Idream media
Idream media
దశాబ్దాల రాజకీయం అనుభవం, అధికార వైభవం పొందిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా మారిపోయిందో కుప్పం మున్సిపాలిటీలో ప్రచార తీరును పరిశీలిస్తే అర్థం చేసుకోవచ్చు.గెలుపుపై భయం, వైసీపీ కి ప్రజల్లో పెరుగుతున్న పట్టుతో భయం, జగన్ అభివృద్ధి నినాదాన్ని వింటే భయం.. వారి మాటల్లో స్పష్టంగా తెలుస్తోంది. ఒక్క మున్సిపాలిటీలో గెలుపు కోసం ఎంతలా టెన్షన్ పడుతున్నారో కనిపిస్తోంది. అధినేత చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కాలంగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ప్రధాన మున్సిపాలిటీ చేయి జారిపోతే పరువు పోతుందనే ఆందోళన వారి మాటల ద్వారా వ్యక్తం అవుతోంది. ఇరవై అయిదు వార్డులున్న కుప్పం మున్సిపాలిటీలో ఒక్క వార్డు వైసీపీకి ఏకగ్రీవం కావడం వారికి కడుపుమంట తెప్పిస్తోందన్న విషయం అర్థం అవుతోంది.
కుప్పం మున్సిపాలిటీ పై స్వయంగా చంద్రబాబు, లోకేష్ దృష్టి కేంద్రీకరించారు. పంచాయితీ, గత మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు నియోజకవర్గంలోని ప్రాంతాలను కూడా వైసీపీ కైవసం చేసుకోవడంతో కుప్పం మున్సిపాలిటీని ఎలాగైనా కాపాడుకోవాలన్న పట్టుదలతో పార్టీ అధిష్టానం ఉంది. తెలుగుదేశం జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఇప్పటికే కుప్పంలో ప్రచారం చేస్తున్నారు. సైకిలు గుర్తుకు ఓటేయాలని చంద్రబాబు సైతం వర్చువల్‌గా అందరికీ విన్నవిస్తున్నారు. త్వరలో నేరుగా మున్సిపాలిటీలో ప్రచారం చేస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా లోకేష్ నిర్వహించిన ప్రచారంలో దేవుడు, వీరుడు అంటూ తన తండ్రి చంద్రబాబు ను కీర్తించారు. ఈ సందర్భంగా కుప్పం అసెంబ్లీ నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కూడా మాట్లాడారు. ఇక్కడ నుంచి ఎప్పటికీ పోటీ చేసేది చంద్రబాబే అని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నొక్కి ఒక్కానించడం ద్వారా మున్సిపాలిటీలో కొన్ని ఓట్లయినా రాబట్టుకోవాలన్న కోరిక లోకేష్ లో కనిపిస్తోంది.
శుక్రవారం కుప్పంలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన లోకేష్ వైసీపీ అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లుగా ఈ నియోజకవర్గానికి అధికారపార్టీ నేతలు ఎవరూ రాలేదని, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని విమర్శించారు. అయితే కుప్పంను మున్సిపాలిటీగా చేసింది వైసీపీ ప్రభుత్వమే అన్న విషయం మరిచిపోయారు. 25 వార్డులున్న కుప్పం మున్సిపాలిటీలో దొంగదారిన ఒక వార్దును ఏకగ్రీవం చేసుకున్నారంటూ ఆరోపించారు. ఇదే విషయంపై చంద్రబాబు కూడా మాట్లాడారు. ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే..అధికారంలో ఉన్న పార్టీ బలవంతంగా ఏకగ్రీవాలు చేయించుకోవాలంటే.. ఒక్క వార్డుతోనే ఆగుతుందా? కానీ ఈ విషయాన్ని లేవనెత్తడం ద్వారా టీడీపీకి కలిసొచ్చే అంశం ఏంటో వారికే తెలియాలి. వాస్తవానికి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా వరుసగా ఏడు సార్లు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం లో ఒక వార్డు ఏకగ్రీవమైనా అది పార్టీ దిగజారుడు స్థితికి నిదర్శనమే. అలాంటి అంశాన్ని హైలెట్ చేస్తూ టీడీపీ నేతలు తమ గొయ్యి తామే తవ్వుకుంటున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కుప్పం ప్రజలు అమ్మకానికి సిద్దంగా లేరని కూడా లోకేష్ సెలవిచ్చారు. దీంతో ఇక్కడ ఓ విషయాన్ని ప్రస్తావించాలి. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలోను, స్థానిక సంస్థల ఎన్నికల్లోను, తాజాగా జరిగిన బద్వేలు ఉప ఎన్నికలో కూడా సీఎం జగన్ ఓ సంచలన ప్రకటన చేశారు. ఓట్ల కోసం ప్రజలకు ఒక్క రూపాయి కూడా పంచవద్దని స్పష్టం చేశారు. దీన్నిబట్టి ప్రజలను కొనే అవసరం వైసీపీకి లేదన్న విషయం అర్థం చేసుకోవచ్చు. ఏమాటకు ఆ మాట చెప్పాలంటే.. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవాలు తక్కువే. టీడీపీ గట్టిగానే నిలబడింది. కానీ కుప్పంలో ఓ వార్డు ఏకగ్రీవం పార్టీలో కలకలం రేపుతోంది. దీంతో టెన్షన్ మొదలైంది. చివరకు ఫలితం ఎలా ఉండనుందో వేచి చూడాలి.
Also Read : Tdp,Kuppam Municipal Elections-AP Elections -గెలుపు కోసం దుష్ప్రచారాలే టీడీపీ ఎజెండా?