‌తంలో తీవ్ర క‌ల‌క‌లం రేపారు. ఆ త‌ర్వాత యాద‌గిరిగుట్ట ఏరియాలో రేవంత్‌రెడ్డి ద‌ళిత‌-గిరిజ‌న దండోరా పెడ‌తానంటే.. తాను అందుబాటులో ఉండ‌నంటూ ఆ స‌భ పెట్ట‌కుండా స‌హాయ నిరాక‌ర‌ణ చేశారు. ఇప్పుడు పీసీసీ వ‌ద్ద‌ని చెప్పినా.. వైఎస్సార్ సంస్మ‌ర‌ణ స‌భ‌కు హాజ‌రై పార్టీపై ధిక్కార ధోర‌ణ ప్ర‌ద‌ర్శించారు. పైగా వెళితే త‌ప్పేంట‌ని ప్ర‌శ్నించ‌డంతో ఆయ‌నపై పార్టీ చ‌ర్య‌లు తీసుకుంటుందా అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. అలా చేస్తే ఇప్పుడున్న ఆ ప‌రిస్థితుల్లో అది తీవ్ర ప‌రిణామాల‌కు దారి తీసే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న నేప‌థ్యంలో కాంగ్రెస్ అటువంటి సాహ‌సం చేయ‌ద‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు. మ‌రి ఏం జ‌ర‌గ‌బోతుందో చూడాలి.

Show comments