వాట్స‌ప్ కుట్ర : ఎవ‌రూ నోరు మెద‌ప‌రేం..?

జ‌గ‌న్ ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు మొద‌టి నుంచీ దారుల‌ను వెదుకుతూనే ఉన్నారు. ప్ర‌జ‌లు ఇచ్చిన గ‌ట్టి దెబ్బ‌తో ఎన్నిక‌ల అనంత‌రం రెండు, మూడు నెల‌లు మౌనంగా ఉన్న బాబు.. అనంత‌రం ప్ర‌భుత్వాన్ని, జ‌గ‌న్ ను ఎలా ఇరుకున పెట్టాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నారు. ఊహించ‌ని విధంగా జ‌గ‌న్ సంక్షేమ ప‌థ‌కాల‌ను ప్ర‌క‌టించ‌డం, వాటి ప్ర‌యోజ‌నాలు పొందుతున్న ప్ర‌జ‌లు జ‌గ‌న్ కు జేజేలు కొడుతుండ‌డాన్ని టీడీపీ టీం జీర్ణించుకోలేక పోతోంది. అందులో భాగంగానే.. ఏపీ చారిత్ర‌క నిర్ణ‌య‌మైన 33 ల‌క్ష‌ల మందికి ఇళ్ల స్థ‌లాల పంపిణీని అడుగ‌డుగునా అడ్డుత‌గిలింది. అవాంత‌రాల‌ను అన్నీ అధిగ‌మించి ఆ కార్య‌క్ర‌మాన్ని కూడా జ‌గ‌న్ ప్రారంభించేశారు.

దీంతో ర‌ఘురామ‌రాజును వాడుకోవ‌డం మొద‌లు పెట్టారు. ఎంపీని ఆయుధంగా చేసుకుని జ‌గ‌న్ టార్గెట్ గా విమ‌ర్శ‌లు గుప్పించ‌డం మొద‌లుపెట్టారు. వైసీపీ ఎంపీనే అయిన‌ప్ప‌టికీ ఏదో అసంతృప్తి లో ఉన్న ర‌ఘురామ అలా మాట్లాడుతున్నార‌ని మొద‌ట్లో ప్ర‌భుత్వం పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. రాను, రాను ఆయ‌న జ‌గ‌న్ ను వ్య‌క్తిగ‌తంగా దూషించ‌డం, ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెట్టాల‌ని ప్ర‌య‌త్నించ‌డంతో అనుమానంతో ఆరా తీయ‌గా.. ఆయ‌న వెనుక ఉండి ఆడిస్తోంది చంద్ర‌బాబు అన్న విష‌యం స‌ర్కార్ ప‌సిగ‌ట్టింది.

ఈ క్రమంలోనే ఎంపీ రఘురామ వెనుక.. టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఆయన అనుకూల మీడియా ఉందని.. ప్రభుత్వం మొద‌టి నుంచీ చెబుతూనే ఉంది. దీనికి సంబంధించి.. కేసు కూడా నమోదు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ సుప్రీంలో సాగుతోంది. ఈ క్రమంలో రఘురామపై తాము ఎందుకు కేసు నమోదు చేయాల్సి వచ్చిందో.. ఇతర మీడియా సంస్థలపైనా ఎందుకు కేసు పెట్టామో.. చెప్పే క్రమంలో జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీనిలో.. రఘురామ `వేషాలు` ఎన్ని ఉన్నాయో.. అన్నిం టినీ జగన్ ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వాన్ని ఏ విధంగా అస్థిర పరచాలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన తీరును సుప్రీం ముందు ఆధారాలతో సహా వెల్లడించింది.

అదేసమయంలో రఘురామకు టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్య సాగిన వాట్సాప్ చాటింగులు టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి లోకేష్తో రఘురామకుసాగిన ఫోన్ సంభాషణలను కూడా సీఐడీ పోలీసులు.. సుప్రీం కోర్టుకు అఫిడవిట్ రూపంలో అందించారు. ఇది… బార్ అండ్ బెంచ్ వెబ్సైట్లో ఉంచడంతో దేశం మొత్తానికి రఘురామ వర్సెస్ చంద్రబాబు నాటకం తెలిసిపో యింది. అయినప్పటికీ.. ఇంత జరిగినప్పటికీ.. టీడీపీ నుంచి ఏ ఒక్క నాయకుడు కూడా పన్నెత్తు మాట అనకపోవడం గమనార్హం. వాస్తవానికి ఇలాంటి లీకులు వచ్చినప్పుడు టీడీపీ అనుకూల మీడియా సహా.. చంద్రబాబు ఆదేశాలతో చోటా మోటా నేతలు కూడా లైన్లోకి వచ్చేసి.. మైకులు పగిలిపోయేలా కామెంట్లు చేస్తారు.

కానీ తాజా పరిణామంలో మాత్రం.. చంద్రబాబు నుంచి లోకేష్ వరకు.. అచ్చెన్న నుంచి.. గోరంట్ల వరకు ఎవరూ మాట్లాడలేదు. అంటే.. త‌ప్పించుకునే, ఖండించే మార్గాలు చంద్రబాబుకు క‌నిపించ లేద‌న్న విష‌యం అర్థ‌మైపోయింది. ర‌ఘురామ‌, చంద్ర‌బాబు క‌లిసి చేసిన కుట్ర‌లు ప్రజల్లోకి వెళ్లిన క్రమంలో.. ఏమైనా మాట్లాడితే తనపై మరింత విశ్వాసం సన్నగిల్లుందనే వాదనతోనే ఆయన ఈ విషయంపై సైలెంట్ అయ్యారనే వాదన బలంగా వినిపిస్తోంది. మొద‌టి నుంచీ ర‌ఘురామ మితిమీరి నోరు పారేసుకుంటున్నా, ప్ర‌భుత్వంపై కుట్ర‌లు చేస్తున్నా స్పందించ‌ని జ‌గ‌న్ ప‌క్కా ఆధారాల‌తో ఇప్పుడు వారి నోళ్లు క‌ట్టేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

Show comments