జల వివాదంపై చిత్రంగా తెలంగాణ తీరు..!

ఎవరి మాట వినడు సీతయ్య అన్నట్లుగా ఉంది జల వివాదాల్లో తెలంగాణ వ్యవహారం. కృష్ణా నదీ జలాల విషయంలో పొరుగు రాష్టం ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ఆందళనను, సూచనలను, ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోని తెలంగాణ ప్రభుత్వం.. తాను చెప్పిందే మాత్రం వినాలనేలా వ్యవహరిస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంపై మరోమారు ఫిర్యాదు చేస్తూ కే ఆర్‌ఎంబీకి రాసిన లేఖ కేసీఆర్‌ సర్కార్‌ వ్యవహరించే తీరుకు నిదర్శనంగా నిలుస్తోంది.

శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌ అక్రమంగా జలాలు తరలించుకుపోతోందని, ఆ పని చేయకుండా చూడాలంటూ తెలంగాణ సర్కార్‌ కేఆర్‌ఎంబీ బోర్టుకు లేఖ రాసింది. అనుమతిలేని ప్రాజెక్టుల ద్వారా జలాలు తరలించుకుండా ఆపాలంటూ తెలంగాణ జలవనరుల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌ లేఖ రాశారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి జలాలు తరలించకుండా చూడాలని ఆ లేఖలో కోరారు. అదే విధంగా మల్యాల పంపింగ్‌ స్టేషన్‌ నుంచి, బనకచర్ల రెగ్యులేటర్‌నుంచి నీటి తరలింపును కూడా ఆపాలని తెలంగాణ సర్కార్‌ కేఆర్‌ఎంబీ చైర్మన్‌ను కోరింది.

తమకున్న అభ్యంతరాలపై ఫిర్యాదు చేసే హక్కు తెలంగాణకు ఉంది. ఇందులో ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ కే ఆర్‌ఎంబీతోపాటు కేంద్ర ప్రభుత్వం చేసే సూచనలు, ఆదేశాలు పెడచెవిన పెడుతూ.. వివాదాల పరిష్కారానికి నిర్వహించే సమావేశాలకు డుమ్మా కొట్టడడంపైనే తెలంగాణ వైఖరిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీశైలంలో నీరు డెడ్‌ స్టోరేజీకి చేరుకున్నా విద్యుత్‌ ఉత్పత్తి చేయడంతో జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయన్న ఏపీ ఆందోళనను తెలంగాణ ఏ మాత్రం పట్టించుకోలేదు. విద్యుత్‌ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర జలశక్తి శాఖ పలుమార్లు లేఖలు రాసినా తెలంగాణ ఖాతరు చేయలేదు.

ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారంగా కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీల పరిధిని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ జారీ చేసింది. గెజిట్ల అమలుపై ఈ నెల 3వ తేదీన నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశానికి తెలంగాణ గైర్హాజరైంది. ఇక 9వ తేదీన గెజిట్లలోని అంశాల అమలుపై ఇరు రాష్ట్రాల అధికారులతో కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీలు ఏర్పాటు చేసిన సమావేశాలకు తెలంగాణ డుమ్మా కొట్టింది. ఏపీ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ తాము దాఖలు చేసిన పిటిషన్లు సుప్రింలోనూ, జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ (ఎన్‌జీటీ)లోనూ విచారణకు వస్తున్నందున హాజరుకావడంలేదంటూ చెబుతూ తప్పించుకుంది. వివాదాల పరిష్కారం కోసం రెండు బోర్డులు చేస్తున్న ప్రయత్నాలకు సహకరించని తెలంగాణ ప్రభుత్వం.. అదే సమయంలో మరికొన్ని వివాదాలను రాజేసేలా ఫిర్యాదులు చేస్తుండడం రహస్య రాజకీయ ఎజెండాతో తెలంగాణ వ్యవహరిస్తోందనే అనుమానాలు బలపడుతున్నాయి.

Also Read : ఉపపోరుకు నగారా మోగబోతోంది..!

Show comments