“గంటా” ఎందుకు మోగ‌డం లేదు..?

మాజీ మంత్రి, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు గంటా శ్రీ‌నివాస‌రావు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసుకోవాల‌ని ఉందా? కానీ, ఆ చాన్స్ లేన‌ట్లే క‌నిపిస్తోంది. విశాఖ ఉక్కు ప‌రిశ్ర‌మ కోసం రాజీనామా చేస్తున్నా అంటూ.. గాంభీర్య ప్ర‌క‌ట‌న‌లు చేసిన ఆయ‌న ఆ త‌ర్వాత సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఒక‌టి, రెండు సార్లు మిన‌హా రాజ‌కీయ తెర‌పై క‌నిపించ లేదు. అయితే పార్టీ మార‌బోతున్నార‌నే వార్త‌ల ద్వారా మాత్రం క‌నిపించ‌క‌పోయినా అప్పుడ‌ప్పుడూ వినిపిస్తు ఉన్నారు. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌వాహంలో విజ‌య‌తీరాల‌నే ఎక్కువ‌గా చేరుకున్న గంటా తాజాగా టీడీపీకి రాజీనామా చేయ‌డం ద్వారా కూడా త‌న భ‌విత‌కు మ‌రో కొత్త బాట వేసుకున్నార‌నే వాద‌న‌లు వినిపించాయి. అయితే విచిత్రంగా ఆయ‌న‌ను ప‌ట్టించుకునే వారే త‌గ్గిపోతూ వ‌స్తున్నారు. సొంత పార్టీ టీడీపీ కూడా గంటా ఊసు ఎత్త‌డం లేదు. దీంతో ఆయ‌న ఒంటరయ్యారా? అనే ప్ర‌శ్న త‌లెత్తుతోంది.

ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా గంటా శ్రీ‌నివాస‌రావుకు మంచి అనుభ‌వ‌మే ఉంది. కానీ ప్ర‌స్తుతం ఆయ‌న ఫ్యూచ‌రేంట‌నేది చ‌ర్చ‌గా మారింది. ఈ దిశగా గంటా చేస్తున్నప్రయత్నాలు కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఆయన టీడీపీలో ఉన్నా.. పట్టించుకునే వారు కరువయ్యారు. అంతేకాదు.. ఈయన పార్టీలో ఉంటారో.. లేదో.. అనే చర్చలతో కొన్నాళ్లుగా టీడీపీ ఆయనను లెక్క చేయడం కూడా మానేసింది. అనేక మందికి.. పదవులు ఇచ్చినా.. ఈయనకు మాత్రం ఎలాంటి పదవినీ అప్పగించలేదు. వైసీపీలోకి వెళ్తారనే చర్చ జరిగినా.. ఆయనకు అక్కడ కూడా రిజర్వ్ కాలేదు.

విశాఖ ఉక్కు కర్మాగారం కోసం.. తన పదవికి రాజీనామా చేసినా ఆశించిన ప్ర‌యోజ‌నం కానీ, పేరు కానీ ఆయ‌న పొందలేక పోయారు. ఎందుకంటే.. దీనిని స్పీకర్తో ఆమోదించుకునే విషయంపై గంటా ఎలాంటి ప్రయత్నం చేయలేదు. పైగా ఫార్మాట్లో రాజీనా మా ఇవ్వలేదని స్పీకర్ స్వయంగా ప్రకటించారు. దీంతో గంటా చేసిన రాజీనామాపై విశాఖ ఉక్కు ఉద్యోగుల వద్ద కూడా చర్చ సాగడం లేదు. ఇదంతా రాజకీయ వ్యూహంగానే కొట్టిపారేశారు.

ఇవన్నీ గమనిస్తే.. అటు టీడీపీ.. ఇటు వైసీపీ కూడా గంటాను పక్కన పెట్టాయి. పోనీ.. పవన్ పార్టీలోకి వెళ్లినా.. అసలు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితిపై అనేక సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గంటా అనుచరులు కూడా ఒక్కొక్కరుగా ఆయనకు దూరమై.. ఇతర పార్టీల్లోకి చేరిపోయారు. ఈ పరిణామాలతో గంటా ఫ్యూచర్ కీలక సమయంలో ఒడిదుడుకుల ప్రమాదంగా మారిందనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం. తాజా ప‌రిణామాల‌తో అయినా గంటా శ్రీ‌నివాస‌రావు త‌న ఫ్యూచ‌ర్ కోసం త‌గిన ప్ర‌య‌త్నాలు చేస్తారో లేదో చూడాలి.

Show comments