ఈ రోజే డెడ్‌లైన్‌.. బుచ్చయ్య చౌదరి ఏం చేయబోతున్నారు..?

తన డిమాండ్లు, స్థానికంగా పార్టీలో ఉన్న సమస్యల పరిష్కారంపై టీడీపీ సీనియర్‌ నేత, రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ అధిష్టానానికి ఇచ్చిన గడువు ఈ రోజుతో ముగుస్తోంది. తన అనుచరులకు పార్టీ పదవులు దక్కకపోవడం, సిటీ నియోజకర్గంలో తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీ అధినేత నారా చంద్రబాబుపై అలకబూనిన విషయం తెలిసిందే. ఈ విషయాలపై మాట్లాడేందుకు చంద్రబాబుకు, లోకేష్‌కు ఫోన్‌ చేస్తే వారు కాల్‌ తీయకపోవడంతో బుచ్చయ్య చౌదరికి చిర్రెత్తుకొచ్చి.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాననే లీకులు ఇచ్చారు. ఈ వార్తలు ఈ నెల 19వ తేదీన గుప్పుమన్నాయి. ఈ విషయంపై క్లారిటీ కోసం మీడియా బుచ్చయ్యను స్పందించగా.. అన్ని విషయాలు 25వ తేదీన మాట్లాతానని ఆయన చెప్పారు.

టీడీపీ అధిష్టానానికి బుచ్చయ్య చౌదరి ఇచ్చిన వారం రోజుల గడువు ఈ రోజుతో ముగుస్తోంది. బుచ్చయ్య అలకబూనారనే విషయం తెలియగానే మాజీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, కేఎస్‌ జవహర్, రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త గద్దె రామ్మోహన్‌లు బుచ్చయ్యతో సమావేశమయ్యారు. రెండు రోజుల పాటు ఆయనతో చర్చించిన నేతలు.. బుచ్చయ్య చౌదరి ప్రస్తావించిన సమస్యలను, డిమాండ్లను తమ పార్టీ అధినేత చంద్రబాబు పరిష్కరిస్తారని చెప్పారు. ఆయన పార్టీకి రాజీనామా చేయబోరని వీరే ప్రకటన చేశారు. అయితే బుచ్చయ్య చౌదరి మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు స్పందించలేదు.

రాజమహేంద్రవరం సిటీ కేంద్రంగా రాజకీయ పయనం మొదలుపెట్టిన బుచ్చయ్య చౌదరి 2014లో బీజేపీతో పొత్తు కారణంగా రాజమహేంద్రవరం రూరల్‌కు వెళ్లాల్సి వచ్చింది. 2019లోనూ అక్కడ నుంచే పోటీ చేశారు. అయితే ఆయన వర్గం, క్యాడర్‌ అంతా సిటీలోనే ఉంది. 2019లో సిటీ నుంచి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి కోడలు భవాని గెలిచారు. అంతకు ముందు రెండేళ్ల నుంచే సిటీలో గోరంట్లకు ప్రాధాన్యత తగ్గుతూ రాగా.. భవాని ఎమ్మెల్యే అయిన తర్వాత గోరంట్ల వర్గాన్ని పూర్తిగా పక్కనపెట్టారు. పార్టీ పదవుల్లో గోరంట్ల అనుచరులకు పదవులు దక్కలేదు. ప్రధానంగా ఈ విషయంపై గుర్రుగా ఉన్న బుచ్చయ్య చౌదరి అసంతృప్తిరాగం వినిపించారు.

వారం రోజులుగా బుచ్చయ్య అలక వీడలేదు. బుచ్చయ్య వద్దకు వచ్చి ఆయన డిమాండ్లను తెలుసుకుని వెళ్లిన నేతలు.. వాటిని చంద్రబాబు నెరవేర్చుతారని ప్రకటించినా.. ఇప్పటి వరకూ ఆ దిశగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. మరి ఈ నేపథ్యంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరికొంత కాలం వేచి చూసేందుకు సర్దుకుంటారా..? లేక జరిగిన ప్రచారాన్ని నిజం చేసేలా సంచలన నిర్ణయాలు తీసుకుంటారా..? చూడాలి.

Also Read : మరోసారి అలిగిన బుచ్చయ్య.. ఈసారి నిజంగానే రాజీనామా చేస్తారా..?

Show comments