Idream media
Idream media
రాజకీయం ఓ రంగుల ఆట. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి చెందిన ప్రముఖుల పేర్లను, జెండా రంగులను విరివిగా వాడడం సాధారణమే. పథకాల పేర్లను కూడా మారుస్తుండడం మామూలే. ఇది దశాబ్దాల తరబడి అన్ని రాజకీయ పార్టీలూ అమలు చేస్తున్నదే. ఆ సంస్కృతి తమిళనాడులో కాస్త ఎక్కువగానే ఉంటుంది. కానీ.. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచీ స్టాలిన్ వేస్తున్న అడుగులు వర్తమాన రాజకీయాలకు భిన్నంగా ఉంటున్నాయి. ప్రజలకు ఉపయోపడే నిర్ణయాల అమలులో రాజకీయాల కంటే మంచికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఆరంభంలోనే ప్రతిపక్ష నాయకుడి ఇంటికెళ్లి.. కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి ఆహ్వానించి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన ప్రత్యర్థి, ప్రతిపక్ష అన్నాడీఎంకే అధినేత జయలలిత ఏర్పాటు చేసిన ‘అమ్మా క్యాంటీన్లను’ అదే పేరుతో కొనసాగిస్తూ సరికొత్త పంథాకు తెర తీశారు. ప్రతిపక్ష అన్నాడీఎంకే నేతల మనసులు కూడా గెలుచుకున్నారు. ఇప్పుడు మరో సంచల నిర్ణయం తీసుకున్నారు. ప్రతిపక్ష నేతల ఫొటోలతో ఉన్న బ్యాగులను పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చి అధికారులే ఆశ్చర్యపోయేలా చేశారు. స్టాలిన్ తీసుకున్న ఇలాంటి ఎన్నో నిర్ణయాలు ప్రజల్లో ఆదరణ చూరగొంటున్నాయి.
యూనివర్సిటీలు, కాలేజీలలో ప్రొఫెషనల్స్ కోర్సులలో ప్రవేశానికి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 7.5 శాతం కోటాను అందించి పేద విద్యార్థుల మనసు దోచారు స్టాలిన్. ఇది చాలా ధైర్యమైన స్టెప్ అని చాలా మంది ప్రశంసలు కురిపించారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ నిర్వహణ పాఠశాలల విశ్వసనీయతను పెంచేలా చేసింది. ఇటీవల సీఎం స్టాలిన్ ఎన్నడూ లేనంతగా పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించారు. తమిళనాడులో పెట్రోల్.. డీజిల్ ధరలు 3 రూపాయలు తగ్గించారు. దీంతో తమిళనాడు ప్రభుత్వం 1190 కోట్ల రెవెన్యూ లోటును ఎదుర్కొంటోంది. ఏదేమైనా స్టాలిన్ నిర్ణయాన్ని సామాన్యులు సైతం బాగా ప్రశంసిస్తున్నారు..
ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకుని ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీ కూడా ఆశ్చర్యపోయేలా చేశారు. 65 లక్షల స్కూల్ బ్యాగ్‌లపై అన్నాడీఎంకే మాజీ సీఎంలు జయలలిత ఎడప్పాడి పళనిస్వామి ఫోటోలు ఉంచాలని స్టాలిన్ విద్యాశాఖను ఆదేశించారు. ఈ బ్యాగులను రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేయాలని సూచించారు. కొత్త బ్యాగులు.. వస్తు సామగ్రి కోసం ఆర్డర్లు ఇవ్వడానికి బదులుగా ఉపయోగించని ఈ బ్యాగులను పంపిణీ చేయాలని సిఎం స్టాలిన్ నిర్ణయించాడు. ఇది రాష్ట్ర ఖజానాకు రూ .13 కోట్లు ఆదా చేసింది. సీఎం స్టాలిన్ తీసుకున్న ఈ నిర్ణయంతో తమిళనాడు విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి ఆశ్చర్యపోయారు. డీఎంకే క్యాడర్లోని అసంతృప్తి గురించి ఆయన తెలియజేసినా స్టాలిన్ మాత్రం వెనక్కి తగ్గలేదు.
ఇక అన్నాడీఎంకే ప్రభుత్వం ఉండగా విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే ఉద్దేశంతో ఏకంగా 65 లక్షల స్కూలు బ్యాగులు తయారు చేయించారు. వాటిపై మాజీ ముఖ్యమంత్రులు జయలలిత ఫళనిస్వామి అన్నాడీఎంకే బొమ్మలను ఉంచారు. అయితే ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓడిపోయి డీఎంకే గెలిచి స్టాలిన్ సీఎం అయ్యారు. ఈ క్రమంలోనే 65 లక్షల బ్యాగులు ప్రత్యర్థుల ఫొటోలతో ఉండడం చూసి అధికారులు డీఎంకే పార్టీ నేతలు వీటిని పంచితే అన్నాడీఎంకేకే లబ్ధి అని.. పంచవద్దని సూచించారు. కానీ సీఎం స్టాలిన్ మాత్రం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. పథకాలు పనుల్లో రాజకీయ చొరవ వద్దని.. ప్రభుత్వ చొరవ కావాలని సీఎం స్టాలిన్ సమాధానమిచ్చారు.
ఫొటోలు మార్చి కొత్త ఫొటోలతో స్కూల్ బ్యాగులు తయారు చేయాలంటే 13 కోట్లు ఖర్చు అవుతుందని.. పన్ను కట్టే ప్రజల డబ్బును ఇలా ఫొటోల కోసం వృథా చేయకూడదని స్టాలిన్ నిర్ణయించారు. ఈ డబ్బునే మరో సంక్షేమ కార్యక్రమాలకు ఉపయోగిద్దాం అని స్టాలిన్ పేర్కొనడం ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది. ప్రత్యర్థుల వాసన వస్తేనే గిట్టని సీఎంలు కేంద్రమంత్రులు పీఎంలున్న ఈరోజుల్లో కూడా ప్రత్యర్థులను కూడా మిత్రులుగా చేసేలా అభివృద్ధి కోసం పంతాలకు పోని సీఎం స్టాలిన్ మాత్రమేనని తమిళనాట ప్రశంసలు కురుస్తున్నాయి.