కడప జిల్లా రాజకీయాల్లో అందరి బంధువు మాజీ ఎంపీ ఎద్దుల ఈశ్వరరెడ్డి

వైఎస్‌ఆర్‌ కడపజిల్లా రాజకీయాల్లో ఎద్దుల ఈశ్వరరెడ్డి ఒక చెరిగిపోని చిత్రం. నిరాడంబరం, త్యాగశీలం జీవితంమంతా పొదువుకున్న మూర్తిమంతం ఆయనది. కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి 1952లో సిపిఐ అభ్యర్థిగా మొదటిసారి ఎంపికయ్యారు. అప్పటి జాతీయ కాంగ్రెస్‌లో బలమైన నాయకుడిగా ఉన్న పెంచికల బసిరెడ్డిపై గెలుపొందారు. అతరువాత వరుసగా 1962, 1967, 1971లలో జరిగిన ఎన్నికలలో కడప పార్లమెంటు సభ్యునిగా ఎంపికై రికార్డుసృష్టించారు. ఈ కారణంగా జిల్లాలో ఇప్పటి తరానికి కూడా ఈశ్వరరెడ్డి పేరు సుపరిచయమే.

ఎద్దుల ఈశ్వరరెడ్డి 1915లో జిల్లాలోని జమ్మలమడుగు తాలూకా, పెద్దపసుపుల గ్రామంలో పెద్ద భూస్వామ్య కుటుంబంలో పుట్టారు. ఆయన పుట్టే నాటికి వారియింట 600 ఎకరాల పొలంతో 6 కాండ్ల ఎద్దులతో సేద్యం నడిచేది. 6 పెద్ద మిద్దెలు గ్రామంలో ఉండేవి. ఆయన ధనవంతుల ఇంట పుట్టినా, భూస్వామ్య భావజాల స్వభావం ఆయనకు అంటలేదు. ఆయన డిగ్రీ(1936) వరకు చదివారు. గ్రామంలోని చదువుకున్న వారితో కలిసి అప్పటి బ్రిటీష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ‘మిత్రమండలి’ని ఏర్పాటుచేసి, తన రాజకీయజీవితానికి నాంది పలికారు. 1938లో జిల్లా కాంగ్రెస్‌కమిటీ సభ్యునిగా చేరి పనిచేశారు. ఆతరువాత కొన్నాలకు రమణమహర్షి భోదనలకు ఆకర్షితుడై ఈశ్వరరెడ్డి కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఈశ్వరరెడ్డి భారత స్వాతంత్రపోరాట సమయంలో కాంగ్రెస్‌ సభ్యునిగా జైలుశిక్ష అనుభవించారు. మొదట జాతీయ కాంగ్రెస్‌లో ఉన్న ఈశ్వరరెడ్డి ఆతరువాత అప్పటి రాష్ట్రకమ్యూనిష్టు నేతల ప్రోద్భలంతో కమ్యూనిష్టు పార్టీలో చేరారు.

క్విట్‌ఇండియా ఉద్యమం తీవ్రంగా జరుగుతున్న రోజుల్లో… తెలంగాణలో సాయుధపోరాటాలు జరుగుతున్న రోజుల్లో… ఈశ్వరరెడ్డి జిల్లాలో కమ్యూనిష్టు నేతగా అజ్ఞాతంలో వుండి పనిచేసారు. పార్టీపై నిషేదం ఎత్తివేసిన తరువాత 1942 నుండి బహిరంగంగా కమ్యూనిష్టు సభలలో పాల్గొనడం, జనాన్ని పార్టీవైపుకు సమీకరించడం చేశాడు. జిల్లాలో పొన్నతోట వెంకటరెడ్డి, సంగమేశ్వరరెడ్డి, పంజం నరసింహారెడ్డి, గజ్జెల మల్లారెడ్డి, కె.వి. నాగిరెడ్డి, వరదారెడ్డిలతో కలిసి ఈశ్వరరెడ్డి రాజకీయ శిక్షణా శిబిరాలను నిర్వహించారు.

Also Read:పౌరసత్వం కేసు : తెరాస ఎమ్మెల్యే ప‌ద‌వికి గండం?

ఈయన తనజీవితంమంతా హరిజనుల, వెనుకబడిన వర్గాల హక్కుల పరిరక్షణకోసం శ్రమించారు. అప్పట్లో జిల్లాలో భూస్వాములు హరిజనులపై ఎక్కడ దాడి చేసినా ఈశ్వరరెడ్డి ఆగ్రామానికి వెళ్ళి పోరాడేవాడు. ఈయన రాజకీయంగా ఎదిగిన తరువాత పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మద్దుపూరి చంద్రశేఖరరావు వంటి కమ్యూనిష్టు జాతీయ నేతలతో కలిసి రాష్ట్ర, జాతీయ సభలకు హాజరయ్యేవారు.

ఈశ్వరరెడ్డి ప్రజల మనిషి ఆయన పార్లమెంటు సభ్యులుగా ఉన్న సమయములో కూడా సైకిల్‌మీద తిరిగేవారని పెద్దలు చెప్పేవారు. సైకిల్‌మీదనే తిరుగుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజల బాగోగులు విచారించేవారని అంటారు. ఆయన నిరాడంబరతకు ఒక ఉదంతాన్ని చెప్పుకుంటుంటారు. ఎద్దుల ఈశ్వరరెడ్డి ఎన్నికల ప్రచారానికి పోయి ఆఫీసుకు వచ్చేసరికి, తన పరుపుపై ఆఫీసుబాయ్ పడుకోనుండగా, అతనిని ఎవరో లేపబోతే వారించి, తాను భుజంమీద ఉన్న టర్కీటవల్‌ పరుచుకుని పడుకునేవారు అంటారు.

ఈశ్వర రెడ్డి పార్లమెంటు సభ్యులుగా జిల్లాలో ఆకాశవాణి కేంద్రం, మైలవరం రిజర్వాయర్‌, యర్రగుంట్లలో సిసిఐ సిమెంట్‌ కర్మాగారం తదితరాలు రావడానికి కృషిచేశారు. ఈయన రాజకీయంగానే కాకుండా, సాహిత్య, కళ రంగాలలో కూడా అనేక మందిని ప్రోత్సహించారు. రా.రా., గజ్జెల మల్లారెడ్డి, వై.సి.వి. రెడ్డి, సొదుం సోదరులు, కేతు విశ్వనాథ రెడ్డి, ఆర్వీయార్‌ వంటి వారిని చాలా ప్రొత్సహించేవారని కేతు విశ్వనాథరెడ్డి అంటారు. పుట్టపర్తి నారాయణాచార్యులు ఈశ్వరరెడ్డిని ‘అన్నా’ అని సంబోధించే వారంటారు. 1986 ఆగస్టు 3 ఈయన ప్రొద్దుటూరులో మరణించారు. మరణించేనాటికి ఆయన చాలా అనారోగ్యంతో మరణించారు. ఆయన ఆస్తులన్నింటిని కమ్యూనిష్టు ఉద్యమం కోసం, పార్టీ కోసం ధారపోసారు. కమ్యూనిష్టు పార్టీ ఆఫీసు ‘హోచిమిన్‌భవన్‌’ లోనే ఆయన జీవిత చరమాంకం గడిపారు.

Also Read:తడబడిన “జేడీ” అడుగులు.. ప్రవీణ్ బాటలోకి వెళ్తాయా?

గండికోటకు ఎద్దుల ఈశ్వరరెడ్డి పేరు :

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తి అయిన గండికోట ప్రాజెక్టుకు, కమ్యూనిష్టు నేతల అభ్యర్థనను మన్నించి ఎద్దుల ఈశ్వరరెడ్డి ప్రాజెక్టుగా నామకరణం చేశారు. రాజశేఖర రెడ్డి తండ్రి వైఎస్‌ రాజారెడ్డి కొంత కాలం కమ్యూనిష్టు సానుభూతి పరుడుగా ఉండి, ఎద్దుల ఈశ్వరరెడ్డితో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. ఆయనే కాకుండా జిల్లాలోని గ్రామాలలో చాలా మంది నేతలు ఎద్దుల ఈశ్వరరెడ్డిని ఎన్నికలలో సహాయపడిన వారే. కడప జిల్లాలో ప్రతి గ్రామాలలో రెండు బలమైన గుంపులు ఉండడమే ఇందుకు కారణం.

ఈశ్వరరెడ్డి విగ్రహ ప్రతిష్టాపకుడు చదిపిరాళ్ళ నారాయణరెడ్డి :
ఎద్దుల ఈశ్వరరెడ్డి విగ్రహాన్ని ఆయన సొంత తాలూకా అయిన జమ్మలమడుగు కేంద్రం అయిన చదిపిరాళ్ళ నారాయణరెడ్డి 2008లో ప్రతిష్టించారు. నారాయణరెడ్డి, ఆదినారాయణరెడ్డి(మాజీ మంత్రి) ల కుటుంబం కూడా ఒకప్పుడు కమ్యూనిష్టుల సానుభూతి పరులే. 2008లో ప్రతిష్టించిన విగ్రహం పోలీసుశాఖ స్థలంలో ఉండడంతో అక్కడ నుండి దాన్ని తొలగించాల్సిన పరిస్థితిలో, 11-08-2021(బుధవారం నాడు) తేదీన ఎద్దుల ఈశ్వరరెడ్డి విగ్రహాన్ని జమ్మలమడుగు పాతబస్టాండ్‌లో పున:ప్రతిష్టించారు. ఈ పున:ప్రతిష్ట కార్యక్రమానికి సిపిఐ రాష్ట్రనేత నారాయణ, జమ్మలమడుగు ఎమెల్యే సుధీర్‌రెడ్డిలు హాజరయ్యారు.

Also Read:కేఆర్ఎంబీ పర్యటన ముగిసింది, నాలుగు రోజుల్లోనే నివేదిక, రాయలసీమ లిఫ్ట్ పై స్థానికుల ఆశలు

Wirtten by – Palagiri ViswaPrasad Reddy

Show comments