పంజ్‌ ‘షేర్’ పంజా దెబ్బకు పిట్టల్లా రాలిన తాలిబన్లు..?

పంజ్‌షీర్‌ పేరుకు తగ్గట్టే పంజా విసురుతుంది. అఫ్గానిస్థాన్‌ మొత్తాన్ని ఆక్రమిచుకున్న తాలిబన్లు రెసిస్టెన్స్ దళాల దెబ్బకు పిట్టల్లా రాలిపోతున్నారు.

తమకు కొరకరాని కొయ్యగా మారిన పంజషీర్ ప్రావిన్స్‌పై పట్టు సాధించడానికి వేలాది మంది తాలిబాన్లు లోయను చుట్టుముట్టారు.గత మూడు రోజుల నుంచి తాలిబన్లకు, నార్తర్న్‌ అలయెన్స్ దళాల మధ్య పంజ్‌షేర్‌ సరిహద్దుల వద్ద భీకర పోరు సాగుతోంది. నిన్న తాలిబాన్లు పంజషీర్ ప్రావిన్స్ రాజధాని బజారక్‌లోకి ప్రవేశించి గవర్నర్ కార్యాలయన్ని ముట్టడించామని తాలిబాన్ ప్రతినిధులు ప్రకటించారు.కానీ పంజ్‌షీర్ యోధులు ఆ ప్రకటనను ఖండించారు. యుద్ధం కొనసాగుతోందని పంజ్‌షీర్‌ లొంగిపోలేదని మసూద్ సేన స్పష్టం చేసింది.

తాజాగా పంజ్‌షీర్‌లోని ఖవాక్ పాస్ ప్రాంతంలో అహ్మద్‌ మసూద్‌ నేతృత్వంలోని ఉత్తర కూటమి దళాలు తాలిబన్ ఫైటర్స్‌పై ముప్పేట దాడి చేస్తూ ముచ్చెమటలు పట్టిస్తున్నారు. అక్కడ జరుగుతున్న భీకర పోరులో పంజ్‌షీర్ ప్రతిఘటన దళాలు తాలిబన్లను ధీటుగా ఎదుర్కొంటున్నాయి.శనివారం రాత్రి నుండి 600 మంది తాలిబన్ ఫైటర్లను పంజ్‌షీర్ యోధులు మట్టుబెట్టారు. మరో 1000 మంది తాలిబన్లు లొంగిపోయారని తెలుస్తోంది. పంజ్‌షేర్‌కు ప్రవేశించే మార్గాలలో ల్యాండ్‌మైన్స్‌ అమర్చి తాలిబాన్లను కాలు కదపకుండా కట్టడి చేస్తున్నారు.పైగా రెసిస్టెన్స్ దళాలు అత్యాధునిక డ్రోన్లు, బాంబులు వినియోగిస్తూ తాలిబన్ ఫైటర్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

అక్టోబర్‌ నాటికి తాలిబన్లు పంజషీర్ ప్రావిన్స్‌ని ఆక్రమించుకోకుంటే తర్వాత ఆ లక్ష్యం అసాధ్యమవుతుంది. లోయకి సహజసిద్ధ రక్షణ కవచంగా ఉన్న హిందూకుష్‌ పర్వత శ్రేణులు శీతాకాలంలో మంచుతో కప్పబడతాయి.అలాంటి క్లిష్ట పరిస్థితులలో తాలిబన్ ఫైటర్స్‌ పోరు సలపడం కష్ట సాధ్యమవుతుంది.పైగా రెసిస్టెన్స్‌ దళాలకు సుమారు ఐదు నెలల విరామం దొరికే అవకాశం ఉండటంతో వారు మరింత బలపడేందుకు వీలు చిక్కుతుంది.అదే ఇప్పుడు తాలిబాన్లను కలవరపెడుతున్న అంశం.

ఇక పంజ్‌షీర్‌లో నెలకొన్న తాజా పరిస్థితిపై ఎన్నో సందేహాలు నెలకొన్నాయి.కానీ పంజ్‌షీర్‌ యోధులు తాలిబాన్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారన్నది వాస్తవం.

Also Read : హర్షకుమార్ కలలు నెరవేరేనా?

Show comments