Idream media
Idream media
సీఎం కేసీఆర్ హుజూరాబాద్ పై ఎంతగా దృష్టి పెట్టారో మరో నిర్ణయం తెలియజేస్తోంది. ఎస్సీ కమిషన్ చైర్మన్, ఎమ్మెల్సీ వంటి పదవులతో పాటు దళిత బంధు పథకంలో హుజూరాబాద్ కే ప్రాధాన్యం ఇచ్చారు. ”సంక్షేమ పథకాలు, పదవులు పంచి ప్రజల్ని ఆకట్టుకోవడం రాజకీయ పార్టీగా మేం చేయాల్సిందే, టీఆర్ఎస్ ఏమీ సన్నాసుల మఠం కాదుగా..” అంటూ ఎన్నికల వేళ తాయిలాల ప్రకటనను సమర్థించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అదే పని చేశారు. బీసీ (వెనుకబడిన తరగతుల) కమిషన్ చైర్మన్ గా కరీనంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన టీఆర్ఎస్ సీనియర్ నేత వకుళాంబరం కృష్ణమోహన్ ను నియమించారు. కృష్ణ మోహన్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఈయన అంతకు ముందు ఇదే కమిషన్ లో సభ్యులుగా ఉండేవారు.
2016లో తొలి సారి ఏర్పాటైన బీసీ కమిషన్ కు సామాజిక వేత్త బీఎస్ రాములు చైర్మన్ గా వ్యవహరించేవారు. వకుళాభరణం కృష్ణమోహన్, డాక్టర్ ఆంజనేయులు గౌడ్, జూలూరి గౌరీశంకర్ సభ్యులుగా పనిచేశారు. మూడేళ్ల పదవీ కాలం తర్వాత కొత్త బాడీని ప్రకటించకపోవడంతో బీసీ కమిషన్ దాదాపు రెండేళ్లపాటు చేతనావస్తలో ఉండిపోయింది. మళ్లీ హుజూరాబాద్ ఉప ఎన్నిక పుణ్యాన ఆ ఊరికి చెందిన టీఆర్ఎస్ నేత వకుళాంబరం కృష్ణమోహన్ చైర్మన్ గా బీసీ కమిషన్ మళ్లీ ప్రాణం పోసుకుంది. తెలంగాణ బీసీ కమీషన్ చైర్మన్, సభ్యులకు పదవిలో ఉండే మూడేళ్లూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్, సభ్యుల హోదాలతో సమానంగా సదుపాయాలు కల్పిస్తారు. వెనుకబడిన తరగతుల జాబితాలో తమ కులాన్ని చేర్చాలని వచ్చే అభ్యర్థనలను, బిసి జాబితా నుండి ఏ కులాన్నైనా తొలగించాలని వచ్చే ఫిర్యాదులను ఈ కమీషన్ పరిశీలించి విచారణకు స్వీకరిస్తుంది. పార్లమెంటులో ఇటీవలే ఓబీసీ బిల్లుకు ఆమోదం లభించడం, ఓబీసీ రిజర్వేషన్లపై రాష్ట్రాల నిర్ణయాలే ఇక చెల్లుబాటు కానున్న దరిమిలా తెలంగాణ బీసీ కమిషన్ మళ్లీ యాక్టివ్ కావడం కీలకంగా మారింది. బీసీ కమిషన్ సభ్యులుగా శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్, సీహెచ్ ఉపేంద్రను ప్రభుత్వం నియమించింది. ఈ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వస్తాయని పేర్కొంది.
తెలంగాణ ఏర్పడ్డ ఏడేళ్ల తర్వాత ఓ ఉప ఎన్నికను గులాబీ బాస్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. దీన్ని ఓ నియోజకవర్గం ఉప ఎన్నికగా కంటే.. సుదీర్ఘకాలం పాటు తన వెంబడి ఉండి పోతూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన ఈటల రాజేందర్ పై విజయం సాధించడం వ్యక్తిగత ఇమేజ్ గా కేసీఆర్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. దీనిలో భాగంగా ఈటల రాజేందర్ కు మద్దతుగా మాట్లాడిన బీఎస్ రాములును పక్కన బెట్టి, వకులాభరణాన్ని చైర్మన్ ను చేశారు. ఈటల రాజేందర్ ను ఓడించేందుకు గులాబీ దళపతి సర్వశక్తులు ఒడ్డుతున్నారు. అందులో భాగంగా ప్రతిష్గాత్మక దళిత బంధు పథకాన్ని హుజూరాబాద్ లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టి ఇప్పటికే రూ.1000 కోట్ల నిధులు ఇచ్చారు. హుజూరాబాద్ కే చెందిన బండ శ్రీనివాస్ కు ఎస్సీ కమిషన్ చైర్మన్ గా, కాంగ్రెస్ ఫిరాయింపు నేత కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీగా కేసీఆర్ అవకాశం కల్పించారు. ఉద్యమకారుల్ని కేసీఆర్ మర్చిపోయారనే విమర్శకు విరుగుడుగా ఓయూ మాజీ విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు హుజూరాబాద్ టికెట్ కేటాయించారు.
హుజూరాబాద్ లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ అన్ని వ్యూహాలను పన్నుతున్నారు. పదవుల దగ్గర నుంచి పథకాల దాకా అన్నింటికీ ఆ ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కేసీఆర్ ఇంతలా ఓ ఉప ఎన్నిక గురించి ఆలోచించడం, అన్ని అంశాలూ దాని చుట్టూనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది.