మరోసారి అలిగిన బుచ్చయ్య.. ఈసారి నిజంగానే రాజీనామా చేస్తారా..?

టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, సీనియర్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆ పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తనకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వడంలేదనే అసంతృప్తితో ఉన్న బుచ్చయ్య చౌదరి అధినేత చంద్రబాబు తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. బుచ్చయ్య చౌదరి ఫోన్‌ చేస్తున్నా చంద్రబాబు, లోకేష్‌లు స్పదించడం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. వైసీపీ హవాలోనూ 2019 గెలిచినా తనకు తగిన ప్రాధాన్యతదక్కని నేపథ్యంలో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే మంచిదనే నిర్ణయానికి గోరంట్ల బుచ్చయ్య చౌదరి వచ్చారనే ప్రచారం జరుగుతోంది.

అయితే చంద్రబాబుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి అలగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ బాబు తీరుపై అసంతృప్తి వ్యక్తం చే సిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజీనామాకు సిద్ధపడ్డారు. 2014లో టీడీపీ అధికారంలోకి రావడంతో గోరంట్ల మంత్రి పదవి ఆశించారు. అయితే 1995 ఆగస్టు సంక్షోభంగా టీడీపీ నేతలు పిలిచే సమయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎన్టీరామారావుకు మద్ధతుగా నిలుచున్నారు. ఆ తర్వాత పరిణామాల్లో గోరంట్ల బాబు నేతృత్వంలోని టీడీపీ గూటికి చేరారు.

ప్రతిసారి ఎమ్మెల్యే సీటు రాదని ప్రచారం జరిగినా.. సొంత సామాజికవర్గ పెద్దల జోక్యంతో గోరంట్లకు సీటు దక్కేది. ఎన్టీఆర్‌ వర్గంగా ఉన్న గోరంట్లకు ఎమ్మెల్యే సీటు ఇచ్చినా.. ఇతర అంశాల్లో చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. ఈ క్రమంలోనే 2014లో మంత్రి పదవి దక్కలేదు. ఈ క్రమంలో ఆయన టీడీపీ రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానేశారు. అసెంబ్లీలోనూ మౌనంగా ఉండేవారు. విషయ పరిజ్ఞానం, వాగ్ధాటి ఉన్న బుచ్చయ్య మౌనంగా ఉండడానికి కారణం ఏమిటని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ‘‘ మనకెందుకు గొడవలు, ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నాను’’ అని ఆఫ్‌ ద రికార్డుగా చెప్పేవారు.

Also Read : మంత్రివర్గ మార్పు ఊహాగానాలు మొదలు..కానీ అధినేత ఆలోచన ఏమంటే

2017 ఏప్రిల్‌ మొదటి వారంలో చంద్రబాబు మంత్రివర్గ విస్తరణ చేశారు. ఈ సమయంలోనైనా తనకు అవకాశం వస్తుందని బుచ్చయ్య చౌదరి బలంగా ఆశించారు. అయితే ఈ సారి కూడా చంద్రబాబు మొండిచేయి చూపారు. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలలో నలుగురుకు మంత్రి పదవులు ఇచ్చి.. తనకు ఇవ్వకపోవడంతో గోరంట్లలో ఆగ్రహం గోదావరి కట్టలు తెంచుకున్నట్లుగా వ్యక్తమైంది. ఇది టీడీపీ ప్రభుత్వం కాదని చంద్రబాబు తీరును ఎండగట్టారు. 70వ పడిలోఉన్న తాను ఇంకా పదేళ్లు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని, తన సత్తా ఏమిటో చూపిస్తానని వ్యాఖ్యానించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తునట్లు ప్రకటించారు.

అదే సమయంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కౌన్సిల్‌ సమావేశం జరుగుతోంది. బుచ్చయ్య చౌదరికి మంత్రి పదవి రానందుకు నిరసనగా పాలకపక్షమైన టీడీపీ కౌన్సిలర్లు, మేయర్‌తో సహా సమావేశాన్ని రద్దు చేసుకుని, సమావేశ హాలు నుంచి బయటకు వచ్చారు. బుచ్చయ్య చౌదరి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు రాయబారిగా వచ్చారు. మంతనాల తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచనను గోరంట్ల విరమించుకున్నారు. ఆ తర్వాత 2019 వరకూ గోరంట్ల మళ్లీ రాజీనామా మాట ఎత్తలేదు.

ఈ పరిణామం జరిగిన మూడు నెలలకు 2017 జూలైలో  రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ నూతన భవన ప్రారంభ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. ఆ సమయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ అధినేత పట్ల తన విధేయతను చాటుకున్నారు. బాబుగారు.. బాబుగారు అంటూ సంబోధిస్తూ.. నియోజకవర్గ అభివృద్ధి పనుల మంజూరు జాబితాను చదవి వినిపించారు. బాబు పాలనను కొనియాడారు.

Also Read : టీడీపీకి ఆ సామాజిక వ‌ర్గం దూర‌మైన‌ట్లేనా?

అధికారంలో ఉన్నప్పుడు బాబుపై అలిగి.. ఆ తర్వాత శాంతించిన గోరంట్ల.. మళ్లీ ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు తీరుపై అలిగారు. అప్పుడు, ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదనేదే ఏకైక కారణం. 2019లో ఘోర ఓటమి, ఆ తర్వాత పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో టీడీపీ చతికలపడడంతో.. పార్టీని బలోపేతం చేసేందుకు జూనియర్‌ ఎన్టీఆర్‌ను రంగంలోకి దించాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన మనసులోని మాటను బయటపెట్టారు. లేదంటే పార్టీకి భవిష్యత్‌ లేదని కుండబద్ధలు కొట్టారు. కార్యకర్తలు తర్వాత ఈ డిమాండ్‌ వినిపించిన ఏకైక నేత గోరంట్ల ఒక్కరే కావడం విశేషం. ఈ కారణం చేతనే బాబు.. గోరంట్లపై గుర్రుగా ఉన్నారని, అందుకే పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదనే ప్రచారం జరుగుతోంది.

ఏది ఏమైనా.. ఈ సారైనా గోరంట్ల అలక.. గోదావరి గట్టుదాటి జనావాసాలను ముంచెత్తినట్లుగా.. గోరంట్ల రాజీనామా వ్యవహారం వాస్తవరూపం దాల్చి టీడీపీలో అలజడని రేపుతుందా..? లేదంటే ఎప్పటిలాగే టీ కప్పులో తుఫాను మాదిరిగా మారుతుందా..? వేచి చూడాలి. ప్రస్తుతానికైతే ఈ వ్యవహారంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పందించేందుకు ఆసక్తి చూపడంలేదు. తర్వాత మాట్లాడతానంటూ తనను కలిసిన మీడియా ప్రతినిధులకు చెబుతున్నారు.

Also Read : జ్యోతుల నెహ్రూ విషయంలో హూందా రాజకీయానికి అర్ధం చెప్పిన వైసీపీ మంత్రులు

Show comments