Idream media
Idream media
సెప్టెంబర్ ఒకటి నుంచి పాఠశాలను పునఃప్రారంభించాలన్న తెలంగాణ ప్రభుత్వ ఉత్వర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. వారం రోజుల పాటు ఈ స్టే కొనసాగుతుందని తెలిపింది. కరోనా సెకండ్ వేవ్ తగ్గిన నేపథ్యంలో.. పాఠశాలలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయించగా.. అక్టోబర్‌లో థర్ట్ వేవ్ ప్రమాదం పొంచిఉందన్న హెచ్చరికలు ఉన్నాయంటూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పరిణామంతో కరోనా వైరస్ మానవ జీవితాలను ఏ స్థాయిలో ప్రభావితం చేస్తుందో స్పష్టంగా తెలుస్తోంది.
కరోనా వైరస్ కారణంగా వరుసగా రెండో ఏడాది పాఠశాలలు తెరుచుకోలేదు. విద్యార్థులు ఇళ్లకే పరిమితయమ్యారు. పలు ప్రైవేటు పాఠశాలలు అద్దెలు కట్టలేక ఖాళీ చేశాయి. పిల్లల చదువు దెబ్బతింటోందని తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పాఠశాలల్లో పని చేసే టీచర్లు, ఇతర సిబ్బంది ఉపాధి కోల్పోయారు. విద్యరంగానికి అనుబందంగా ఉండే రంగాలు దెబ్బతిన్నాయి… సమాజంలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు.
కరోనా వైరస్ వల్ల అన్ని రంగాలు దెబ్బతిన్నా.. వైరస్ వ్యాప్తి తగ్గిన తర్వాత అవన్నీ మళ్లీ గాడిలో పడ్డాయి. ఆర్థిక కార్యకలాపాలు సాఫీగా సాగుతున్నాయి. కొత్త కేసులు నమోదవుతున్నా.. ఆ సంఖ్య వందల్లోనే ఉంటోంది. వ్యాక్సిన్ రావడం, దేశ వ్యాప్తంగా ఇప్పటికి దాదాపు 64 కోట్ల మందికి సింగిల్ డోసు వేయడంతో వైరస్‌ను ఎదుర్కొనగలమన్న ధీమా అందరిలోనూ వచ్చేసింది. అందుకే ప్రజలు గుమిగూడే షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, పార్కులు తెరుచుకున్నాయి.
అన్ని ఒక ఎత్తు అయితే.. పాఠశాలలు మరో ఎత్తు. వ్యాక్సిన్ 18 ఏళ్లు పైబడిన వారికే కావడంతో అన్ని రంగాలు కోలుకున్నాయి. కార్యకలాపాలు యథావిథిగా సాగుతున్నాయి. పిల్లలకు వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. ప్రయోగ దశలో ఉంది. వ్యాక్సిన్ లేకపోవడం వల్లే పాఠశాలల పునఃప్రారంభంపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు పాఠశాలలు తెరవాలని చెప్పినా.. చాలా మంది తల్లిదండ్రులు పిల్లలను పంపేందుకు ఆసక్తిగా లేరు. అదే సమయంలో పిల్లలను పాఠశాలలకు పంపేందుకు అంతే స్థాయిలో తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు.
ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నా.. వాటికి హాజరవుతున్న విద్యార్థుల కేవలం 10 శాతం మాత్రమే. ఈ సంఖ్య అంతకన్నా తక్కువగా కూడా ఉండొచ్చు. ఆన్‌లైన్ క్లాసులకు హాజరయ్యేందుకు అవసరమైన ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లను సమకూర్చుకునే ఆర్థిక శక్తి పేద, మధ్యతరగతి కుటుంబాలకు లేకపోవడమే సమస్యకు కారణం. ఇద్దరు పిల్లలున్న కుటుంబం ఆన్‌లైన్ క్లాసులు పెట్టాలంటే ఫోన్ల కోసం 20 వేల రూపాయలు, ఇంటర్ నెట్ కోసం నెలకు కనీసం ఆరు వందల రూపాయలు ఖర్చు చేయాలి. ఆన్‌లైన్ క్లాసులైనా ఫీజులు మాత్రం ఎప్పటిలాగే ఉంటుండడంతో ఆర్థిక భారం భరించలేక పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలు విద్యకు దూరమవ్వక తప్పని పరిస్థితి నెలకొంది.
ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్ క్లాసులు అర్థం అవుతున్నా.. ఒకటి నుంచి 5వ తరగతి విద్యార్థులకు సహాయకారి తప్పక ఉండాల్సిన పరిస్థితి. తల్లి లేదా తండ్రి వారి పక్కన కూర్చుని క్లాస్ వింటూ.. వారికి అర్థమయ్యేలా చెప్పాలి. వారి చేత రాయించాలి. చదివించాలి. దీని వల్ల రోజు వారీ పనులకు విఘాతం కలుగుతోంది. అప్పో సప్పో చేసి ఆన్‌లైన్ క్లాసులు పెట్టించినా.. ఉద్యోగం, ఉపాధి పనులు మానుకుని పేద, మధ్యతరగతి వర్గాల్లోని తల్లితండ్రులు పిల్లల పక్కన కూర్చోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులతో తల్లిదండ్రులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. కరోనా పూర్తిగా పోయి మళ్లీ ఎప్పుడు పిల్లల చదువులు సాఫీగా సాగుతాయో..?
Also Read : థర్ట్ వేవ్ : ఏపీ సర్కార్ ముందు చూపు భేష్