రైతుల పిల్లలకు వెయ్యి కోట్ల స్కాలర్ షిప్ ప్రకటించిన బసవరాజ్‌ బొమ్మై

జీవితంలో ఆశించినది దక్కితే ఆ సంతోషమే వేరు. అదీ కూడా ఉన్నతమైనదైతే ఆ ఆనందం మాటల్లో వర్ణించలేం. ఇలాంటి ఆనందభరిత సమయంలోనే ఉన్నారు కర్ణాటక నూతన సీఎం బసవరాజ్‌ బొమ్మై. ఆశించిన ముఖ్యమంత్రి పదవి దక్కడంతో బొమ్మై ఆనందానికి అవధులు లేవు. ఆ ఆనందాన్ని పదవి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే చాటుకున్నారు. ప్రజలకు వరాలు ప్రకటించారు. రైతుల పిల్లలకు 1000 కోట్ల రూపాయలతో స్కాలర్‌షిప్‌ పథకాన్ని తెస్తామని ప్రకటించారు. సంధ్యా సురక్ష పథకం పేరున ప్రస్తుతం వృద్ధులకు ఇస్తున్న పింఛన్‌ను సొమ్మును 1000 రూపాయల నుంచి 1200 రూపాయలకు పెంచుతున్నామని ప్రకటించారు.

జనతాదళ్‌ నేత ఎస్‌ఆర్‌ బొమ్మై 1988 నుంచి 1989 వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. 61 ఏళ్ల బసవరాజ్‌ బొమ్మై రాజకీయ జీవితం జనతాదళ్‌ నుంచే ప్రారంభమైంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 1998, 2004లో రెండు పర్యాయాలు గెలిచారు. 2008లో జనతాదళ్‌ను వీడి బీజేపీలో చేశారు. ఆ ఎన్నికల్లో సిఘాన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2013, 2018 ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి గెలిచి హాట్రిక్‌ సాధించారు. ఇరిగేషన్‌ శాఖ మంత్రిగా, హోం మంత్రిగా పని చేశారు.

మాజీ సీఎం యడ్యూరప్ప, బసవరాజ్‌ బొమ్మైలు ఇద్దరూ కర్ణాటకలో బలమైన లింగాయత్‌ సామాజికవర్గానికి చెందిన వారే. యడ్యూరప్పకు అత్యంత సన్నిహితుడుగా బసవరాజ్‌ మెలిగారు. ముఖ్యమంత్రి పదవి ఉత్తర కర్ణాటక నేతకు ఇవ్వాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. అన్ని సమీకరణాలు బేరీజు వేసుకున్న బీజేపీ.. ఈ సారి ఆ డిమాండ్‌ను నెరవేర్చింది. ఉత్తర కర్ణాటకకు చెందిన బసవరాజ్‌ బొమ్మైను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొపెట్టింది. ఆ ప్రాంతంలోని లింగాయత్‌ సమాజికవర్గంలో బసవరాజ్‌ బలమైన నేతగా ఎదిగారు. దీంతోపాటు యడ్యూరప్ప అండదండులు కూడా ఉండడంతో సీఎం పీఠం దక్కింది. ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన బసవరాజ్‌ పరిపాలన రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తుందా..? లేదా..? వేచి చూడాలి.

Also Read : సీఎం పీఠంపై తండ్రులు.. తనయులు

Show comments