బీజేపీతో కలిస్తే టిడిపికి ఎటువంటి లాభం?

ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా అధికారంలోకి వచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోను లేదు. కూటమి ని కూడగట్టి గెలుస్తుందా అంటే.. అదీ అనుమానమే. ఆ విషయం బహుశా ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడో పసిగట్టే ఉంటారు. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసిన అప్పటి నుంచి తెలుగుదేశం ప్రజలకు అంతకంతకు దూరం అవుతుందే కానీ చేరువ అవుతున్న దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదు. చంద్రబాబు నుంచి ఆయన తనయుడు లోకేష్, ఇతర ఇతర ప్రముఖ నేతలు సైతం ప్రజలను ఆకట్టుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వంపై విష ప్రచారాలు సైతం చేస్తున్నారు. కానీ వారి ప్రయత్నాలకు మించి ప్రభుత్వ కార్యక్రమాలు ఉండడంతో ప్రతిపక్ష టిడిపి జిమ్మిక్కులు పనిచేయడం లేదు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెంచడానికి బాబు సహా ఇతర నేతలు ఒక అడుగు ముందుకు వేస్తుంటే.. జగన్ ప్రజలకు చేరువయ్యేందుకు నాలుగు అడుగులు.. అదీ వేగంగా ముందుకు వేస్తున్నారు. ఫలితంగా టిడిపి ఆట సాగడం లేదు.

ఈ క్రమంలో ఒంటరిగా ప్రభుత్వాన్ని ఢీకొట్టే సత్తా లేకపోవడంతో బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కోవాలనే లక్ష్యంతో చంద్రబాబు వ్యూహాలు పన్నుతున్నారు. ఎప్పటి నుంచో బిజెపికి దగ్గర అయ్యేందుకు బాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయితే మోడీ ఆయనను దూరం పెడుతూ వచ్చారు. కానీ ఇటీవల కాలంలో మోడీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్నీ దీదీ, కాంగ్రెస్ పార్టీలతో జట్టుకట్టే దిశగా రాజకీయ సమీకరణాలు సాగుతున్నాయి. ఇదే అదునుగా చంద్రబాబు బీజేపీ లోనే ఉన్న తన అనుయాయుల ద్వారా మోదీకి దగ్గరయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టార్గెట్ 2024 పేరుతో కొత్త యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మోదీకి వ్యతిరేకత మొదలైతే చంద్రబాబుకు అడగకుండానే ప్రాధాన్యం దక్కుతుందని ముందస్తు వ్యూహాలు పన్నుతున్నారు. దీనిలో భాగంగా ఏపీలో ప్రత్యేక ప్రంట్ దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీలను ఏకం చేయడం, జట్టు కట్టడం.. ఇవన్నీ చంద్రబాబుకు నేషనల్ ఫ్రంట్ సమయం నుంచి చేసిన అనుభవం ఉంది. అయితే చంద్రబాబు ప్రయత్నాలు ఫలించి బీజేపీతో జట్టు కట్టినా, ఇప్పటికే బీజేపీతో జత అని చెప్పుకుంటున్న జనసేన కూడా కలిసిన ఏపీలో టిడిపి గెలుస్తుందా, బీజేపీతో జత కట్టడం మేలు చేస్తుందా, లేక మరింత కీడు చేస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి.

ఎందుకంటే… ప్రస్తుతం ఏపీ ప్రజలు టిడిపి కంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పై గుర్రుగా ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక హోదా పై దోబూచులాట, విశాఖ స్టీల్ ప్లాంట్ తెగ నమ్మడం, రైల్వే జోన్ విషయంలో కూడా వేగం పెంచకపోవడం ఇలా విభజన హామీల అమలులో అన్యాయం చేస్తుందనే అభిప్రాయం ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో బాబు బీజేపీతో కలవాలని తహతహలాడడం సరైంది కాదని టీడీపీలోని ఓ వర్గం భావిస్తోంది. అలాగని ఒంటరిగా పోటీ చేసినా వైసీపీని ఢీకొట్టే సత్తా ప్రస్తుతం మనకు లేదని మరో వర్గం వాదిస్తోంది. ఈ క్రమంలో టీడీపీ బీజేపీతో కలిస్తే నష్టమా లాభమా ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఓడిపోయింది. ఇతర పార్టీలతో కలిసి పోటీ చేసిన సందర్భంలోనూ ఓడిపోయింది. అయితే ఓటమి, గెలుపు అవకాశాలు ఎలాగున్నా బిజెపి జనసేన కమ్యూనిస్టు పార్టీల ద్వారా కలిసి పోటీ చేయడం ద్వారా రాష్ట్రంలోనే కొన్ని సీట్లు ఆ పార్టీలకు ఇచ్చేయవచ్చు. ఒకవేళ ఓడిపోతే పొత్తులో భాగంగా కొన్ని సీట్లను కోల్పోవలసి రావడమే తమ ఓటమికి కారణమని చెప్పుకునే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు కోసం బాబు ప్రయత్నాలు ముందుకు సాగుతాయని తెలుస్తోంది. మరి అదే జరిగితే సిపిఐ కూడా ఆ కూటమిలో కలుస్తుందా, కాషాయం తో కలిసి పోటీ చేస్తుందా అనేది అనుమానమే. మున్ముందు బాబు వ్యూహలు ఎలా ఉంటాయో, ప్రస్తుతం రాష్ట్రంలో బలమైన నాయకుడిగా ఎదిగిన జగన్ ను ఢీ కొట్టేందుకు ఎటువంటి ఎత్తులు వేస్తారు అనేది చూడాలి.

Also Read : బాబుని బజారున పడేసిన బుచ్చయ్య

Show comments