Idream media
Idream media
తిరుమలలో ప్రయోగాత్మకంగా చేపట్టిన సంప్రదాయ భోజన అమ్మకాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిలిపివేసింది. శ్రీవారి ప్రసాదాలను ఉచితంగా ఇవ్వాలని, అమ్మకూడదని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటించారు. సంప్రదాయ భోజనంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం తగదన్నారు సుబ్బారెడ్డి. సంప్రదాయ భోజనం టీటీడీ అమ్మడం లేదన్నారు. ట్రయల్ రన్ విజయవంతం కాకపోవడంతో నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ రోజు ఉదయం స్వామి వారి సేవలో పాల్గొన ఆయన అనంతరం ఈ ప్రకటన చేశారు. టీటీడీ పాలక మండలి లేని సమయంలో టీటీడీ అధికారులు ఒక మంచి ఉద్దేశంతో సంప్రదాయ భోజనం ప్రవేశ పెట్టారని, అయితే అధికారులతో చర్చించి సంప్రదాయ భోజనాన్ని నేటి నుండి నిలిపి వేస్తున్నామని తెలిపారు.
26న ప్రయోగాత్మకంగా ప్రారంభం..
గోవు ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన ఉత్పత్తులతో సిద్ధం చేసిన అన్నప్రసాదాలను సంప్రదాయ భోజనంగా పిలుస్తున్నారు. రెండు రకాల దేశీయ వరి బియ్యంతో అన్నం, పూర్ణం బూరెలు, బెల్లం పొంగలి, దోసకాయ పచ్చడి, బీరకాయ ప్రై, కొబ్బరన్నం, పులిహోర, బీన్స్ ఫ్రై, వడలు, పప్పు, సాంబారు, రసం వంటివి ఈ భోజనంలో ఉన్నాయి. ఆగస్టు 26వ తేదీన మొదటి సారిగా టీటీడీ సిబ్బంది,అధికారులు ఈ భోజనం స్వీకరించి లాంఛనంగా ప్రారంభించారు. తొలిరోజు కుల్లకారు బియ్యంతో ఇడ్లీలు, కాలా బాత్ బియ్యంతో ఉప్మా తయారు చేసి అందించారు. అప్పట్నుంచి రోజుకు రెండు వందల మందికి ఈ సంప్రదాయ భోజనాన్ని ప్రయోగాత్మకంగా అందించాలని నిర్ణయించారు.
అమ్మాలని నిర్ణయించడంతో వివాదం..!
సంప్రదాయ భోజనాన్ని టీటీడీ తయారీ ధరకే అమ్మాలని నిర్ణయించింది. భక్తుల అభిప్రాయాలు తీసుకునేందుకు సెప్టెంబరు 8వరకు రోజుకు 200 మందికి మాత్రమే అందించాలని నిర్ణయించారు. సెప్టెంబరు 8 నుంచి భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించుకున్నారు. అయితే టీటీడీ నిర్ణయంపై విమర్శలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ భోజనంకు ప్రశంసలు లభించినప్పటికీ.. కాస్ట్ టు కాస్ట్ పేరుతో అమ్మాలనుకోవడంతోనే అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. భక్తులకు ” సంప్రదాయ భోజనం” పేరుతో అమ్మి నిత్యాన్నదానం నిలిపివేస్తారన్న విమర్శలు ప్రారంభమయ్యాయి.
అయితే ఇది దుష్ప్రచారమని సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ ప్రకటించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వస్తున్న భక్తులకు టీటీడీ అందిస్తున్న నిత్యాన్నదానం నిరంతరాయంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. బయట ఆహారాన్ని తీసుకోవాలనే శ్రీవారి భక్తులకు లాభాపేక్ష లేకుండా రుచికరమైన గో ఆధారిత సంప్రదాయ భోజనాన్ని అందించాలనే సదుద్దేశంతో సంప్రదాయ భోజనం ప్రారంభించామని తెలిపింది. ఐతే వివాదానికి తావు ఇవ్వకుండా సంప్రదాయ భోజనం కార్యక్రమాన్ని నిలిపివేస్తూ చైర్మన్ వైవి సుబ్బా రెడ్డి ఆదేశాలు జారీ చేయడం భక్తుల అభిప్రాయాలకు పెద్ద పీట వేసినట్లైంది.
Also Read : వారి భద్రతలో జగన్ సర్కారును మెచ్చుకోవాల్సిందే