Idream media
Idream media
రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల సమతుల అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం తెచ్చిన మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకించడం వల్ల నష్టపోతున్నామని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అర్థమైందా..? అంటే ఆ పార్టీ తీరుతో అవుననే సమాధానం వస్తోంది. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలంటూ ఉద్యమం చేస్తూ.. కర్నూలులో న్యాయరాజధానిని, విశాఖలో కార్యనిర్వాహఖ రాజధానిని వ్యతిరేకించడం వల్ల ఆయా ప్రాంత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకున్న తెలుగుదేశం పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. అందుకే తాజాగా ఉత్తరాంధ్ర రక్షణ అంటూ కొత్త నినాదం ఎత్తుకుంది.
వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తోందని చెబుతున్న టీడీపీ నేతలు.. ఉత్తరాంధ్ర రక్షణ పేరుతో ఇటీవల మీడియా సమావేశాలు నిర్వహించారు. తాజాగా ఈ రోజు ఉత్తరాంధ్ర రక్షణ – చర్చా వేదిక పేరుతో విశాఖలోని టీడీపీ కార్యాలయంలో సదస్సును నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెం నాయుడు అధ్యక్షతన జరుగుతుండగా.. ఆ పార్టీ తాజా, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొనబోతున్నారు. వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రను ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తుందో ఈ సదస్సులో అంశాల వారీగా చర్చించి.. ఆ తర్వాత క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలకు వివరించాలని తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
టీడీపీ విమర్శలో తర్కం ఏదీ..?
ఉత్తరాంధ్రను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందనేది టీడీపీ విమర్శ. ఈ విషయం చెబుతూనే ఉత్తరాంధ్ర పరిరక్షణ పేరుతో వారు ప్రజల్లోకి వెళ్లబోతున్నారు. అయితే మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా కార్యనిర్వాహఖ రాజధానిగా విశాఖను ప్రకటించిన విషయంపై టీడీపీ నేతలు ప్రజలకు ఏమని చెబుతారు..? కార్యనిర్వాహఖ రాజధానిగా ఉత్తరాంధ్ర కేంద్రమైన విశాఖను ప్రకటించితే.. ఇక వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్రను ఎక్కడ నిర్లక్ష్యం చేసిందనే ప్రశ్నకు టీడీపీ నేతలు ఏమని సమాధానం చెబుతారు..?
కార్యనిర్వాహఖ రాజధాని వద్దంటూ అమరావతియే ఏకైక రాజధానిగా ఉండాలని రెండున్నరేళ్లుగా ఉద్యమాలు చేసిన టీడీపీ నేతల్లో.. ఆ పార్టీ ఉత్తరాంధ్ర ప్రాంత నేతలైన అచ్చెం నాయుడు సహా అందరు నేతలు ఉన్నారు. ఆ నేతలే ఇప్పుడు ఉత్తరాంధ్ర పరిరక్షణ అని వెళితే ప్రజలు స్వాగతిస్తారా..? విశాఖ కార్యనిర్వాహఖ రాజధాని అయితే.. విశాఖకు పై భాగాన ఉండే విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. విశాఖకు దిగువన ఉన్న తూర్పుగోదావరిలో అంతా వ్యవసాయ ఆధారిత భూమి. అందువల్ల విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనే పరిశ్రమల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. పరిశ్రమలు ఏర్పాటు వల్ల.. ఇన్నాళ్లు ఉపాధి కోసం హైదరాబాద్ సహా ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లిన ఉత్తరాంద్ర వాసులకు స్థానికంగానే ఉపాధి లభిస్తుంది. ఈ విషయం సామాన్యుడికైనా అర్థం అవుతుంది.
తర్వాత సీమ పరిరక్షణా..?
మూడు రాజధానులను వ్యతిరేకించడం వల్ల ఎలాంటి నష్టం జరిగిందో ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి బాగా అర్థమైంది. జనరల్ ఎన్నికలకన్నా.. స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ ఎక్కువగా నష్టపోయింది. అర్బన్ ప్రాంతాల్లో తాము బలంగా ఉన్నామనుకునే టీడీపీకి.. మున్సిపల్ ఫలితాలతో మైండ్ బ్లాక్ అయింది. పార్టీ మళ్లీ మనుగడ సాగించాలంటే దూరమైన అన్ని ప్రాంతాల ప్రజలను మళ్లీ దగ్గర చేసుకోవాలి. అందుకే ఉత్తరాంధ్ర పరిరక్షణ అంటూ టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు ఫ్లాట్‌ఫాం సిద్ధం చేసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర రక్షణ తరహాలోనే మరికొన్నాళ్ల తర్వాత రాయలసీమ పరిరక్షణ అంటూ టీడీపీ నేతలు కొత్త నినాదం ఎత్తుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.
Also Read : సీనియర్ కు సామాన్యుడి సవాల్!