నాలుగో టెస్ట్: భారత్ గెలవాలంటే ఏం జరగాలి…? టీం ఇండియాకు ఉన్న అద్భుత అవకాశాలు ఏంటీ…?

భారత్ లో మనవాళ్ళ ఆటతీరు, విదేశాల్లో మనవాళ్ళ ఆటతీరుతో పోలిస్తే చాలా తేడాగా ఉంటుంది అనే విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. స్పిన్ పిచ్ ల మీద చెలరేగిపోయే మన బ్యాట్స్మెన్ గాని బౌలర్ గాని, ఫాస్ట్ పిచ్ మీదకు వెళ్తే బంతి స్వింగ్ అవుతుంటే క్రీజ్ లో నిలబడాలంటే భయపడిపోతారు. స్టార్క్, అండర్సన్, బ్రాడ్, రబాడా, కమ్మిన్స్, హెజిల్ వుడ్ లాంటి బౌలర్లను ఎదుర్కోవడానికి చెమటలు కక్కేస్తారు. వైట్ బాల్ క్రికెట్ అంటే ఓకే గాని టెస్ట్ క్రికెట్ లో అలా చెమటలు కక్కేయడం అనేది జట్టు హోదా మీద ప్రభావం చూపించేస్తుంది.

భారత్ అనేది అత్యుత్త్తమ జట్టు… ఏ దేశమైనా మనతో సీరీస్ ఆడాలని కోరుకుంటుంది… అలాంటి జట్టు ఇప్పుడు చతికిలపడటం ఫాన్స్ కి నిద్ర లేకుండా చేసేస్తుంది. మూడో టెస్ట్ లో అలాగే చతికిల పడి మ్యాచ్ అప్పగించేశారు… నాలుగో టెస్ట్ లో కూడా అదే జరుగుతోంది. మొదటి రోజు ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు మన భారత టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ పేక మేడలా కూలిపోయింది. భారీ ఇన్నింగ్స్ లు కాకపోయినా ఒక మోస్తరు ఇన్నింగ్స్ అయినా టాప్ ఆర్డర్ లో సీనియర్ల నుంచి వస్తుందని ఆశించినా… ఇంగ్లాండ్ పేస్ దెబ్బకు విలవిలలాడింది.

సరే.. ఇప్పుడు ఈ మ్యాచ్ లో గెలవాలి అంటే.. పోనీ డ్రా చేసుకోవాలి అంటే టీం ఇండియా ముందు ఉన్న మార్గం ఏంటీ..? బౌలర్లు ఇంగ్లాండ్ ని ఎంత వరకు కట్టడి చేస్తారు..? ఇదే ప్రతీ అభిమానిలో ఉన్న ఆలోచన. అసలు ఏం జరిగితే టీం ఇండియా బయట పడే అవకాశాలు ఉన్నాయో ఒక్కసారి మనం చూద్దాం..

191 పరుగులకు ఇండియా ఆల్ అవుట్ అయింది. యువ ఆటగాడు శార్డుల్ ఠాకూర్ దూకుడుతో మంచి స్కోర్ సాధించింది. పట్టుదలగా అర్ధ సెంచరీ సాధించి ఉంటె ఉంటా పోతే పోతా అన్నట్టు ఆడేసాడు. మరో ఎండ్ లో ఉన్న ఉమేష్ అలా సైలెంట్ గా చూస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు శార్దుల్ సాధించిన అర్ధ సెంచరీకి టీం మొత్తం న్యాయం చేయాలి… ప్రస్తుతం ఇంగ్లాండ్ మూడు వికెట్ ల నష్టానికి 53 పరుగులు చేసింది. ప్రస్తుత స్కోర్ ప్రకారం 138 పరుగులు వెనుకబడి ఉంది రూట్ సేన.

ఇండియా రెండో రోజు లంచ్ సెషన్ లోపు మరో మూడు వికెట్ లు తీయాల్సి ఉంది. పిచ్ పేస్ కి సహకరిస్తుంది కాబట్టి జడేజాను పక్కన పెట్టేసి మన పేస్ విభాగాన్ని వాడుకోవాలి. బూమ్రా కు మంచి బౌన్స్ వస్తుంది.. ఉమేష్ చక్కటి స్వింగ్ చేస్తున్నాడు. అవుట్ స్వింగ్ లతో, ఇన్ స్వింగ్ తో ఇబ్బంది పెట్టే సామర్ధ్యం శార్దుల్, సిరాజ్ లకు ఉంది. కాబట్టి వీరినే టీ సెషన్ వరకు వాడుకోవాలి. రూట్ క్రీజ్ లో లేడు కాబట్టి కంగారు పడే పని లేకపోయినా ఒవర్తన్, మలాన్ ఇద్దరూ హిట్టింగ్ సామర్ధ్యం ఉన్న ఆటగాళ్లే. లంచ్ సెషన్ లోపు ఈ ఇద్దరినీ అవుట్ చేసేస్తే మ్యాచ్ లో ఇండియాకు పట్టు చిక్కినట్టే.

ఓలి పోప్ కి రాక రాక అవకాశం వచ్చేసింది కాబట్టి ఈ మ్యాచ్ లో అతను ప్రభావం చూపించవచ్చు. అతను మంచి స్టాండ్ ఇచ్చే ఆటగాడు.. మలన్ తో పాటుగా పోప్ కుదురుకుంటే మనం భారీ లీడ్ ఇంగ్లాండ్ చేతిలో పెట్టినట్టే. ఆ తర్వాత బెయిర్ స్తో కూడా ఇంగ్లాండ్ కు కీలకం కావొచ్చు. ఓపెనర్ ని మిడిల్ ఆర్డర్ కు మార్చి మిడిల్ ఆర్డర్ హమీద్ ని ఓపెనర్ గా పంపించాడు రూట్. కాబట్టి బెయిర్ స్తో ఆట ఎలా ఉంటుందో అంచనా వేయలేం. ఐపిఎల్ లో అతను మన బౌలర్లను ఆడేసాడు కాబట్టి.. జాగ్రత్తగా ఉండక తప్పదు.

ఇంగ్లాండ్ దాదాపుగా అందరిని ఆల్ రౌండర్స్ నే తీసుకుంది. క్రిస్ వోక్స్, మొయిన్ అలీ ఇద్దరూ కూడా హిట్టింగ్ సామర్ధ్యం ఉన్న ఆల్ రౌండర్ లు. వారి మీద ఓ కన్నేసి ఉంచి ఇంకో 20 ఓవర్లు ఉండగానే ఆల్ అవుట్ చేయాల్సి ఉంటుంది. కనీసం ఇండియా ఈ రోజు 20 ఓవర్లు బ్యాటింగ్ చేసి కనీసం ఒక 60 పరుగులు చేయాలి. ఒకవేళ ఇంగ్లాండ్ కు లీడ్ వచ్చినా భారీగా వచ్చే అవకాశాలు అయితే లేవు. ఆ పరుగులు మనకు కలిసి వచ్చే అవకాశం ఉంది. మొదటి సెషన్ మొత్తం కూడా ఉమేష్, బూమ్రా, సిరాజ్ తో వేయించి ఠాకూర్ తో లంచ్ తర్వాత బౌలింగ్ చేయిస్తే మంచి ఫలితం ఉండొచ్చు. స్లో బాల్స్ తో చక్కటి స్వింగ్ తీసుకొచ్చే సామర్ధ్యం అతనికి ఉంది. అయితే రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ గా పుజారాను పంపిస్తే వికెట్ కాపాడుకునే అవకాశం ఉంటుంది.

– Venkat.G

Show comments