ఏపీ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏమి జరుగుతోంది..?

అవినీతి అధికంగా ఉండే ప్రభుత్వ విభాగాల్లో సబ్‌రిజిస్ట్రార్‌ శాఖ ఒకటి. రెవెన్యూ, పోలీసు, మున్సిపల్‌ టౌన్‌ప్లానింగ్‌ విభాగాల్లో అవినీతికి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరిగే అవినీతికి ప్రధానమైన వ్యత్యాసం ఒకటే. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉండే కార్యాలయాల్లో పనిని బట్టీ లంచం మొత్తం ఉంటుంది. కానీ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో మాత్రం నిర్ణీత మొత్తంలో లంచాలు సమర్పించుకోవాలి. ఆస్తుల క్రయ విక్రయాలకు సంబంధించి కొనుగోలుదారులు ప్రభుత్వానికి సదరు ఆస్తి ప్రభుత్వ విలువలో 7.5 శాతం ఫీజు చెల్లించాలి. దీనికి అదనంగా 1 శాతం మామూళ్లను కొనుగోలుదారులు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి కప్పం కట్టాలి.

ఈ మొత్తం తంతును అనధికారికంగా ఉండే డాక్యుమెంట్‌ రైటర్లు నిర్వహిస్తారు. సాయంత్రం కల్లా తమ పరిధిలో ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి, వాటి తాలుకూ మొత్తం మొత్తం విలువ ఎంత..? ఒక శాతం లంచం రూపంలో ఎంత వచ్చింది..? అనే లెక్కలను సబ్‌రిజిస్ట్రార్‌కు సదరు అనధికారిక డాక్యుమెంట్‌ రైటర్లు అప్పగించాలి. ఒక శాతం కాకుండా మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేయించినందుకు డాక్యుమెంట్‌ రైటర్లకు సేవా రుసుము చెల్లించాలి. అక్కడ, ఇక్కడ అని తేడా లేకుండా ప్రతి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జరిగే తంతు ఇది. ఇందులో ఏ ఒక్క సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి మినహాయింపులు లేవు.

ఇప్పటి వరకు ప్రజల నుంచి అనధికారిక డాక్యుమెంట్‌ రైటర్ల ద్వారా లంఛాల రూపంలో కోట్లు కొల్లకొట్టిన సబ్‌రిజిస్ట్రార్లు తాజాగా ప్రభుత్వ సొమ్మును బొక్కేసిన వైనం ఏపీలో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఫీజును తక్కువ మొత్తంలో ఛలానాలు తీసి, ఎక్కువ మొత్తం చెల్లించినట్లు పత్రాలు సృష్టించారని నిర్ధారణ అయింది. కడప జిల్లాలో వెలుగులోకి వచ్చిన ఈ తంతు తీగ లాగితే డొంక కదలినట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 17 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా తేల్చారు. నకిలీ ఛలాన్ల కుంభకోణంలో ఇప్పటి వరకు 5.5 కోట్ల రూపాయలు సబ్‌రిజిస్ట్రార్లు, సిబ్బంది, అనధికారిక డాక్యుమెంట్‌ రైటర్లు కొట్టేసినట్లు గుర్తించారు. కోటి రూపాయలు రికవరీ చేశారు. ఆరుగురు సబ్‌రిజిస్ట్రార్లను సస్పెండ్‌ చేశారు. క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు.

ఈ కుంభకోణం ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి వెళ్లింది. ఈ రోజు స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. జరిగిన కుంభకోణం గురించి తెలుసుకున్నారు. తప్పు ఎక్కడ జరిగిందో గుర్తించాలని ఆదేశించారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కాజేసిన సొమ్మును రికవరీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారంలో లోతైన దర్యాప్తు చేయాలని ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పలు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో జరిగిన రిజిస్ట్రేషన్లను తనిఖీ చేస్తున్నారు. దాదాపు 2 కోట్ల ఛలానాలను పరిశీలిస్తున్నారు. ఈ మొత్తం కుంభకోణం విలువ 10 కోట్ల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సమగ్ర దర్యాప్తు జరిగితే ఈ మొత్తం విలువ ఎక్కువగానే ఉండే అవకాశాలున్నాయి.

Also Read : కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు ఏ పార్టీలో ఉన్నారు..?

Show comments